Wednesday, January 1, 2025
HomeTelanganaKishan Reddy | కాంగ్రెస్‌ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోవట్లే: కిష‌న్‌రెడ్డి

Kishan Reddy | కాంగ్రెస్‌ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోవట్లే: కిష‌న్‌రెడ్డి

హైద‌రాబాద్‌: ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్‌ రెడ్డి (Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయ‌ని చెప్పారు. అవినీతిరహిత ప్రభుత్వం రావాలని ప్రజలు 2014లో మోదీకి ఓటేశార‌ని తెలిపారు. కాంగ్రెస్‌ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని బీజేపీ సరిదిద్దింద‌న్నారు. మరోసారి ఆశీర్వదించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బషీర్​బాగ్​లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలు లేకుండా తొమ్మిదిన్నరేండ్లు పరిపాలించామ‌న్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో మత కలహాలు, ఉగ్రవాద కార్యకలాపాలు లేవ‌ని చెప్పారు. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టామ‌ని, ప్రస్తుతం ఆ దేశం తినడానికి తిండి లేక భిక్ష మెత్తుకుంటున్న‌ద‌ని వెల్ల‌డించారు.

తెలంగాణలో రూ.1.02 లక్షల కోట్లతో రహదారులు నిర్మించామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో దేశంలో రహదారులు నిర్మిస్తున్నామని అన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మాదిరే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ తయారవుతుందని వెల్ల‌డించారు. రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా చేశామన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులను తెలంగాణలో ఖర్చు చేశామని పేర్కొన్నారు.

దేశంలో 83 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందిస్తున్నామని చెప్పారు. 13 కోట్ల ఇండ్ల‌ల్లో టాయిలెట్లు నిర్మించామని తెలిపారు. బీజేపీ హయాంలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని వెల్ల‌డించారు. ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని ముస్లిం సమాజం మొత్తం ఆమోదించిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారత్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోవట్లేదని చెప్పారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలు బీజేపీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఏస్ కలిస్తే కాంగ్రెస్‌తోనే కలుస్తుందని, ఆ పార్టీలో విలీనం చేయ‌డానికి కూడా కేసీఆర్‌ ఒకప్పుడు ప్రయత్నం చేశార‌ని చెప్పారు. తాము బీఆర్ఎస్‌తో ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేద‌ని, భ‌విష్య‌త్‌లో కూడా పెట్టుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవద‌ని, అది గెలిచినా గెలవక పోయినా వచ్చే నష్టం లేద‌న్నారు. దేశంలో ఆ పార్టీ ఉంటే ఏంది ఊడీతే ఏంద‌ని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఓటు వేసి దుర్వినియోగం చేసుకోవ‌ద్ద‌ని సూచించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు