Saturday, January 4, 2025
HomeTelanganaహైడ్రా.. హడల్... నేతలవే.. నేలమట్టం

హైడ్రా.. హడల్… నేతలవే.. నేలమట్టం

జనపదం – సోమవారం -26-08-24 E-Paper

హైడ్రా.. హడల్…
నేతలవే.. నేలమట్టం

టార్గెట్ అపోసిషన్
18 చోట్ల కూల్చివేతలు..
43 ఎకరాల స్థలాన్ని కాపాడిన కమిషన్
వీఐపీలు, రియల్ ఎస్టేట్ కబ్జాలపై స్పెషల్ ఫోకస్..

స్వీకరించిన వారు పట్టికుని, అప్పగించిన వారు వదిలేస్తే పనిలో ఉండే మజాయే వేరు. చూసేవారు సైలెంట్ గా ఉన్నప్పుడే చేసేవారు అది పూర్తిగా తమదిగా భావించి భుజాలపైకి ఎత్తుకుని తామేంటో నిరూపించుకుంటారు. చేతులకు కల్పించిన పనిని.., స్వేచ్ఛనిచ్చిన ఆలోచనలను పూర్తిస్థాయిలో వినియోగిస్తారు. అలాంటి వాతావరణంలోనే అనుకున్నది జరుగుతుంది., చూడాలనుకున్నవి కళ్లముందు సాక్షీభూతమవుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న హైడ్రా పనితీరే అందుకు నిదర్శనం. రాష్ట్ర సర్కార్ కమిషనర్ కు బాధ్యతలు అప్పగించి కనీసం నెల రోజులు కూడా కాకముందే తానేంటో ప్రత్యక్షంగా చూపించార.., అప్పగించిన పనిలో క్లారిటీ మిస్ కాకుండా అనుకున్నది చేస్తూ వెళ్తున్నారు. ఒత్తిళ్లు లేకపోతే ఏదైనా చేయగలమని రంగనాథ్ అండ్ టీం నిరూపిస్తుండగా, ఆదివారం సీఎం రేవంత్ కు అప్పగించిన నివేదికే దానికి సాక్షంగా నిలుస్తున్నది. ఏదిఏమైనా గగ్గోలు పెడుతున్న పెద్దలు, గంభీరంగా నవ్వుతున్న చెరువులే హైడ్రా ప్రకంపనల తాకిడికి ప్రత్యక్ష కొలమానాలు.

జనపదం, బ్యూరో

దటీజ్ హైడ్రా.. ముందుకెళ్లడమే తప్ప వెనక్కి తిరిగి చూసేది ఉండదు. మొండిగా సాగడమే తప్ప ముందువెనక ఆలోచించేది ఉండదు. తన పర భేదముండదు., చిన్నాపెద్దా స్థాయిల పట్టింపు అంతకన్నా లేదు. సర్కార్ భూమినా., ప్రజలకు అన్యాయం జరుగుతున్న విషయమా.. అంతే దాని భరతం పట్టడమే., నిబంధనలు అతిక్రమించారా.., అక్రమంగా చరబట్టారా.. ఇక అంతే తిరిగి లాగేయడమే. పట్టుమని నెల రోజులు కూడా కాకుండానే చేసిన పనులే హైడ్రా తీరేంటో చూపుతుండగా, గగ్గోలు పెడుతున్న నోళ్లే దాని దూకుడు బాధ ఎలా ఉందో తెలియజెప్పుతున్నది.

నెలరోజులు.. నేలమట్టాలు..
నెల రోజులుగా హైదరాబాద్ లో నేలమట్టాల పర్వం కొనసాగుతున్నది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ బాధ్యతల స్వీకరణ తర్వాత ఆక్రమించుకుని కులుకుతున్న బడా బాబుల కూసాలు కదులుతున్నాయి. చెరువు శిఖం, ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ల లో ఆకాశాలను తాకే కట్టడాలు, మరీ ముఖ్యంగా ఫామ్ హౌజుల పేరిటా ఎకరాల మేర చెరువుల భూములను హస్తగతం చేసుకున్న స్థలాలను బలవంతుల చెర నుంచి స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నాయి. ప్రకృతిని వశం చేసుకోవాలని డబ్బుతో అత్యాశకు పోయిన వారందరిని నేలకు దింపేందుకు హైడ్రా దూకుడుగా ముందుకెళ్తున్నది. దీంతో మహానగరంలో ఎక్కడ చూసిన ఆ ముచ్చటే, ఎవరిని కదిపినా దాని తాలూకు చర్చే.

18 చోట్ల కూల్చివేతలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాల సంగతి తేల్చడానికి ఏర్పాటు చేసిన హైడ్రా విశ్వరూపం చూపుతున్నది. ఎవరినీ వదలకుండా ఉక్కుపాదం మోపుతున్నది. తుమ్మిడి కుంటు చెరువును ఆక్రమించిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను శనివారం నేలమట్టం కావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొన్న జన్వాడ ఫామ్ హౌజ్, దానికి ముందు పలు చెరువుల పరిసరాల్లోని ఆక్రమణల కూల్చివేతలు జరిగాయి. కాగా, ఇప్పటి వరకు హైడ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన కూల్చివేతల నివేదను సీఎం రేవంత్ రెడ్డికి కమిషనర్ ఆదివారం అందజేసింది. నివేదిక ప్రకారం 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్టు తెలుస్తోంది.
.
43 ఎకరాల స్థలాన్ని కాపాడిన కమిషన్
నగరంలో స్థలాలను కబ్జా చేసిన ప్రముఖుల నుంచి లాక్కున్న చరిత్ర హైడ్రా సొంతమైంది. ఎన్ కన్వెన్షన్ ఉదంతానికి ముందే కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రోకబడ్డీ ఓనర్ అనుపమ, పల్లం రాజు, సునీల్ రెడ్డిలకు చెందిన కట్టడాలు, అలాగే బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజుకు చెందిన నిర్మాణాలను నేలమట్టం చేసినట్టు నివేదికలో తెలియజేసింది. వీఐపీలే కాకుండా బంజారాహిల్స్, గాజుల రామారం, అమీర్ పేట్, లోటస్ పాండ్, మన్సూరాబాద్, బీజేఆర్ నగర్ లలో నిర్మాణాలను కూడా కూల్చేసినట్టు హైడ్రా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వివరించింది. మొత్తంగా నగర పరిధిలో సుమారు 43.94 ఎకరాల్లో చెరువులను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేశారు.

వీఐపీలు, రియల్ ఎస్టేట్ కబ్జాలపై స్పెషల్ ఫోకస్..
మహానగరంలో చెరువులను చేబట్టింది రియల్ ఎస్టేట్ దారులు, వీఐపీలే అని స్పష్టంగా తెలడంతో హైడ్రా వారి వ్యవహారాలపై దృష్టి సారించింది. అక్రమంగా వెలసిన వెంచర్లు, అనుమతుల్లో చూపిన విషయాలు, అతిక్రమించి చేసిన ఏర్పాట్లపై నిఘా పెట్టింది. బడా బాబులుగా చెలమణి అవుతూ పలుకుబడిని అడ్డం పెట్టుకుని సాగించిన దౌర్జన్యకాండను తుంచేసేందుకు హైడ్రా ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసుకుని రంగంలోకి దూసుకెళ్తున్నది. పైగా సర్కార్ పెద్దలు కూడా చెరువులు ఆక్రమించిన వారి వివరాలు నిర్బయంగా ఇవ్వాలని సూచించడంతో హైడ్రాకు కూడా పనికాస్త తేలికే అవుతున్నది. జంగ నగరాల్లో హైడ్రా వణుకు మాత్రం ప్రతి కబ్జాదారుడిలో స్పష్టంగా కనిపిస్తున్నది.

RELATED ARTICLES

తాజా వార్తలు