హైదరాబాద్ లో రేపు బడులకు సెలవు
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాదు నగరంలోని బడులకు సెప్టెంబర్ 2వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలలకు, ఎయిడెడ్ పాఠశాలలకు అన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుంది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాదు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. వర్షాలు ఉదృతంగా కురుస్తుండడంతో జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను హైదరాబాద్ లో సిద్దంగా ఉంచారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.