JanaPadham EPaper_TS_18-10-2024
మెయిన్స్.. మెనీ ఇష్యూస్..
గ్రూప్ 1 (Group 1 Exams) గందరగోళం..
అభ్యర్థుల పోరుబాట
పరీక్ష రీ షెడ్యూల్, జీవో 29ను సవరణకు డిమాండ్
ఈనెల15న అర్ధరాత్రి పోలీసుల అదుపులో అభ్యర్థులు
గాంధీభవన్ ముట్టడి భగ్నం..
కేటీఆర్ ను కలిసిన నిరుద్యోగులు
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్న కేటీఆర్
అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ భేటీ
సమస్యను సర్కార్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ
మరోవైపు పరీక్ష నిర్వహణకు కొనసాగుతోన్న కసరత్తు
హాల్లో జరగాల్సిన పరీక్ష.., ఆందోళనల నడుమ సాగుతున్నది. పెన్నుతో రాత రాయాల్సిన వారు.., తలరాతను మార్చండయ్యా.. అని ప్లకార్డులతో ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. వాయిదా వేస్తారో.., పాత, కొత్త దేనికదే చేస్తారోగానీ అన్యాయం చేయకండి అని వేడుకుంటున్నారు. ఏండ్ల కష్టం అడవి కాచిన వెన్నెల పాలు మాదిరిగా చేయకండని కనిపించిన నేతనల్లా., ఎదురొచ్చిన పార్టీ గడపనల్లా అభ్యర్థిస్తున్నారు. మెయిన్స్ ను మెనీ ఇష్యూలతో గందరగోళం చేయొద్దని, గ్రూప్ 1ను సాఫీగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్ర రాజధాని కేంద్రంగా పలు కోచింగ్ సెంటర్లలో కూస్తీ పడుతున్న వారు తమ గోడు వినిపించడానికి రోడ్లెక్కి నినదిస్తున్నారు. సర్కార్ తీరుతో సర్వస్వం కోల్పోయే ప్రమాదంలో చదువుపై కూడా ఫోకస్ పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్న హస్తంప్రభుత్వం పట్టు విడువకపోవడం, సపోర్టుగా ఉంటామని కారు పార్టీ హామీ ఇవ్వడం., ఏర్పాట్లపై సీఎస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం ఇలా ఎవరికి వారుగా పనిలో నిమగ్నమైపోయారు.
=====================
జనపదం, బ్యూరో
రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు పోరుబాట పట్టారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ రాష్ట్ర రాజధానిలో గురువారం ఆందోళనకు దిగారు. అభ్యర్థులకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలవడంతో ఆ అంశానికి రాజకీయ రంగు అద్దుకున్నది. అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో భేటీ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరీక్షను వాయిదా వేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇటు గాంధీభవన్ ముట్టడికి యత్నంచి అరెస్టయిన అభ్యర్థులతో పార్టీ కార్యాలయంలో సమావేశమైన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వారి డిమాండ్లు, సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29ను రద్దు చేసి, పాత జీవో 55 ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాత నోటిఫికేషన్ ఇచ్చిన 503 పోస్టుల్లో కొత్త అభ్యర్థులకూ అవకాశాలు కల్పిస్తే పోటీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత నోటిఫికేషన్ తో 60 పోస్టులు మాత్రమే పెంచిన ప్రభుత్వం కొత్త అభ్యర్థులకూ అవకాశం కల్పిస్తే తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. కావాలంటే పెంచిన 60 పోస్టులతో (503 పాత పోస్టులు మినహాయించి) మరో నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. జీవో 29, రిజర్వేషన్ అంశాలు కోర్టు కేసుల్లో పెండింగ్ లో ఉన్నందున వాటిని పరిష్కరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరారు. అభ్యర్థుల సమస్యలు విన్న మహేశ్ కుమార్ గౌడ్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదే సమయంలో నిరుద్యోగ అభ్యర్థులను రెచ్చగొడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు. కేటీఆర్ నిరుద్యోగులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే డీఎస్సీ, వైద్యారోగ్యశాఖ, గ్రూప్స్, పోలీసు శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
అర్ధరాత్రి ఆందోళనలు.. అదుపులోకి అభ్యర్థులు
జీవో 29ను వెంటనే సవరించి పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు గురువారం గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 16 అర్థరాత్రి నుంచే హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఆందోళనలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అశోక్‌నగర్ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభ్యర్థులు రోడ్లు బ్లాక్ చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు అవస్థలు పడ్డారు. ఓ వైపు ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తుంటే మరోవైపు ఆ పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేపట్టడంతో చర్చకు దారితీసింది. తమ డిమాండ్లు పరిష్కరించకుండా పరీక్ష నిర్వహించ వద్దని రాత్రి అశోక్ నగర్ వద్ద పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన చేపట్టగా గురువారం గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గాంధీ భవన్ వైపు వచ్చేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గురువారం మధ్యాహ్నం వారితో చర్చలు జరిపి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు తెలంగాణ భవన్ లో కేటీఆర్ తో భేటీ అయిన అభ్యర్థులు పరీక్ష రద్దయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.