Wednesday, January 1, 2025
HomeTelanganaKTR | ఊస‌ర‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు.. రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తుండు: కేటీఆర్‌

KTR | ఊస‌ర‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు.. రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తుండు: కేటీఆర్‌

సిరిసిల్ల: రాష్ట్రంలో ప‌రిపాల‌న పిచ్చోడి చేతిలో రాయి ఉన్న‌ట్లు మారింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. కేసీఆర్‌కు ఉల్టా ప‌నులు చేసే విధంగా సీఎం రేవంత్ ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శుక్ర‌వారం సిరిసిల్ల‌కు సీఎం రేవంత్ రెడ్డి వ‌చ్చిన‌ప్పుడు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఆశించింది ఏందంటే.. నాలుగు మంచి మాట‌లు, చేసిన త‌ప్పుని స‌రిదిద్దుకునే విధంగా మాట్లాడుతార‌ని అనుకున్నారు. కానీ ఈ సీఎం వైఖ‌రి గ‌త నాలుగున్న‌ర నెల‌లుగా చిల్ల‌ర మాట‌లు.. ఉద్దెర ప‌నులు ఇది త‌ప్ప చేసిందేమీ లేదని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 23 కొత్త‌ జిల్లాల‌ను ఏర్పాటు చేసింద‌న్నారు. కొన్ని జిల్లాల‌కు మ‌హానుభావుల పేర్లు పెట్టామ‌ని చెప్పారు. తొలుత‌ కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన త‌ర్వాత స్థానిక ప్ర‌జ‌లు, నాయ‌కులు పోరాటం చేసి సాధించుకున్న జిల్లాలు ఉన్నాయి. అందులో రాజ‌న్న సిరిసిల్ల ఒక‌టి. ఆనాడు రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కోసం ప్ర‌భుత్వంపై పోరాటం చేసి సాధించుకున్నామ‌ని గుర్తుచేశారు.

రేవంత్ రెడ్డి నుంచి ఆశించిందంటే రాజ‌న్న సిరిసిల్ల జిల్లాను కొన‌సాగిస్తామంటార‌ని. అధికార వికేంద్రీక‌ర‌ణ జ‌రిగిన త‌ర్వాత సంక్షేమ ప‌థ‌కాలు చివ‌రి వ‌ర‌కు అందుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు లాభం జ‌రిగింది. త‌ప్పు తెలుసుకున్నా అని అంటాడేమో అనుకున్నాను. కానీ కేసీఆర్‌కు ఉల్టా చేస్తున్నారు. మూడు వేల కోట్ల ఆర్డ‌ర్ల చీర‌లు ఇచ్చి చేనేత‌ల బ‌తుకులు నిలబెట్టారు. అయితే రేవంత్ వ‌చ్చిన త‌ర్వాత రంజాన్ తోఫా, బ‌తుక‌మ్మ చీర‌, క్రిస్మ‌స్ కానుక క‌ట్ అయ‌య్యాయి. కేసీఆర్ 125 ఫీట్ల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని పెడితే దండేయొద్దు.. నివాళుల‌ర్పించ‌కుండా చేశారు. కొత్త జిల్లాల‌ను క‌చ్చితంగా కొన‌సాగించాలి. లేక‌పోతే ప్ర‌జా ఉద్య‌మం త‌ప్పుదు. బీఆర్ఎస్ పార్టీనే నాయ‌త‌క్వం వ‌హిస్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నాం. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేశామ‌న్నారు.

పార్ల‌మెంట్‌కు ఒక జిల్లా ఉండాల‌ని అంటున్నారు. మ‌రి 33 జిల్లాల్లో ఏ జిల్లాలు కొన‌సాగిస్తారు.. ఏ జిల్లాలు తొల‌గిస్తారో స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. క‌రీంన‌గ‌ర్‌ పార్ల‌మెంట్ ప‌రిధిలో క‌రీంన‌గ‌ర్‌, రాజ‌న్న జిల్లాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ఉంచుతారో చెప్పాల‌న్నారు. నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో జ‌గిత్యాల, నిజామాబాద్ ఉన్నాయి. ఈ విష‌యంలో కూడా స్ఫ‌ష్ట‌త ఇవ్వాలి. పెద్ద‌ప‌ల్లి ప‌రిధిలో పెద్ద‌ప‌ల్లి, మంచిర్యాల‌, ఆదిలాబాద్ ఎంపీ ప‌రిధిలో ఆసిఫాబాద్, నిర్మ‌ల్, ఆదిలాబాద్ ఉన్నాయి. ఏ రెండు జిల్లాలు ఎత్తేస్తారో చెప్పాలన్నారు. పెరుగుతున్న జ‌నాభా అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొత్త డివిజ‌న్లు, మండ‌లాలు మున్సిపాలిటీలుల‌ను వికేంద్రీక‌ర‌ణ చేయాలని వెల్ల‌డించారు.

ఇక‌నైనా చేసిన త‌ప్పుకు చెంప‌లు వేసుకుంది బుద్ది తెచ్చుకోవాల‌ని సీఎం రేవంత్‌కు సూచించారు. సిరిసిల్ల‌లో ఇప్ప‌టికే నేత‌న్న‌ల ఆత్మ‌హ‌త్య‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, పిచ్చివాగుడు మానేసి నేత‌న్న‌ల‌కు ఆర్డ‌ర్లు ఇవ్వాల‌న్నారు. ద‌మ్ముంటే 6 వేల కోట్ల ఆర్డ‌ర్లు ఇవ్వు.. కాట‌న్ ప‌రిశ్ర‌మ‌కు ఊత‌మిచ్చే విధంగా చెయ్య‌ల‌న్నారు. నేత‌న్న‌ల ఉసురు త‌గిలేలా దిక్కుమాలిన రాజ‌కీయాలు చేయ‌డం బంద్ చేయాల‌ని తెలిపారు. ఊస‌ర‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు.. రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు