Sunday, December 29, 2024
HomeTelanganaTelangana Congress | పండుగెళ్లే.. పదవి రాకపాయె..

Telangana Congress | పండుగెళ్లే.. పదవి రాకపాయె..

JanaPadham EPaper_TS_12-10-2024

కత్తులు దూస్తున్న కాంగ్రెస్ సీనియర్లు..
నేతల చుట్టూ వీసీ అభ్యర్థుల ప్రదక్షిణలు…
మొన్నటి వరకు ఎలక్షన్ల సాకు…
ఎటూ తేలని విద్యా కమిషన్, రైతు కమిషన్ మెంబర్లు..
ఊరిస్తున్న పీఠాలు.. ఉసూరుమంటున్న ఆశావహులు..

ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతున్నది. ఎప్పటికవుతుందో., ఎలా జరుగుతుందో గానీ ఒక్క అడుగు ముందుకు కిలోమీటర్ వెనక్కి అన్నట్టుగా నడుస్తున్నది. ఇవ్వాళా.., రేపా.. అంటూ సుమారు ఆరేడు నెలలుగా చూస్తున్న చూపులకు ఊరించుడే తప్ప అప్పగించేది లేదన్నట్టుగానే సాగుతున్నది. నామినేటెడ్, కార్పొరేషన్లు, మరికొన్ని విభాగాలకు బాధ్యులను నియమించాల్సిన రాష్ట్ర సర్కార్ ఇంకా నాన్చుతున్న తీరుతో పార్టీ శ్రేణులు డీలా పడుతున్నాయి. పార్టీ కోసం సర్వస్వం దారపోస్తూ, కేడర్ ను బతికించుకోవడానికి యుద్ధాలు చేసిన తమకు ఇంకెప్పటికీ పదవులు వశమవుతాయో తెలియక ఆశావహులంతా ఆందోళన చెందుతున్నారు. కొందరు నిన్నగాక మొన్నొచ్చిన జూనియర్లు, ప్రసన్న రాయుళ్లు కూర్చీలు దక్కించుకుని చేస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిగా రగిపోతున్నారు.

కాలం గడుస్తూనే ఉంది. పరుగు శరవేగంగా సాగుతూనే ఉంది. పాడు జీవితానికి ఓ పదవి దక్కితే అదే పదివేలు అనుకుని ఆశపెట్టుకున్న సీనియర్లు ప్రస్తుత పరిస్థితితో కుదేలవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి పదినెలలు కావొస్తున్నా, తమకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం పెద్దలు పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఉన్నారని గుర్తించినట్టా., పోతే పోని ఉంటే ఉండనీ అని వదిలేసినట్టా.. అని ఆవేదన చెందుతున్నారు. నామినేటెడ్ పదవుల పంపకం, ఇతర పోస్టుల భర్తీకి ఎక్కడా సర్కార్ చొరవ తీసుకుంటున్నట్టు కనిపించడం లేదని వాపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక సాకుతో తప్పించుకోవడం, లేదంటే కావాలని ఆలస్యం చేయడానికి శతథా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పండుగలు వెళ్లిపోతున్నా పదవులు మాత్రం వరించడం లేదని గొడగొడ విలపిస్తున్నారు.

కత్తులు దూస్తున్న కాంగ్రెస్ సీనియర్లు..
కాంగ్రెస్ పార్టీ ఓ మహా సముద్రం. నేతలెవరిని కదిపినా అదే విషయాన్ని వల్లెవేస్తూ రాజకీయం చేస్తుంటారు. రాష్ట్ర సర్కార్ అందునా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందరినీ కలుపుకుని పోతామని ప్రకటించిన గొప్పతనాన్ని చూసి మురిసిపోయారు. కానీ, నిజానికి అంతర్గతంగా నడుస్తున్న రాజకీయ క్రీనీడను చూసి తట్టుకోలేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్లు, పార్టీతో అనుబంధం అంతంత మాత్రంగా ఉన్న వారు పదవుల్లో కులుకుతూ తమను మాత్రం పట్టింపులేకుండా పక్కన పెట్టిన విధానానికి నొచ్చుకుని ఆవేదన చెందుతున్నారు. అధిష్టానం నుంచి ఇగో వచ్చే, అగో వచ్చే అంటూ ఊరిస్తూ, తమన ఊసే లేకుండా కాలాన్ని నెట్టుకొస్తున్నారని వాపోతున్నారు.

నేతల చుట్టూ వీసీ అభ్యర్థుల ప్రదక్షిణలు…
అన్ని యూనివర్సిటీలకు వీసీల నియామకం చేస్తామని సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే బీఆర్ఎస్ సర్కార్ అర్హులను పట్టించుకోకుండా, రాజకీయాలను ఎంటర్ చేయించి, పైరవీలకు తెరతీశారు. ప్రసన్నం చేసుకుంటే, పతారా ఉన్న నాయకులు తమకు పదవి కట్టబెట్టేందుకు హెల్ప్ చేస్తారని ఏ చిన్న పరిచయాలన్నైనా వదలకుండా వాడేసుకుంటున్నారు. అదే సమయంలో మూటలు గుంజే వారు సైతం ఎంతోకొంత లాగుతూ నాలుగు రాళ్లు వేనకేసుకుంటున్నారు. ఇలా ఎవరి పరిచయాలను వారు పిండుకునే క్రమంలో అసలేం జరుగుతుందో అర్థం కాని ఒత్తిడి. విద్యాసంస్థలకు పెద్దదిక్కుగా ఉండి, పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అందజేయాలనే లక్ష్యానికి కేంద్రంగా ఉంచాల్సిన పీఠాలను కూడా రాజకీయం చదరంగంలో వాడకానికి కేరాఫ్ చేయడం అత్యంత దౌర్భాగ్యం. అసలైన అర్హులకు కాకుండా పరపతి ఉపయోగించుకుని షాట్ కట్ డెవలప్ మెంట్ ను ఆశ్రయిస్తున్న వారి కోసం వీసీల పీఠాలు ఉసూరుమని ఎదురు చూస్తున్నాయి.
కాగా పదవుల పంపకం పై పదేపదే ప్రకటనలు, వాయిదాలు., పై నాయకుల అభిప్రాయం ఇది అనే సాకులకు మొన్నటి వరకు హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికలు కూడా మరింత బలాన్ని చేకూర్చాయి. ఎట్టకేలకు ఆయా రాష్ట్రాల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పటికైనా తమ భవితవ్యాలు తేల్చండని వేడుకుంటున్న వారికి ఇంకా పోస్ట్ పోన్లు చేయడంతో ఎప్పటికి తేలునో, మరెప్పటికీ తెగునో అనే ఆశతో కూడిన నిరాశను వెలిబుచ్చుతూ గడుపుతున్నారు.

నిత్యం ప్రజలకు, అందునా కీలకమైన బాధ్యతలు సంబంధీలకు అప్పగిస్తే దాని ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటివే విద్యా కమిషన్, రైతు కమిషన్. నిత్యం సామాన్యుడికి అవసరం ఉన్న కనీసాలకు ముడిపడిన ఉన్న ఈ కమిష్లనకు సభ్యుల నియామకం కూడా ఎటూ తేల్చకపోవడం అత్యంత దౌర్భాగ్యం అని పలువురు నిజలను కుండబద్ధలు కొడుతున్నారు. సమయంతో పాటు సాగాల్సిన వాటిని కూడా నిర్లక్ష్యంగా చేసి, ఏమీ పట్టనట్టుగా అన్ని తమకు తెలుసు కదా అని ఆలస్యం చేస్తే ఆయా కమిటీల ఏర్పాటు జాప్యం తప్పకుండా కొన్ని ప్రతికూల పరిస్థితులకు చిరునామాగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా ఢిల్లీ అధిష్టానం, రాష్ట్రంలో సీఎం అండ్ ఇతర కీలకమైన వ్యక్తులు పార్టీకి ఎంతో బేస్ లైన్ గా ఉండే పలు కమిషన్లకు చైర్మన్లను, కార్పొరేషన్లకు చైర్మన్లను, యూనివర్సిటీలకు వీసీలను, ఇతరాత్ర పదవుల భర్తీని కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అనిపిస్తోందని, దానితో పాలనపై తప్పకుండా ప్రతికూల పరిస్థితులు పడుతాయని పలువురు పార్టీ సీనియర్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఊరిస్తుంటారో., ఆఖరికైనా శుభప్రదమైన ముగింపు పలికేలా చేస్తారో లేదా ఉసూరుమనిపించి ఎదురు చూడమంటారో అని తీవ్ర మనోవేధనతో నెట్టుకొస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు