ఏజెన్సీలో అలజడి..
కలకలం రేపుతున్న కాల్పుల మోతలు..
నిత్యం ఎన్ కౌంటర్లు.. మరణ వార్తలు..
నిన్న ఛత్తీస్ గఢ్ ల తొమ్మిది మంది.., నేడు భద్రాద్రిలో ఆరుగురు మావోయిస్టుల హతం..
భయం గుప్పిట్లో అటవీ పల్లెలు…
అడవులు అలజడికి నిలయాలవుతున్నాయి. పచ్చని ప్రకృతి నెత్తురు రంగు పులుముకుంటున్నది. రోజుకో చోట పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకరపోరు ఉద్రిక్త పరిస్థితులను కలిగిస్తున్నది. ఛత్తీస్ గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా బార్డర్లలో ఎక్కడేం జరుగుతుందో., ఎప్పుడేం వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంటున్నది. రెండు రోజులుగా వరుస ఎన్ కౌంటర్లతో భయానక వాతావరణం నెలకొంది. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మరణించి 24 గంటలు కూడా గడవకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాల్పుల కలకలం మరో మారు ఉలిక్కిపడేలా చేసింది. గురువారం జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందడంతో ఏజెన్సీలో ఏం జరుగుతుందో అర్థం గాక హైటెన్షన్ నెలకొంది.
======================
జనపదం, బ్యూరో
అడవులు దద్దరిల్లుతున్నాయి. బూట్ల చప్పుళ్లు, కాల్పుల మోతలకు కేరాఫ్ గా మారుతున్నాయి. పచ్చని చెట్ల నీడతో, సెలయేళ్ల గలగలలతో మనస్సు ప్రశాంతతను కల్పించాల్సిన అరణ్యాలు, రక్తం ధారలతో భయానకంగా మారుతున్నాయి. ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ బార్డర్ నిత్యం తుపాకీ శబ్దాలు, మృతదేహాల మోతలతో ఉత్కంఠగా మారుతున్నాయి. పోలీసుల కూబింగ్ లతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కున కాలం గడుపుతుంటే, నిత్యం ఏదో ఓ చోట జరుగుతున్న ఎన్ కౌంటర్లు ఇంకా ఆందోళనకరమైన పరిస్థితులను క్రియేట్ చేస్తున్నాయి. ఉదయం లేస్తే చాలు ఏ వార్త వినాల్సి వస్తుందోనని సమీప ప్రాంతాల ప్రజలు వణుకుతూ గడుపుతుండగా, ఏ బిడ్డకు కాలం చెల్లిందోనని భయంతో తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులతో కాలం వెల్లదీస్తున్నారు.
=============
భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్‌కౌంటర్
ఆరుగురు మావోలు మృతి
జనపదం, భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, లచ్చన్న దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఎదురు కాల్పుల్లో ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి.ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న దళం నీలాద్రి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం తెలియడంతో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టారు. లచ్చన్న దళం సభ్యులు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పులు జరగడంతో ఆరుగురు మావోలు మృతి చెందారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని భద్రతా బలగాలు వెల్లడించాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే 15 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహదుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోలు మృతి చెందారు. మృతులలో మావోయిస్టు అగ్రనేత, తొలి తరం నాయకుడు మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ ఉన్నట్టు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.