Saturday, December 28, 2024
HomeTelanganaKonda Surekha | కొండా బర్తరఫ్..?

Konda Surekha | కొండా బర్తరఫ్..?

JanaPadham_EPaper_TS_17-10-2024

కొండా బర్తరఫ్..?

పావులు కదుపుతున్న రెడ్డి వర్గం..

సురేఖ టార్గెట్ గా పావులు..
తొలగించాలని జిల్లా ఎమ్మెల్యేల పట్టు..
మూకుమ్మడిగా ఫిర్యాదు..
రేపోమాపో పార్టీ హైకమాండ్ కలిసే అవకాశం..
పొంచి ఉన్న గండం..
దిద్దుబాటు కూడా పట్టని అమాత్య..?

చేసుకున్న వారికి చేసుకున్నంత. శత్రుమూకలకు స్వయంకృతం ఊతమిస్తున్న తరుణమిదంతా. వలయమంతా వైరి పక్షంతో నిండి ఉన్నప్పుడు జాగ్రత్తగా మసులుకోవాల్సిన విషయం మరిచి, బరితెగింపును ప్రదర్శిస్తున్న తీరును ఎలా అర్థం చేసుకోవాలో తెలియనితనం. ఒక్కసారి క్షమిస్తారు., రెండు సార్లు ఏమో లే అని వదిలేస్తారు., మూడోసారి సీరియస్ గా వార్నింగ్ కు దిగుతారు.., అంతేగానీ పదేపదే అదే తీరుగా వ్యవహరిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు., ఎంతకని ఓపిక నటిస్తారు. చిక్కిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని సీటు చింపడానికే శతధా యత్నాలు చేస్తున్నా మేల్కోకపోతే మన్నించేది ఎవరు., మౌనంగా వదిలేయడానికి మాత్రం ఇష్టపడేది ఎవరు..? లెక్కచేయని నైజంతో కిక్కురుమనకుండా ఉన్న ఉమ్మడిజిల్లా హస్తం నేతలకు ఇప్పుడు అనుకూలమైన సమయం వచ్చినట్టైంది., సురేఖను ఈ సమయంలోనైనేతేనే ఏమైనా చేయొచ్చని ఒక్కటిగా కదలాల్సిన అవశ్యకతను గుర్తించారు. అందునా కులం కూడా కలిసొచ్చింది.,రెడ్డి సామాజిక వర్గమంతా ఏకమై ఆమెను సాగనంపేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని పావులు కదుపుతున్నారు. లోకంలో ఉన్నది అదే., మంత్రి కొండా సురేఖ విషయంలో జరుగుతున్నదీ అదే.

=================l

జనపదం, బ్యూరో

మంత్రి కొండా సురేఖపై ఉమ్మడి వరంగల్, హన్మకొండ జిల్లాల కాంగ్రెస్ నాయకత్వం కత్తికట్టింది. డామినేషన్ పెరుగుతోందని, పట్టింపు లేని ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కారాలు, మిర్యాలు నూరుతున్నాయి. ఒంటెత్తు పోకడలకు తోడు, వరుస తప్పిదాలతో పార్టీకి అప్రతిష్టపాలు చేస్తున్నారని, ఒక వర్గం ప్రజలను దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తు జిల్లా ఎమ్మెల్యేలు గరమవుతున్నారు. తమకు గుర్తింపు లేకుండా, తమ బలగానికి బలం చేకూరకుండా అంతా తానై, అందరూ తనవారే అన్నట్టుగా పాలన సాగిస్తున్నారని పైకి సమాచారం చేరవేస్తున్నారు. ఏదిఏమైనా పొగబెడుతారని తెలిసినా, సామరస్యంగా సాగాల్సిన సమయాన్ని కూడా పట్టించుకోకుండా సాగుతున్న తీరే బాధాకరం.

గండం పొంచి ఉంది..
అధికార పార్టీలో వివాదస్పద మంత్రిగా ముద్ర వేసుకున్న కొండా సురేఖ పదవికి గండం పొంచి ఉంది. వరుస వివాదాలతో అధికార పార్టీనే ఇరకాటంలో పడేసిన సురేఖకు తన సొంత జిల్లా నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లే ఆమెపై తిరుగుబావుటా ఎగురవేయడం చర్చనీయాంశమైంది. సురేఖను మంత్రి పదవి నుంచి తొలిగిస్తేనే పార్టీలో కొనసాగుతామంటూ ఏకంగా టీపీసీసీకి అల్టిమేటం జారీ చేయడం సంచలనం రేపింది. ఒకవేళ ఆమెపై చర్యలు తీసుకోకపోతే హస్తినాలో తేల్చుకుంటామని తేగేసి చెప్పడం కలకలం రేపుతోంది. వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ఆమె తన వ్యవహార శైలిని మార్చుకోకుండా మరింత దూకుడుగా వ్యవహరించడం అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారి తీయగా తాజాగా ఈ విషయాన్ని ఏఐసీసీ సీరియస్ గా తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సొంతంతోనే సమరం..
ప్రత్యర్థుల ముచ్చట అటుంచి, సొంత పార్టీ నేతలే లక్ష్యంగా మంత్రి సురేఖ చేస్తున్న రాజకీయాలపై అధిష్టానం సైతం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయనను ఇరకాటంలో పడేయాలనే ఆలోచనతో సినీ హీరో నాగార్జున కుటుంబంపై ఇటీవల సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం లేపాయో తెలిసిందే. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమా రంగంలోనూ పెద్ద సునామీనే సృష్టించాయి. అయితే కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా ఇప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. కాంగ్రెస్ ఈ వివాదం నుంచి బయటపడనే లేదు అప్పుడే కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకోవడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.

సొంత నిర్ణయాలతో మరింత ఇబ్బంది..
తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆధిపత్యం కోసం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లకు వ్యతిరేకంగా సొంత నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రేవూరితో ఆమె జగడం కారణంగా వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోగా మంత్రి తీరును ఏకంగా ఏఐసీసీ, సీఎం దృష్టికి తీసుకెళ్లి తాడోపేడో తెల్చుకునేందుకు నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈ నెల 13న రాత్రి నలుగురు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సమావేశమై కీలక చర్చలు జరిపారు. సీఎం వద్దకు మూకుమ్మడిగా వెళ్లాలని నిర్ణయించగా బుధవారం నేరుగా గాంధీభవన్ కు చేరుకున్న పలువురు నేతలు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అంశాలపై ఆమె అన్నీ తానై వ్యవహరిస్తున్నారని ఆరోపించిన నేతలు గ్రంథాలయ, భద్రకాళి టెంపుల్ చైర్మన్ల నియామకంలో చక్రం తిప్పుతున్నారని అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లారు.

తప్పిస్తేనే ఫలితం..
తాజాగా పరకాల సెగ్మెంట్లో చోటు చేసుకున్న వివాదాన్ని టీపీసీసీ చీఫ్ కు వారంతా వివరించారు. కొండా సురేఖ తీరుతో తమ తమ నియోజకవర్గాల్లో పార్టీలో వర్గ పోరు విస్తరిస్తున్నదని ఇదే కొనసాగితే పార్టీ భవిష్యత్ కష్టమేననే విషయాన్ని అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలపడాలంటే, ప్రభుత్వం పరువు దక్కాలంటే సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లేనిపక్షంలో రెండ్రోజుల తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని అల్టిమేటం జారీ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

తూర్పులోనూ అదే తీరు..
ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వర్సెస్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. దానికి తోడు మంత్రి తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యను బహిరంగంగానే విమర్శించారు. అలాగే వరంగల్ జిల్లా అధ్యక్షురాలితోనూ అంతగా సఖ్యత లేదనేది బహిరంగ రహస్యమే. ఇక పశ్చిమ, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోనూ కొండా సురేఖ తన బలాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన గీసుకొండ ఘటన పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడానికి పురిగొల్పింది. దసరా సందర్భంగా పరకాలలో మంత్రి కొండా సురేఖ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో లేదు. దీంతో ప్రకాశ్ రెడ్డి మద్దతు దారులు ఫ్లెక్సీలను చించేశారు. దీంతో మంత్రి వర్గీయులు, ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కొండా సురేఖ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సీఐ సీట్లో కూర్చుని తన మనుషులనే అరెస్ట్ చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో పార్టీ పెద్దలు కొండా సురేఖను హెచ్చరించినట్లు సమాచారం.

RELATED ARTICLES

తాజా వార్తలు