Sunday, December 29, 2024
HomeTelanganaOperation HYDRA | హైడ్రా పంచాయతీ హస్తినకు

Operation HYDRA | హైడ్రా పంచాయతీ హస్తినకు

హస్తినలో ‘హైడ్రా’ మా
ఖర్గే ముందుకు పంచాయతీ
మధ్యవర్తిగా కన్నడ నేత
కూల్చివేతలపై ఏఐసీసీ చీఫ్​కు ఫిర్యాదులు
ఢిల్లీలో ఓ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు
ఎట్టకేలకు భరోసా ఇచ్చిన ఖర్గే
ప్రస్తుతానికి బడా నేతల నిర్మాణాలు పదిలమే
జిల్లాల్లో విస్తరణకు సైతం బ్రేక్​

హైడ్రా పంచాయతీ హస్తినకు చేరింది. ఎంత చెప్పినా సీఎం రేవంత్​రెడ్డి వినకపోవడంతో.. ఖర్గే దగ్గర సొంత పార్టీ నేతలే పంచాయతీ పెట్టారు. చెరువుల ఆక్రమణల పేరుతో నిర్మాణాలను కూల్చితే.. పార్టీ ఫండ్​కు ఎసరు వస్తుందని ఏకరు పెట్టారు. రెండు రోజుల పాటు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు, ఓ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు హైడ్రా విషయంలోనే ఢిల్లీలో మకాం వేశారు. వీరికి కర్ణాటకకు చెందిన ఓ ముఖ్యనేత రాయబారిగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాల్లో టాక్​. ఈ నేపథ్యంలోనే హైడ్రా ఒక్కసారిగా రూట్​మార్చింది. రాత్రికి రాత్రే ఏఐసీసీ నుంచి ఆదేశాలు రావడంతో.. సీఎం సైతం తీరు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఎట్టకేలకు హైడ్రా దూకుడుకు బ్రేక్​ పడింది.

ప్రస్తుతానికి స్లో
రాజకీయ, వ్యాపార, సినీరంగ ప్రముఖుల నిర్మాణాలను హైడ్రా టార్గెట్​ చేసింది. ఇటు జన్వాడ ఫాంహౌస్​తో పాటుగా ఓ మంత్రి, మరో ఎమ్మెల్యేకు సంబంధించిన నిర్మాణాలకు సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా అంటే వణుకు మొదలైంది. అయితే, విపక్ష నేతలు, ఇతర రంగ ప్రముఖుల విషయం పక్కనపెడితే.. అధికార పార్టీలోని కొంతమంది నిర్మాణాలు కూడా ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లో ఉన్నట్లు గుర్తించారు. వాటన్నింటీ జాబితాను తీసిన హైడ్రా.. సీఎంకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక.. సీఎంఓ నుంచి బయటకు వచ్చింది. అంతకు ముందు పల్లంరాజు నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేయడంతో.. సొంత పార్టీ నేతలు సర్దుబాటు పనిలో పడ్డారు. స్థానికంగా సీఎం మాట వినకపోవడంతో.. హస్తిన ఫ్లైట్​ ఎక్కారు. మధ్యవర్తిగా ఓ కన్నడ మంత్రిని వెంటతీసుకుని ఖర్గే దగ్గరే పంచాయతీ పెట్టారు.

వద్దు… ఆగండి !!
గత నెల రోజుల నుంచి నగరం, శివారు ప్రాంతాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ దూకుడుగా ముందుకు వెళ్తున్న హైడ్రా కు ప్రభుత్వమే కళ్లెం వేసింది. ఇకపై చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో ఇది వరకే జరిగిన కట్టడాల జోలికి వెళ్లొద్దని హైడ్రా కమిషనర్ కు సూచించింది. నిర్మాణ దశలో ఉన్న పనులను మాత్రమే అడ్డుకుని వాటిని కూల్చేయాలని ఆదేశించింది. ఈ విషయంపై హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. దీంతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిన్నటి వరకు.. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో వందలాది ప్రాంతాలు, నివాస, వ్యాపార సముదాయాలు ఏటా ముంపునకు గురవుతున్నాయనీ, ఈ ప్రకృతి విపత్తి నుంచి బయపడాలంటే ఆక్రమిత స్ధలాల్లో నిర్మించిన కట్టడాలను కూల్చేస్తామన్న రంగనాథ్.. అనూహ్యంగా ఈ నిర్షయం తీసుకోవడం వెనక మతలబు ఏమిటోననే చర్చ జరుగుతున్నది. మరోవైపు హైడ్రా వ్యవస్థనే రద్దు చేయాలంటూ ప్రభుత్వంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల నుంచి ఒత్తిడి పెరిగింది.
ఈ వ్యవహారంపై ఏఐసీసీ చీఫ్​ ఖర్గే నుంచి సీఎం రేవంత్​కు పలు సూచనలు వచ్చినట్లు పార్టీలో టాక్​. అంతేకాకుండా.. హైడ్రాపై వ్యతిరేకమైన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు.. ఖర్గే ముందు నిధుల విషయంలోనూ అల్టిమేటం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రం నుంచి ఏఐసీసీకి, నేతలకు వచ్చే ఫండ్స్​ కూడా బ్రేక్​ పడుతాయని వివరించారు. ఫలితంగా.. ఖర్గే దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఖర్గే నుంచి వచ్చిన ఆదేశాలతో.. సీఎం రేవంత్​ రెడ్డి సైతం వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

వెనడుగుకు వేసినట్టేనా..?
రాష్ట్ట్ర రాజధాని, శివారు ప్రాంతాల్లో కబ్జాకు గురైన వందలాది చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ష్థలాల్లో నిర్మితమైన కట్టడాలను కూల్చి ఆయా భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో వాటిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హైడ్రా వ్యవస్ధను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఆక్రమిత చెరువులు, కుంటల వివరాలు సేకరించిన హైడ్రా.. వాటిలో నిర్మించిన కట్టడాల యజమానులకు నోటీసులు ఇచ్చి నిర్మాణాలను నేటమట్టం చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో ఇప్పటికే సుమారు రెండొందల అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. కూల్చివేతల పరంపర మొదలైన ఆదిలోనే జన్వాడలో ఉన్న ప్రతిపక్ష నేత కేటీఆర్ కు సంబంధించినట్టు ప్రచారం జరుగుతున్న ఫాం హౌస్ ను కూల్చివేసేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసుకున్నది. దాంతో ఆ ఫాం హౌస్ తనది కాదని తన మిత్రుడి వద్ద లీజుకు తీసుకున్నానని కేటీఆర్ వివరణ ఇవ్వగా, ఆ ఫాం హౌస్ తనదంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో జన్వాడ ఫాం హౌస్ అక్రమంగా నిర్మించి ఉంటే కూల్చివేయాలని హైడ్రాకు సూచించిన హై కోర్టు.. నిబంధనల ప్రకారం కూల్చివేతలు జరగాలని ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
అదే సమయంలో కేటీఆర్ సైతం.. అధికార పార్టీకి చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫాం హౌస్ సైతం హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లో ఉందంటూ ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్న ఆయన.. తను లీజుకు తీసుకున్న ఫాం హౌస్ తో పాటు అధికార పార్టీ నేతల ఆస్తులనూ నేలమట్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టిన అధికార పార్టీకి చెందిన ఖైరతాబాద్ దానం నాగేందర్ పై కేసు నమోదు చేసిన హైడ్రా.. ప్రతిపక్ష పార్టికి చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేయడం రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. ఇదే క్రమంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల రూపంలో ఖమ్మంను ముంచెత్తడంతో.. అక్కడి ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. హైడ్రాను రాష్ట్ర్యవ్యాప్తంగా విస్తరిస్తామని సంచలన ప్రకటన చేశారు. సీఎం చేసిన ఈ ప్రకటన ప్రతిపక్ష నేతలను అటుంచితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకుల్లో ఇరకాటంలో పడేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా లేనట్టే..!
హైడ్రాను అన్ని జిల్లాలకు విస్తరించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ, ఏర్పాటుచేసిన హైద్రాబాద్​లోనే ఆటంకాలు రావడం, ఏకంగా ఏఐసీసీ చీఫ్​ నుంచే ఒత్తిడి రావడంతో.. ఇక హైడ్రా విస్తరణకు బ్రేక్​ పడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుపై ఫైల్​ కదలాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు. దీంతో విస్తరణ ఆగిపోయినట్టే.

RELATED ARTICLES

తాజా వార్తలు