చట్టం చుట్టమైందా…? !
హైడ్రా(HYDRAA) చిట్టాలో 25 బడా సంస్థలు..
ఎన్ కన్వెన్షన్ తప్ప మరో సంస్థ జోలికి పోని వైనం..
దుర్గం చెరువు విషయంలో ఆగిన కూల్చివేతలు..
చిన్న ఆక్రమణలే లక్ష్యం.. పేదోడే టార్గెట్..
బలహీనులకు నోటీసులు ఉండవు.. సీఎం సోదరుడికి మాత్రం నోటీసులు..
సామాన్యుడు కోర్టు కెళ్తే మరింత దూకుడు..
దుర్గం చెరువుకు మినహాయింపు.. బాధితులకు ఊరట..
హైడ్రా పారదర్శకతపై నీలినీడలు..
కమిషన్ దూకుడుకు ‘పవర్’ బ్రేకులు..
==========
దుర్గం చెరువు నివాసితులకు ఊరట..
దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. అలాగే అక్టోబర్ 4 వ తేదీన లేక్ ప్రొటక్షన్ ముందు హాజరు కావాలని నిర్వాసితులకు ఆదేశించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో నిర్వాసితుల అబ్జెక్షఫన్ పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని, అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరవుతారని, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాలలోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.
=================
సీఎం ఉసురుతాకిపోతడు..
రేవంత్ రెడ్డికి కోర్టుల మీద చాలా అపనమ్మకం. శని, ఆదివారం చూసి ఇండ్లు కూల్చడం సోకైపోయింది. సెలవు రోజుల్లోనే డోజర్లు బయటకొస్తాయి, కూలగొడ్తాయి. ఆ రోజుల్లో కోర్టులు సెలవు, అదీకాకుండా సీఎంకు జడ్జీల మీద, చట్టాలపై నమ్మకం అంతగా ఉన్నట్టు అనిపించడం లేదు. ఇప్పటికైనా న్యాయమూర్తులు మానవత్వంతో ఆలోచించాలి., హైకోర్టు మానవత్వంతో ఇక్కడ జరుగుతుందేందో చూడాలి. పేదల ఇళ్లను కూలగొట్టి ఆస్తులను ధ్వంసం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఎప్పటికీ తప్పించుకోలేదు. వాళ్లు కాళ్ల మీద వారు బతుకుతున్న సామాన్యులకు మట్టికొట్టి, జీవితాల్లో నిప్పులు పోసి రేవంత్ రెడ్డి ఏం సాధిస్తాడో చూడాలి మరి. ఇవన్నీ చూస్తుంటే ఆయనకు మానవత్వం ఉందా అనిపిస్తున్నది. ఆయనకు సామాన్యుడి ఏడుపు కన్నీళ్లు శాపనార్థాలు తప్పకుండా తాకుతాయి. మీ చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుంది. మీరు కనీసం షెడ్లు కూల్చడం కాదు, అందులోని సామాన్లను కూడా డోజర్లతో ధ్వంసం చేయించడం అత్యంత బాధాకరం. నువ్వే కొత్తగా సీఎం అయినట్టు, ఇక్కడున్నదంతా నీ తాత జాగీర్ అయినట్టుగా ఏకలాజికల్ బ్యాలెన్స్ గురించి నువ్వే పట్టించుకుంటున్నట్టుగా ఫోజులు కొడుతున్నావ్. నల్ల చెరువులో జరిగిన దుర్మార్గం తీవ్రంగా అనిపించింది. అధికారం ఉందని విర్రవీగితే చరిత్రలో కొట్టుకుపోతావ్. ఇవ్వాళ బడాయికి పోతే కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ప్రజలు తలుచుకుంటే వారి కన్నీళ్లలో కొట్టుకుపోతావ్. ఇప్పటికైనా నష్టపోయిన వారికి అంచనాలు వేసి వారి బ్రతుకులను నిలబెట్టే ప్రయత్నం చెయ్.
– ఈటల రాజేందర్, మల్కాజిగిరి ఎంపీ
==================
చట్టం ఉన్నోడికి చుట్టమే. పేరుకే ప్రజాస్వామ్యం., ప్రజలకు న్యాయమే చివరి లక్ష్యం అంటూ ఉపన్యాసాలు ఊకదంపుడుగా మారాయి. సామాన్యుడికి న్యాయం జరగాలంటే అతీత శక్తి ఏదన్న ప్రత్యక్షం కావాలి., లేదంటే అద్భుతమేదైనా జరగాలి. అంతేగానీ అంత తేలిగ్గా న్యాయం దక్కుతుందంటే ఆశామాషీ కాదు. ఎన్నో ఘటనలు నిరూపించింది అదే., ఇప్పుడు దుర్గం చెరువు విషయంలో హైడ్రా వెనక్కి తగ్గిన విషయం కూడా నిరూపిస్తున్నది అదే. లేదంటే కామన్ పీపుల్ పై కొరడా ఝులిపిస్తూ, ఏ మాత్రం కనికరం చూపని హైడ్రా పాపం సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చే సమయంలో మాత్రం ఎక్కడలేని వెసులుబాటును కల్పించే. కోర్టు కల్పించినా, మరేదో జరిగినా ఏ ఒక్కరికి జరగని మినహాయింపు ఆయనకు మాత్రం ఎందుకు జరిగినట్టు. ఎంతైనా సీఎం కు స్వయానా తమ్ముడు., పవర్ చేతిలో ఉన్న నేతకు రక్తసంబంధీకుడు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని వారు ఉండరు., తెరవెనక ఏం జరిగిందో తెలుసుకోలేని వారు అంతకన్నా లేరు. ముఖ్యమంత్రా.. మజాకా.. ఆయన తమ్ముడా.., ముట్టుకోవడం అంత తేలికా.? చట్టం నిజంగా తనపని తాను చేసుకుపోతుంది లెండి అంటూ సర్దుకొని పోవడం తప్ప పాపం ఆ నిరుపేద చేసేదేమీ ఉండదు.
===============
జనపదం, బ్యూరో
ఆపండి… తెలుగు సినిమా క్లైమాక్స్ లో పెళ్లి తంతు జరుగుతుంటే పోలీసులు చెప్పినట్టు ఉంది కదా డైలాగ్. అవును మరి నిజంగా అలాంటి సందర్భమే. హైడ్రా హల్ చల్ చేస్తే అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు దింపుతున్న వేళ ఇక్కడ మాత్రం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. సామాన్య జనాలు నెత్తినోరు కొట్టుకుంటూ, తమకు అవకాశం ఇవ్వండి మహా ప్రభో.. అన్నీ సర్దుకున్నాక మీరే వచ్చి కూలుస్తురంటా.. అని సెలవిచ్చినా ఆగని హైడ్రా, సీఎం తమ్ముడి ఏరియాలో మాత్రం కనికరించింది. నిన్న మొన్న లేని విధంగా ఆ మాటకొస్తే గతంలో ఎప్పుడూ అనుసరించని విధంగా పనికి విరామం ప్రకటించి మీరు సర్దుకోండి.. మేం వెళ్లిపోతున్నాం.. అన్నట్టుగా ఉపశమనం ఇచ్చింది. దుర్గం చెరువులో ఆక్రమణలను కూల్చాల్సిన హైడ్రా అందునా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఏరియాలోకి వెళ్లగానే ఇలాంటి టర్న్ బ్యాక్ తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సోదరుడికి ఓ నీతి., సామాన్య జనాలకు మరో రీతా.. అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చట్టం ఉన్నవారికి చుట్టమే అని మరోమారు నిరూపితమైంది.
వెను తిరగని వైనం..
చెరువుల పరిధిలోని ఆక్రమణలపై జెట్ స్పీడ్‌లో హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను కూల్చి వేసింది. ఆక్రమణలకు గురైన 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగి హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. హై రీచ్ జా క్రషర్స్ తో పాటు జేసీబీలతో, బుల్డోజర్లతో కూల్చి వేతలు చేపట్టారు. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు పెంచింది. తాజాగా అమీన్ పూర్లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. 17 గంటలపాటు నాన్ స్టాప్ గా ఇళ్లు, భవనాలు, అపార్టుమెట్లు కూల్చివేసింది. అలాగే ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలు కూల్చివేసింది. సోమవారం తెల్లవారుజాము ఒంటిగంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు అనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా 17 గంటలపాటు హైరిస్క్ ఆపరేషన్ కొనసాగించి రికార్డు క్రియేట్ చేసింది.
మళ్లీ మొదలు..
ఇటీవల గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది. ఏకకాలంలో కూకట్‌పల్లిలో, అమీన్పూర్ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది. రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. మూడు ప్రాంతాల్లోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు.
దుర్గం చెరువు పరిధిలో బ్రేక్.. బాధితుల జాబితాలో సీఎం సోదరుడు..
చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్టు తెలిపింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాల లోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట దక్కినట్టు అయ్యింది.
ముఖ్యమంత్రి తమ్ముడి కోసమేనా…?
దుర్గం చెరువు పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్జోన్లపై ఇటీవల హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ బాధితుల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కూడా ఉన్నారు. దుర్గం చెరువు ఆక్రమణలపై నోటీసులు ఇవ్వగానే హైడ్రా కూల్చివేతలను ఆపేయాలంటూ కొందరు, తమ నిర్మాణాలు కూల్చకుండా స్టే విధించాలంటూ మరికొందరు హైకోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన పలు కట్టడాలకు హైడ్రా నోటీసులు జారీ చేయగా అక్కడి నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే, మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. తిరుపతి రెడ్డి ఇల్లుతో పాటు కార్యాలయం కూడా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు 30 రోజుల గడువు కూడా ఇవ్వటం గమనార్హం. ఈ నోటీసులపై స్పందించిన తిరుపతి రెడ్డి తాను ఉంటున్న ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదని తెలిపారు. కాగా ఇప్పుడు హైకోర్టు స్టే విధించటంతో తిరుపతి రెడ్డికి భారీ ఊరట లభించినట్టయింది.