Wednesday, January 1, 2025
HomeTelanganaTelangana | తెలంగాణలో తీన్మార్.. డబుల్ డిజిట్ ఫైట్..?!

Telangana | తెలంగాణలో తీన్మార్.. డబుల్ డిజిట్ ఫైట్..?!

Telangana | లోకసభ ఎన్నికలంటే ఎప్పుడూ నార్త్‌పై నజర్ పెట్టే జాతీయ పార్టీలిప్పుడు సౌత్‌పైనే దృష్టి సారిస్తున్నాయా… అందునా ఢిల్లీకి దగ్గరి దారి వయా తెలంగాణేనా ? రెండంకెల సీట్ల కోసం జాతీయ ఎజండానే సెట్ చేసుకున్న పార్టీల రణాన్ని యావద్దేశం ఎదురుచుస్తోందా..? తెంలగాణలో మూడు పార్టీల మధ్య తీన్మార్ అనుకున్నా… రెండు జాతీయ పార్టీలే ఎలా కొట్లాడుతున్నాయి. తెలంగాణ జనం ఎన్డీఏ వెన్ను తడుతరా.. లేక ఇండియా కూటమి తలుపు తడతరా.. అగ్రనేతలు అడ్డా వేసి ప్రచారం చేస్తున్నా జనం ఎవరిని ఆదరిస్తారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షేమ ప్రణాళిక ఫలిస్తుందా? బీజేపీ జైశ్రీరామ్ నినాదం కలిసి వస్తుందా? బీఆర్ఎస్‌పై సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుందా? అనే చర్చ జోరుగా నడుస్తున్నది.

దేశంలో ఉన్న రెండు ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపిలూ ఎప్పుడూ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యతనిచ్చేవి. దక్షిణాది రాష్ట్రాలంటే ఆ పార్టీలకు కాస్త చిన్న చూపే. అయితే రాను రాను పరిస్థితి మారుతోంది. సౌత్ లో ముఖ్యంగా తెలంగాణ పై ఆ పార్టీల దృష్టి మాములుగా లేదు. ఇక్కడున్న 17 సీట్లలో 16 సీట్ల కోసం గతంలో కంటే భిన్నంగా పోటీ పడుతున్నారు. ఢిల్లి పీఠం దక్కించుకోవాలంటే దక్షిణాదే దగ్గరి దారి వయా తెలంగాణ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ దాని అనుబంద అగ్రనాయకత్వాలన్నీ తెలంగాణ కేంద్రగా సర్వశక్తులొడ్డుతున్నాయి. ఇక కాంగ్రెస్ దాని సాంప్రదాయ ఓటర్లను కాపాడుకోవడంతో పాటు ఇటీవలే అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో లీడర్ క్యాడర్ జోష్ తో పనిచేస్తోంది. ఇక తెలంగాణలో ఉన్న ఒకానొక ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ ఉనికి పోరాటం చేస్తూనే తమకూ మెజార్టీ సీట్లొస్తాయని చెబుతోంది.

బీజేపీ ఆశలెందుకు పెరిగినయి..?

బీజేపి ఎప్పుడూ తెలంగాణపై అంతగా దృష్టి పెట్టలేదు. కాని గత పార్లమెంట్ ఎన్నికల దగ్గర్నుంచి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని పదే పదే చెబుతూ వస్తోంది. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు పోటీ తామేనని అనేక ఉప ఎన్నికల్లో నిలిచి గెలుస్తూ క్రమంగా ఓటు బ్యాంక్ పెంచుకుంటోంది. ఏడు శాతంగా ఉన్న బీజేపి ఓటు బ్యాంకు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఆతర్వాత వచ్చిన దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో గణనీయమైన ఓట్ల శాతాన్ని పెంచుకున్నది. ఇక్కడ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ను తప్పిస్తే పాగా వేయోచ్చని పార్టీ సర్వశక్తులొడ్డుతోంది. ఇందులో భాగంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 111 స్థానాల్లో పోటీ చేసి 46 అసెంబ్లీలో డిపాజిట్లు దక్కించుకుని 9 స్థానాల్లో రెండో స్థానంలో ఉండి 13.88 ఓట్ల శాతంతో 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. సౌత్ లో కర్ణాటక తర్వాత పార్టీ వేగంగా విస్తరించే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయని తెలిసి ఇక్కడ దృష్టి పెట్టింది. వీరి ఆలోచనలకు తగ్గట్టుగానే బిఆర్ఎస్ అధికారంలో కోల్పోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తోంది. అందుకే ఐదుగురు బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను, చాల మంది మాజీ ఎమ్మెల్యేలను పార్టీ ముఖ్యులకు కాషాయ కండువాలు కప్పింది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయం తామేనని చెబుతోంది. గత పార్లమెంట్ లో నాలుగు గెలిస్తే ఇప్పుడా సంఖ్య ఎందుకు పెరగదని లీడర్లలో జోష్ తెప్పిస్తోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత మోదీ, అమిత్ షా సహా అగ్రనాయకత్వం ఇక్కడే తిష్ట వేస్తోంది. మోదీ గ్యారంటీలు, అయోధ్య, ఇతరత్రా ఫీడ్ గుడ్ తో ప్రచారానికి పదునుక్కెస్తున్నారు. లోకసభ ఎన్నికల నేపధ్యంలో మోదీ, అమిత్ షా సహా బీజేపి రాష్ట్రాల సిఎంలు ఇక్కడే అడ్డా వేసి మరి ప్రచారం చేస్తున్నరు.

బీజేపి తెలంగాణలో ఈ సారి 12 సీట్లు టార్గెట్ పెట్టుకుంది. ఉత్తర తెలంగాణలో ఉన్న సిట్టింగ్ లు గెలుస్తారనే ధీమాలో ఉంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో నలుగురు బీజేపి ఎమ్మెల్యేలున్నారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిదిలో ఇద్దరు బీజేపి ఎమ్మెల్యేలున్నారు. జహీరాబాద్ పరిదిలో ఒకే స్థానం ఉన్నా హిందూత్వ ప్రచారం ఎజండాను ఎత్తుకున్నారు. ఇక నార్త్ తెలంగాణలో అదనంగా వరంగల్ ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. సౌత్ తెలంగాణలో మహబూబ్ నగర్, భువనగిరి సీట్లూ దక్కుయనే ఆశతో ఉంది. ఇక నగర పరిదిలోని చెవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ స్థానాల్లోను సర్వేలు చేయించి బీజేపి దాని అనుబంద సంస్థను ప్రచారంలోకి దింపింది. చాల చోట్ల కాంగ్రెస్ తోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆ పార్టీ అంతర్గత సర్వేలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ ఆశలు సజీవమా…?

ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. 14 ఎంపీ సీట్లను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ముగ్గురు ఎంపీలున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎవ్నికల్లో 39.30 ఓట్ల శాతంతో 64 ఎమ్మెల్యే స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్నది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఓట్ల శాతాన్ని మరింత పెంచుకుని డబుల్ డిజిట్ ఎంపీ స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ 37.35 శాతంతో 39 ఎంఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నప్పటికీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది కాబ్టటి పార్లమెట్ ఎన్నికల్లో తిరిగి ఆ ఓట్ల శాతాన్ని రాబట్టుకోవడం కష్టంగా కనిపిస్తుంది. బిఆర్ఎస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు బదాలయింపు జరిగేతే ఆ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నుండి అధికారికంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు లోకసభ ఎన్నికల తర్వాత చేరే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఇక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యులు చాల మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి బీజేపికి ఉత్తర తెలంగాణలో సీట్లు ఎక్కువొచ్చాయి. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపి స్థానాలనే టార్గెట్ చేసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని మంత్రి సీతక్క అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. అభ్య‌ర్థి ఎంపిక నుండి రాహూల్ గాంధీ, రేవంత్ ప్రచారం వరకూ ఎక్కడా తా లేకుండా చూస్తున్నారు. ఇక నిజామాబాద్ నుండి సీనియర్ జీవన్ రెడ్డిని బరిలోకి దింపి కాంగ్రెస్ కొట్లాడుతోంది. సికింద్రాబాద్‌లో ముస్లీం మైనార్టీల ఓట్లపై గురి పెట్టి ఈ స్థానం కైవసం దిశగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కంచుకోటలైన పెద్దపల్లి, ఖమ్మం, మహూబూబాబాద్, నల్లగొండ, నాగర్ కర్నూల్ స్థానాల్లో మంత్రులను ఇంచార్జీలు పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇండియా కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ కు డబుల్ డిజిట్ సీట్లివ్వాలని సిఎం రేవంత్ టీం వర్క్ గా పనిచేస్తున్నారు.

రిజర్వేషన్ల రద్దు మంత్రం పారుతుందా ?!

అగ్రనేతలు రాహుల్ ప్రియాంకలకు ఇండియా కూటమికి సిఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల రద్దు..రాజ్యంగం మార్పు అనే జాతీయ అంశం ప్రచారమైంది. తెలంగాణ నుండి ఎన్నికల్లో కాంగ్రెస్ విసిరిన బాణం బీజేపి గుచ్చుకుందనే చెప్పాలి. మోదీ, అమిత్ షా సహా బీజేపి అగ్రనాయకత్వమంతా కూడా రిజర్వేషన్లు మార్చం అని వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఉన్న 17 పార్లెమెంట్ స్థానాల్లో హైదరాబాద్ స్థానం మినహాయిస్తే బీజేపియే ప్రధాన ప్రత్యర్థిగా కనపడుతున్నట్టు ఆ పార్టీ సర్వేలు చెబుతున్నయి.

కెసిఆర్ ఆప్షన్ ఏంటి ?

పోగొట్టుకునే చోటే వెతుక్కోవాలన్నది కెసిఆర్ ప్లాన్. అతివిశ్వాసంతో అందలాన్ని కోల్పోయి, కూతురు జైలు పాలై, గత సర్కారు అనేక ఆరోపణలు ఎదుర్కొని, విచారణలూ ఎదుర్కోబోతున్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు కష్టకాలంలో ఎదురీదుతున్నదని చెప్పాలి. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో కనీసం గౌరవ ప్రదమైన ఓట్లు దక్కించుకుంటుందా… రాబోయే రోజుల్లో ఆ పార్టీ మిగులుతుందా..బతికి బట్టకడుతుందా అనే చర్చ లేకపోలేదు. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా బస్సు యాత్రతో క్యాడర్ లో జోష్ పెంచుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవసరాన్ని విడమరిచి చెబుతున్నారు. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎవ్నికల్లో 39.30 ఓట్ల శాతంతో 64 ఎమ్మెల్యే స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్నది. 39 ఎమ్మెల్యేలతో గట్టి ప్రతిపక్షంతో బీఆర్ఎస్ పోరాడుతున్నది. కెసిఆర్ తో పాటు కెటిఆర్, హరీష్ రావులు క్షేత్రంలోనే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. మెదక్, పెద్దపల్లి. ఖమ్మం, వరంగల్, జహీరాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి స్థానాలపై ఆశలు పెట్టుకున్న పార్టీ సర్వశక్తులొడ్డుతున్నది.

RELATED ARTICLES

తాజా వార్తలు