Wednesday, January 1, 2025
HomeTelanganaKTR | కేసీఆర్‌ గొంతునొక్కారు కానీ.. బీజేపీ నేతలపై చర్యలేవీ..? ఈసీని ప్రశ్నించిన కేటీఆర్‌

KTR | కేసీఆర్‌ గొంతునొక్కారు కానీ.. బీజేపీ నేతలపై చర్యలేవీ..? ఈసీని ప్రశ్నించిన కేటీఆర్‌

KTR | ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లోనే పని చేస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కేటీఆర్‌ విమర్శించారు. కాషాయ పార్టీ నేతలు ఏం మాట్లాడినా ఈసీ నోటీసులు ఇవ్వడం లేదని కానీ, కేసీఆర్‌ గొంతును నొక్కారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఎవరిపై ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. శ్రీరాముడి ఫొటోతో ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆవేదన మాట్లాడిన కేసీఆర్‌పై 48 గంటలు నిషేధం విధించారని ధ్వజమెత్తారు. దేశం, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే కేంద్ర ప్రభుత్వం, వారు తీసుకుంటున్న నిర్ణయాలు.. దానికి అనుగుణంగా జరిగిన నియామకాలు, స్వయం ప్రతిపత్తి సంస్థల్ని త‌మ గుప్పిట్లో పెట్టుకుని ఆటలాడుతున్నట్లు తెలుస్తోందన్నారు. బీజేపీ కనుసన్నుల్లో ఈసీ నడుస్తోందనే విషయంలో తమకు ఎలాంటి రెండో ఆలోచ‌న, అభిప్రాయం లేదన్నారు.

దేశంలో బీజేపీ వాళ్లు జాతులు, మ‌తాల ఆధారంగా.. ప్రధాని, హోంమంత్రి మ‌తవైష‌మ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా.. విద్వేషాలను రెచ్చగొట్టేలా దారుణ‌మైన వ్యాఖ్యలు చేసినా, ప్రత్యర్థి పార్టీల‌ను బీజేపీ నాయ‌కులు బూతులు తిడుతున్నా.. బీజేపీ4ఇండియా అఫిషియ‌ల్ ట్విట్టర్‌ ముస్లింల‌పై విషం చిమ్ముతూ.. ప్రచారం చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ముస్లింలే ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఇటీవల మోదీ వ్యాఖ్యానించారని, ఈ వ్యాఖ్యలపై 25 వేలమంది పౌరులు ఈసీకి ఫిర్యాదు చేస్తే కనీసం మోదీకి నోటీసులు ఇవ్వలేదని.. ఎన్నికల సంఘం.. మోదీకి భయపడిందన్నారు.

కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందని, దీనికి తమ లాయర్లు, నాయకులు స్పందించి లీగల్ సెల్ ద్వారా సమాధానం ఇచ్చారన్నారు. సిరిసిల్లలో ఎండిన పంటలు చూసిన తర్వాత కేసీఆర్ ఆవేదనతో మాట్లాడారని.. ఆ సమయంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేసినందుకు… పరుషంగా మాట్లాడినందుకు 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారంటూ ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

తాజా వార్తలు