Sunday, December 29, 2024
HomeTelanganaNo Censor | నో సెన్సార్.. కొంప ముంచిన కొండా

No Censor | నో సెన్సార్.. కొంప ముంచిన కొండా

Janapadham_EPaper_TS_03-10-2024

నో సెన్సార్…

కొంప ముంచిన కొండా

బూతులతో షాక్..
ఒక్కటైన సినీ ఇండస్ట్రీ
కేటీఆర్ లీగల్ నోటీసులు
రాహుల్ గాంధీకి ఫిర్యాదు
మంత్రిపై అధిష్టానం సీరియస్
హైడ్రా డైవర్షన్ కే అని పలువురి విమర్శ..
హడలెత్తించే స్థాయి నుంచి అడల్ట్స్ ఓన్లీ దిశగా పాలిటిక్స్..

సెన్సార్ సైలెంట్ అయ్యింది. బహిరంగానికి, అంతర్గతానికి మధ్య సన్నని పొర చిరిగిపోయి సంబంధాలు అక్రమం అయ్యాయి. మాటలన్నీ అశ్లీలన్ని నింపుకుంటూ, ఆరోపణల్లో బలం కోసం అడ్డూ అదుపు లేని తనం పెరిగిపోతున్నది. రహస్యం విచ్చలవిడితనంతో బహిర్గంగంగా నడి రోడ్డుపై వికటాట్టహాసం చేస్తున్నది. బంధుత్వాలు, బాధలు స్వార్థానికి వాడుకునే పావులుగా మారగా, ఆడమగ అనే తేడాలు లేకుండా బరితెగింపు ముచ్చట్లు సర్వసాధారణమయ్యాయి. చట్టసభల్లో హుందాగా ఉండాల్సిన వారు పచ్చిబూతులతో నడిరోడ్డుపై ఊగిపోతుండగా, మానమర్యాదలు సిగ్గుతో సంధుగొందుల్లో పడి పారిపోతున్నాయి. ఎంతకైనా తెగించొచ్చు అనే అతిస్వేచ్ఛ రాజకీయనాయకులు అనవసరపు విషయాలను అడ్డగోలుగా వాగుతూ సమాజ పోకడను ఈసడించుకునేలా చేస్తున్నారు. విమర్శకైనా హద్దుంటుందనే సోయి మరిచి, నోటికొచ్చింది వదులుతూ తామేదో సాధించామన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సినిమాలకు ఉండాల్సిన సెన్సార్ బోర్డు రాజకీయాలకూ పెట్టాల్సిన దుస్థితికి తీసుకెళ్తున్న నేతల దిగజారుడు ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ వార్ ను మరింత పెంచుతున్నది.

జనపదం, బ్యూరో

నాయకులంటే పేదల పక్షాన పోరాడాలి., రాజకీయంలో చిరస్థాయిగా మిగిలిపోయేలా నడుచుకోవాలి, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి., అవినీతికి పాల్పడాలంటే వణుకు పుట్టాలి. ఒక్కమాటలతో చెప్పాలంటే ప్రజలకు భరోసాగా, ప్రవర్తనలో మార్గనిర్దేశకుడిగా కనిపించాలి. కానీ, రోజురోజుకు రాజకీయం మారుతున్నది. అక్రమార్కులను హడలెత్తిపోయేలా ఉండాల్సిన నేతలు పాలిటిక్స్ అంటేనే అడల్ట్స్ ఓన్లీ అనే దిశగా తీసుకెళ్తున్నారు. చట్టసభల సాక్షిగా దుశ్శాన పర్వాలు గతంలోనే చూశాం ఇప్పుడు ఏకంగా సెన్సార్ కటింగ్ లేని సీన్లను ఊహించుకునే స్థాయికి చేరాం. నాలుగ్గోడల మధ్య వ్యవహారాలు నడివీధిలో చర్చిస్తూ సమాజమే తలదించుకునే ‘ఉచ్చ’స్థితికి చేరాం. పెద్దలుగా వ్యవహరించాల్సిన వారు పరమ చెత్తగా ప్రవర్తిస్తున్నారు. అందుకు తాజా ఉదహరణే మంత్రి సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ ఎపిసోడ్.

పుట్టి మునుగుతున్న హస్తం పార్టీ..
దెబ్బ మీద దెబ్బ. దున్న మీది పుండును కాకి పొడుస్తున్న తీరు నొప్పి. ఇప్పటికే తల బొప్పి కట్టే పుట్టెడు కష్టాల్లోకి కూరుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి రోజుకో కొత్త తలనొప్పి. అధిష్టానం ఇచ్చిన ఫ్రీ ‘హ్యాండ్’ను అడ్వంటేజ్ గా తీసుకుంటున్నారనుకోవాలో.., ఒకరికి భయపడేదేంది.., మేమేం తక్కువ అనే తలబిరుసు అనుకోవాలోగానీ సీఎం అండ్ టీం ఎవరి దారివారు సాగడంతో లొల్లులు ముదురుతున్నాయి., కొంగ్రొత్తగా పుట్టుకొస్తున్నాయి. తాజాగా మంత్రి సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు సైతం ముక్కున వేలేసుకునేలా చేశాయి. ఇప్పటికే హైడ్రాతో పార్టీ పరిస్థితి ఆగమాగం అవుతుంటే, తాజాగా సురేఖ మాటలతో సునామీ మాదిరి వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష పార్టీలను బలంగా ఢీకొట్టాలని చేస్తున్నారో, అప్పుడెప్పుడో పెట్టుకున్న పాత కక్షలకు రివేంజోగానీ కేటీఆర్ ను నడిరోడ్డుపై నిలబెట్టే ప్రయత్నం చేశారు. కూల్చివేతలపై నిన్ననే ఢిల్లీలో సీఎం రేవంత్ కు తలంటి పోసి జాగ్రత్తలు చెప్పి పంపిన అధిష్టానానికి ఇప్పుడు సురేఖ తీరుపై వస్తున్న ఫిర్యాదులపై ఏం చేయాలో అర్థంకాని పరిస్థితులు దాపురించాయి. సురేఖ ఒక్కసారిగా బూతులతో కేటీఆర్ కు షాక్ ఇవ్వాలని చూసి విధానంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టడం ఏమోగానీ స్వయం కృతాపరాధంగా ఇరుక్కునే స్థితికి చేరువయ్యారు.

దుమారం రేపిన వ్యాఖ్యలు..
సినీ హీరోయిన్ల సెల్ ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక మంది జీవితాలను నాశనం చేశారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొండా సురేఖ అక్కడ మీడియాతో మాట్లాడారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. అసలు ఆయనకు మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు తెలియవన్నారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసి కెరీర్ పై దెబ్బ కొట్టారని, ఆయన బాధలు పడలేకే కొంత మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారన్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన పోస్టుల విషయంలో కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన పోస్టింగ్ లపై కేటీఆర్ తమకు సంబంధం లేదు మూడు రోజుల క్రితమే చెప్పాల్సింది అన్నారు.
పొలిటికల్ టు పర్సనల్ …
రాష్ట్రంలో పొలిటకల్ పోరు కాస్త పర్సనల్ పోరుగా మారింది. వ్యక్తిగత దూషణల పర్వం పతాక స్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మంగళవారం జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాలను మరింత హీటెక్కించాయి. హైడ్రా కూల్చివేతలతో మొదలైన మాటల మంటలు ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అట్టుడుకుతుండగా, తాజాగా కేటీఆర్ టార్గెట్ గా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టిస్తున్నాయి. హీరోయిన్ జీవితంతో చెలగాటమాడిన కేటీఆర్ కు పుట్టగతులు ఉండవని ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. హీరోయిన్ తో కేటీఆర్ సంబంధాలపై మంత్రి కొండా చేసిన వ్యాఖ్యలు దిగజారుడు చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు.

ఒక్కటైన సినీ ఇండస్ట్రీ..
రాజకీయాలు, సినీ వర్గాలు పరస్పర సంబంధాలు, స్నేహపూర్వక పరిచయాలతో సాగుతున్న విషయం అంతా తెలిసిందే. పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ఇరు సెక్టార్లు నడుచుకుంటాయి., నడుచుకోవాలి కూడా. ఇప్పుడు సురేఖ నటి సమంతపై చేసిన ఆరోపణలతో సినీ ఇండస్ట్రీ ఒక్కటైంది. హాట్ టాపిక్ గా మారిన సురేఖ వ్యాఖ్యలపై సినిమా రంగానికి చెందిన వారు తీవ్ర స్థాయిలో ఆక్షేపిస్తుండగా రాజకీయ విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. ఇప్పటికే సినీ హీరో నాగార్జున సుతిమెత్తగా చురకలంటించారు. ఇతరుల మనస్తత్వాలతో ఆడుకోవద్దని సూచించారు. వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. మరో నటుడు ప్రకాశ్ రాజ్ కాస్త ఘాటుగా బదులిచ్చారు. ఒక మహిళా మంత్రి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి కనీసం ఉండాలన్నారు. ఎదుటి వారు బాధపడుతారనే విచక్షణ కూడా లేదా అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీలోని వారు అంత దిగజారి కనిపిస్తున్నారా.. అని దుయ్యబట్టారు. నటి సమంత కూడా తనపై వచ్చిన ఆరోపణలకు నొచ్చుకుని ఖండించారు.

కేటీఆర్ లీగల్ నోటీసులు
మంత్రి సురేఖ మాటలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇంట్లో ఆడవారు బాధపడతారనే కనీస ఆలోచన లేకుండా బహిరంగంగా మాట్లాడడం అవివేకమన్నారు. ఈ మేరకు మంత్రికి లీగల్ నోటీసులు పంపించి సంజాయిషీ ఇవ్వాలని కోరారు. రాజకీయంగా ఎదుర్కోలేక నిరాధారమైన ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నతీరును ఎండగట్టారు.

రాహుల్ గాంధీకి ఫిర్యాదు ..
మంత్రి సురేఖ ఉదంతంపై పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పార్టీ నేతలను అదుపులో పెట్టుకోవాలని కోరారు. రాజకీయాలను అపవిత్రం చేసేలా ఆరోపణలు చేస్తున్న తీరుపై నిఘా పెట్టాలని, రాష్ట్రంలో వాతావరణాన్నికలుషితం చేస్తే పార్టీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయనకు తెలియజేశారు.
అందిన ఫిర్యాదుల మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా మంత్రి సురేఖపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. గతంలోనే సురేఖ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో హద్దులు మీరి మాట్లాడిన తీరు తీవ్ర కలకలం సృష్టించిన విషయం మరచిపోకముందే మళ్లీ ఇలాంటి తప్పుడు మాటలు, కనీస మానవత్వం మరచిన వ్యాఖ్యలు మరోమారు ఆమె తీరును తెలియజేస్తున్నాయని కోపంతో ఉంది.
హైడ్రా డైవర్షన్ కే అని పలువురి విమర్శ..
కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ విషయాన్ని మరచిపోయేలా చేయడానికే హైడ్రాను తెరపైకి తెచ్చిందనే వాదన వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు సురేఖ మాటలు మరో కొత్త విషయానికి ఆజ్యం పోశాయి. కూల్చివేతలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పెట్టిన ప్రస్తుతం తరుణంలో కేటీఆర్, సురేఖ ఎపిసోడ్ తో టాపిక్ ను తెలివిగా పక్కదారి పట్టించి పార్టీని, ప్రభుత్వాన్ని, అధికారాన్ని కాపాడుకోవాలనే స్కెచ్ లో ఉన్నారనే వారు కూడా లేకపోలేదు. ప్రజలకు చేయాల్సిన పనులకు పాతరేసి పర్సనల్ విషయాలతో టైం పాస్ చేస్తూ రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసిన తీరుపై ప్రతిపక్షాలు నిలదీస్తున్న సందర్భం నుంచి అందరి దృష్టి మరల్చడానికే ఇలాంటి పనులకు తెరతీశారంటున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు