Sunday, December 29, 2024
HomeTelanganaTelangana Congress | కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల ఆగ్ర‌హం

Telangana Congress | కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల ఆగ్ర‌హం

JanaPadham_EPaper_TS_20-09-2024

*కేబినెట్.. కాక..
క్యాప్షన్ : సీనియర్స్… సీరియస్..*

హైడ్రాకు అధికారాలపై ఆగ్రహం..
రైతు ‘భరోసా’ కోల్పోవడంపై పెదవి విరుపు..
మాఫీ సాఫీగా లేదని విమర్శనాస్ట్రం…
ఫ్యూచరే లేని సిటీపై హైకమాండ్ కు ఫిర్యాదుల పరంపర..
నేడు కేబినెట్ భేటీ..
కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకతపై ప్రధాన చర్చ..
సూటిగా సాగేనా.. సుత్తిగా మిగిలేనా..?

విడివిడిగానే ఉమ్మడి నిర్ణయాలు. ఉమ్మడిగానే వేర్వేరు అభిప్రాయాలు. పైకి అంతా భేష్. ఎదురెదురుగా కనిపిస్తే సూపర్. పలకరించుకుంటే అబ్బో.., ఇక మరో లెవలే. కానీ, లోపలన్నీ గోతులు తవ్వే గుణపాలే. చేతికి చిక్కితే కత్తిరించే కుట్రలే. ఒక్కొక్కరిది ఒక్కో అవసరం. తప్పనిసరై కలిసి నడవడమే తప్ప, తేల్చుకునే వరకు వస్తే తొక్కుకుంటూ వెళ్లేతనమే. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర కేబినెట్ మంత్రులంతా ఎవరి అంతర్గతంలో ఏముందో అందరికీ తెలిసిన బహిర్గతమే. ఎవరి మనస్సు ఏం కోరుకుంటుందో సుస్పష్టమే. కొత్తబ్బాయి చురుగ్గా ఉరుకుతున్నాడు, పాతవారిని పట్టించుకోవడం లేదనే అసంతృప్తి అందరిలోనూ ఉంది. ‘ప్రయోజనాలు పాతరేస్తున్నాడు.., కలలను నేల కూలుస్తున్నాడు.. ’ అనే కసి కూడా రోజురోజుకు పెరుగుతున్నది. అందునా నేటి మీటింగ్ లో ‘హైడ్రా’కు సర్వ హక్కులూ అనే దిశగా దూసుకెళ్తున్న ఆయన తీరుపై కోపంగా ఉన్నారు. ఎన్ని మలుపులో, మరెన్ని మెరుపులోగానీ కేబినెట్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠే.

కేబినెట్.. కాక..
క్యాప్షన్ : సీనియర్స్… సీరియస్..

హైడ్రాకు అధికారాలపై ఆగ్రహం..
రైతు ‘భరోసా’ కోల్పోవడంపై పెదవి విరుపు..
మాఫీ సాఫీగా లేదని విమర్శనాస్ట్రం…
ఫ్యూచరే లేని సిటీపై హైకమాండ్ కు ఫిర్యాదుల పరంపర..
నేడు కేబినెట్ భేటీ..
కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకతపై ప్రధాన చర్చ..
సూటిగా సాగేనా.. సుత్తిగా మిగిలేనా..?

జనపదం, బ్యూరో

కేబినెట్ మీటింగ్ కాకరేపబోతున్నదా.? అంటే పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలుండడంతో అంతా ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి కొన్ని విషయాల్లో ఒంటెత్తు పోకడలు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సీనియర్లంతా ఇప్పటికే గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో బహిర్గతంగా కూడా వ్యక్తీకరించారు గూడా. మరీ ముఖ్యంగా హైడ్రా రంగ ప్రవేశం నుంచి సీఎంకు మంత్రులకు మధ్య అంతరం పెరిగిందనేది కాదనలేని నిజం. ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఏదో చేయబోతే అది తమకే చుట్టుకోబోతోందని కఠోర వాస్తవం పలువురు మంత్రులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి చూసే ప్రయత్నం చేసి విఫలమవడంతో తప్పని సరై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మధ్యలో హైడ్రా కాస్త నెమ్మదించినట్టు కనిపించినా మళ్లీ వేగం పుంజుకుంటున్నది. ఏదిఏమైనా కానివ్వుగాక హైడ్రాను వదిలేది లేదు., పనిని మధ్యలో ఆపేది లేదు అన్నట్టుగా రేవంత్ అండ్ కమిషనర్ రంగనాథ్ ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనం.
కాగా, సెప్టెంబర్ 20న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

హైడ్రాకు అధికారాలపై ఆగ్రహం..
హైదరాబాద్ చుట్టు పక్కల చెరువులు, కుంటల్లో అక్రమంగా వెలిసిన కట్టడాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న హైడ్రాపై అందరి చూపు పడింది. సీఎం ఎవ్వరినీ లెక్కచేయకా సాగిస్తున్న ఈ కూల్చివేతల ప్రహసనంపై సీనియర్లు సీరియస్ గా ఉన్నారు. పార్టీకి నష్టం కలిగించే ఇలాంటి చర్యలతో మున్ముందు కష్టమే అని ఏకంగా ఢిల్లీ పెద్దల చెవిలోనే విషయాన్ని చేరవేశారు. పార్టీ గురించి తెలియని, మధ్యలో వచ్చిన వారితో ఇలాంటి ఉపద్రవాలే ఉంటాయని చెప్పాల్సినవన్నీ చెప్పి నిర్ణయాన్ని వారికే వదిలేశారు. ఇప్పుడు హైడ్రాకు పూర్తి అధికారులు కట్టబెట్టే నిర్ణయంపై అంతా కూర్చుని మాట్లాడాల్సిన సమయం రావడంతో తప్పకుండా వాడివేడిగానే సాగే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.

రైతు ‘భరోసా’ కోల్పోవడంపై పెదవి విరుపు..
కాంగ్రెస్ బలం మహిళలు, రైతులే. అలాంటి అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వడంలో సీఎం పూర్తిగా విఫలమైన విషయం రాష్ట్రవ్యాప్తంగా తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రతిపక్ష పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి మార్కులు కొట్టేస్తుంటే సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు. ఎంత చేసినా రైతులకు గత ప్రభుత్వం ఇచ్చినవి సక్రమంగా ఇవ్వకపోతే తప్పకుండా ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందనే అసంతృప్తితో మీటింగ్ లో చర్చించే అవకాశాలున్నాయి.

మాఫీ సాఫీగా లేదని విమర్శనాస్ట్రం…
పేరు గొప్పగా అన్నట్టుగా రూ.2 లక్షల రుణమాఫీ చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ చూపుతున్న లెక్కలకు ఎక్కడా ఖండనలు లేకుండా చేసినా ఆధారాలు లేకుండా నెట్టుకొస్తున్న విషయం ఇప్పుడు కేబినెట్ లో తీవ్ర దుమారమే రేపే అవకాశాలున్నాయి. సీఎంది ఒక మాట, మంత్రులది తలోమాట అన్నట్టుగా ఇప్పటికే మాఫీపై ప్రభుత్వం అపప్రదను మూటగట్టుకున్నది. ఫ్యూచర్ సిటీపై కూడా గత ప్రభుత్వం సేకరించిన భూమిని ఇతరాల కోసం వాడాలనే ఆలోచనలో ఉన్న రేవంత్ కు మంత్రి వర్గం నుంచి వ్యతిరేక వ్యక్తమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. రైతుల నుంచి భూసేకరణ చేసి, ప్రాజెక్ట్ ఓకే అయిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ స్టెప్ బ్యాక్ కోసం తీసుకుంటున్న తీరు వారి మధ్య సఖ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నది.

సూటిగా సాగేనా.. సుత్తిగా మిగిలేనా..?
కాక సరిగ్గానే ఉన్నాడు.. కానీ, కాళ్లల్లో కట్టె పెట్టే బ్యాచ్ అనుసరిస్తున్నది. ఏదో చేయాలనే పట్టుదలను నీరు గార్చే ప్రయత్నపు దారులు నీడలా వెంబడిస్తున్నాయి. ఆవేశాలకు పనులు కావాని, ఆలోచనలతో నెరవేర్చుకోవాలనే ‘సీనియర్’ సెటప్ కాచుకుని కూర్చుంది. పెట్టాల్సిన చోట లిటిగేషన్ పెట్టి, చూద్దాం… ఏ జరుగబోతోందోననే దీర్ఘదృష్టితో నిశ్శబ్దంగా నిరీక్షిస్తున్నది. అవకాశం వినియోగించుకోవాలని ఆయన పట్టుమీద ఉండడం, అవును…. మేము చెప్పబోయేది కూడా అదే.. అవకాశాన్ని వినియోగించుకుని వెనకేసుకుందామని వీళ్లు బెట్టుకుపోవడం.. తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాక మీదున్న కేబినెట్ సీనియర్లు., ఇప్పుడు భేటీలో సూటిగానే చెబుతారో.., సుతిమెత్తగా ఎక్కిస్తారో చూడాలి మరి..

RELATED ARTICLES

తాజా వార్తలు