IPS Shankhabrata Bagchi | అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి డీజీపీగా ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ నూతన డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఇక కొత్త డీజీపీ ఎవరు అనే అంశంపై ఏపీ అంతటా తీవ్ర చర్చ జరుగుతోంది. ఏ ఆఫీసర్‌ను డీజీపీ పదవి వరిస్తుందోనని పోలీసు వర్గాల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న సీహెచ్ ద్వారకా తిరుమలరావు డీజీపీగా నియామకం అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. తిరుమలరావు తర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అంజనా సిన్హా(1990 బ్యాచ్), 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. కొత్త డీజీపీ కోసం ఈ ముగ్గురి పేర్లను ప్యానెల్ జాబితాలో పంపించే అవకాశం ఉంది. ఈ ముగ్గురిని కూడా కాదనుకుంటే.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా పేరు జాబితాలో చేరొచ్చు. ఇక కొత్త డీజీపీ ఎవరనేది త్వరలోనే తేలనుంది.