Sunday, December 29, 2024
HomeTelanganaకమలం.. కల్లోలం..? గూడుకు దూరమవుతున్న పక్షులు..

కమలం.. కల్లోలం..? గూడుకు దూరమవుతున్న పక్షులు..

జనపదం -సోమవారం -19-08-2024-1 E-Paper

కమలం.. కల్లోలం..?
గూడుకు దూరమవుతున్న పక్షులు..

పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలు రెఢీ..?!
సంప్రదింపులు మొదలుపెట్టిన నేతలు
హైడ్రా పై ఈటల, కొండా చెరో దారి
మెఘాపై పార్టీ, ఎల్పీది మరో దారి
ఎంపీలది ఓ ఎజెండా.. ఎమ్మెల్యేలది మరో జెండా
చేతులెత్తేసిన కిషన్ రెడ్డి

===========================

ఒకే ఒరలో ఇమడలేకపోతున్న వాతావరణం. సమఉజ్జీలుగా కలిసి సాగలేకపోతున్న వ్యత్యాసం. పార్టీ పుంజుకుంటున్న వేళ ప్రత్యేక దారులు వెతుక్కుంటున్న తీరే బాధాకరం. బలం పెరుగుతున్న సమయాన బలహీనతను ప్రదర్శిస్తున్న దుస్థితి. అంతా ఉద్దండులే.., అందరూ ఓ ప్రత్యేక పేజీ లిఖించిన వారే. అయినా పొసగని తీరే.., ఎవరికి వారే. కలిసి సాగాల్సిన వారు కకావికలమవుతున్నండగా, కలిపి నడిపించాల్సిన వారు కర్తవ్యాన్ని మరిచి నెట్టుకొస్తున్నారు. ఏతావాతగా చూసినా రాష్ట్ర కమలం ఇప్పుడు సమస్యల సమరానికి నిలయమవుతున్నది. రెక్కలు వేరుపడుతున్నాయి. బాగానే అందంగానే కనిపిస్తున్న పువ్వు., అంతర్గతంగా ప్రభను కోల్పోతున్న ఆనవాళ్లను సుస్పష్టం. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా తేరుకుని కాపాడుకుంటారో.., దారులు చూసుకుని వేరుపడతారో… !

=============================

జనపదం, హైదరాబాద్ బ్యూరో
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు పక్క చూపు చూస్తున్నారు. ఎమ్మెల్యేలకు పార్టీలో త‌గిన ప్రాధాన్యం లేక‌పోవడంతో ప‌క్క పార్టీలో చేరితే ఎలా ఉంటుందని అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు చేస్తున్నట్టు కేంద్ర పార్టీకి సమాచారం. అయితే ప్రస్తుతం అనుకూల ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో వారు స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యేలతో కనీసం సంప్రదింపుల ప్రక్రియ చేసే నాథుడు పార్టీలో కరువయ్యాడని నేతలు చెబుతున్నారు.

అధ్యక్షుడిగా అట్టర్ ఫ్లాప్..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఘోరంగా విఫలమవుతున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎనిమిది ఎంపీలను గెలుచుకున్న బీజేపీకి దిశా నిర్దేశం చేసేవారెవ్వరూ లేరు. కేంద్రంలో ఇద్దరికీ మంత్రి ప‌ద‌వులు వ‌చ్చినా పార్టీని ఏక‌తాటిపై న‌డ‌ప‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌ని, అలాగే పార్టీ అధ్యక్ష ప‌ద‌వి కోసం సీనియ‌ర్ ఎంపీలు ఆరాటం ప‌డ‌డం త‌ప్ప‌.. అంత‌ర్గత విబేధాలు చోటుచేసుకోకుండా తీసుకున్న చ‌ర్యలు క‌నిపించ‌డం లేద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలెవ్వరూ కిషన్ రెడ్డి మాట వినడం లేదు. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభిస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే రాలేదు. ఇటీవల పదాదిదారుల స‌మావేశానికి నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా మాత్రమే హాజ‌ర‌య్యారు. మిగిలిన వారు ఎందుకు హాజ‌రు కాలేద‌న్న చ‌ర్చ కూడా జ‌ర‌గ‌లేదని, క‌నీసం వారిని మీటింగ్‌కు ఎందుకు రాలేద‌ని అడిగే నాథుడే కూడా క‌రువ‌య్యార‌ని తెలుస్తోంది.

హైడ్రా పై ఈటల, కొండా చెరో దారి
బీజేపీలో లెఫ్ట్ రైట్ గ్రూపులుగా విడిపోయారు. చివరకు అక్రమ కట్టడాలపై కాషాయ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కూల్చివేతల పట్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓకే చెబుతుంటే అలా ఎలా కూల్చుతారని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అభ్యంతరాన్ని చెబుతున్నారు. కూల్చివేతల పట్ల సీరియస్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఎంపీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండటంతో పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగునున్న వేళ పార్టీలోని కీలక నేతలు పరస్పర విరుద్ధంగా ప్రకటనలతో క్యాడర్ అయోమయంలో పడుతోంది. దీంతో హైడ్రాపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని బీజేపీ క్షేత్రస్థాయి శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.
ప్రభుత్వ భూముల్లో ఆక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నెలరోజుల్లోనే రేవంత్ సర్కార్ 100 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంది. కాగా.. గడిచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గస్థాయిలో కార్పొరేటర్లను గెలుచుకుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న, మహానగరపాలక శివారు డివిజన్లలోనే బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం హైడ్రా చట్టం కింద శివారు ప్రాంతాల్లోనే హైడ్రా కూల్చివేతలు జరుగుతుండడంతో ఆ అంశంలో పార్టీ నాయకత్వం ఆచి తూచి స్పందించాల్సిన అవసరం ఉందని కేడర్ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇకపై బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ ఏ మేరకు నడుచుకుంటారో వేచి చూడాలి.

మెఘాపై పార్టీ, ఎల్పీది మరో దారి..
సుంకిశాల వాల్ కూలిన వ్యవహారం బీజేపీలో వేరియేషన్ ను కళ్లకు కట్టినట్టు చూపుతున్నది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగా ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ ఏలేటి మహేశ్వర రెడ్డి సొంతంగానే ముందుకు సాగుతున్నారు. స్వయంగా ఘటనాస్థలికి వెళ్లడం, కారకులపై నిప్పులు చెరగడం మీడియా మొత్తం కోడై కూసింది. మెఘా సంస్థ బీజేపీకి ఎంతో చేదోడువాదోడుగా ఉంటుందనే విషయం ఆయనకు తెలియనిది కాదు. ఆ మాటకొస్తే మెఘా సంస్థల యాజమాన్యం ఫోకస్ పెడితే తన పరిస్థితి ఏమవుతుందో కూడా ఎరగనంత అమాయకుడేం కాదు. అయినా తెగించిన ఏలేటి మీడియా ముందు మెఘా పుట్టుపూర్వోత్తరాలు బయటపెట్టి నడిబజార్లు నిలబెట్టాడు. సుంకిశాల విషయంలో పార్టీ నుంచి స్పందించిన ఒకే ఒక్కడిగా ఆయనకు రికార్డే ఉంది. పార్టీ మొత్తం ఒకదారి., మహేశ్వర రెడ్డిది మరో దారి అన్నట్టుగా ఆ ఎపిసోడ్ ఇంకా సాగుతూనే ఉంది.

ఎంపీలది ఓ ఎజెండా.. ఎమ్మెల్యేలది మరో జెండా
బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇద్దరు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నా.., మిగతా వారిలో సీనియర్లు కేవలం ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఇద్దరు మంత్రులు ఎవరికి వారే అన్నట్టుగా వాతావరణం ఉండగా, మిగతా ఎంపీల్లో రాష్ట్ర అధ్యక్ష పీఠంపై కన్నేసిన వారు ముగ్గురికి మించే ఉన్నారు. ఎవరి రాజకీయంలో వారు, ఎవరి అనుయాయులతో వారు ప్రత్యేక సంప్రదింపులు., మంతనాలు నెరుపుతూ పార్టీ ప్రయోజనం కంటే పదవుల పంపకం, వ్యక్తిగత ఉబలాటంపైనే దృష్టి సారిస్తున్నారనేది చూస్తున్న పరిణామాలను బట్టి ఇట్టే చెప్పొచ్చు.

చేతులెత్తేసిన కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దాదాపు చేతులెత్తేసినట్టుగానే అనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దాల్సిన బాధ్యతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విషయం ఆయన ప్రవర్తిస్తున్న తీరుతో తెలిసిపోతున్నది. నిర్వహించిన సమావేశాల్లో ఆయన తప్ప మరెవ్వరూ కనిపించకున్నా కనీసం విచారణ కూడా చేసేందుకు సమయం కేటాయించని ఆయన తీరును ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. పార్టీని ముందుండి నడిపించాల్సిన హోదాలో ఉండి కూడా తనకెందుకులే అనే ధోరణిలో సాగడం ఆయన ఫెయిల్యూర్ ను చూపుతున్నది. బాధ్యత నిర్వర్తించడం భారంగా మారిందా.., అంతా హేమాహేమీల నడుమ పట్టించుకునే వారే కరువయ్యారా.. గానీ కిషన్ రెడ్డి పీఠంలో కూర్చుని చేతులు ఎత్తేసిన చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. అదే సమయంలో స‌మావేశాల్లో ఎమ్మెల్యేల‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వడం లేద‌ని అసంతృప్తి వ్యక్తం అయిన‌ట్టు తెలుస్తోంది. ఇదే అంత‌ర్గత విబేధాల‌కు తెర‌ తీసింది. ఎమ్మెల్యేల‌ను బుజ్జగించ‌క‌పోతే పార్టీపై ప్రభావం ప‌డుతుంద‌ని ప‌లువురు అభిప్రాయప‌డుతున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు