Friday, January 3, 2025
HomeNationalMaldives | మాల్దీవుల్లో పర్యటించండి.. భారతీయులకు పర్యాటకశాఖ మంత్రి ఇబ్రహీం విజ్ఞప్తి

Maldives | మాల్దీవుల్లో పర్యటించండి.. భారతీయులకు పర్యాటకశాఖ మంత్రి ఇబ్రహీం విజ్ఞప్తి

Maldives | మాల్దీవుల్లో పర్యటించాలని భారతీయులకు ఆ దేశ పర్యాటకశాఖ మంత్రి ఇబ్రహీం ఫైసల్‌ విజ్ఞప్తి చేశారు. దేశ మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత్‌పై విమర్శల నేపథ్యంలో సెలబ్రెటీలతో పాటు సామాన్యులు సైతం బాయ్‌కాట్‌ మాల్దీవ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో మాల్దీవుల్లో పర్యటించే భారతీయుల సంఖ్య విపరీతంగా పడిపోయింది.

దాంతో పర్యాటకరంగంపై విపరీతమైన ప్రభావం చూపుతున్నది. అక్కడి పర్యాటక కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో స్థానిక టూరిజం కంపెనీలు భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నించగా పెద్దగా ఫలించలేదు. తాజాగా పర్యాటకశాఖ మంత్రి ఇబ్రహీం ఫైసల్‌ రంగంలోకి దిగి భారతీయులను ఆ దేశంలో పర్యటించాలని.. ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని కోరారు. మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వం భారతీయుల రాకపోకలకు స్వాగతం పలుకుతాయన్న ఆయన.. టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడే ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తోడ్పాటునందించాలంటూ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజ్ఞప్తి చేశారు.

భారత్‌-మాల్దీవులు మధ్య చారిత్రక సంబంధాలున్నాయన ఆయన.. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం తిరిగి భారత్‌తో కలిసి పని చేయాలనుకుంటుందన్నారు. భారత్‌తో తాము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరి 6న ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పర్యటించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసిన ఆయన.. ఇక్కడ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు పర్యటించాలని భారతీయులకు పిలుపునిచ్చారు. దాంతో మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు అక్కసు వెళ్లగక్కుతూ.. భారత్‌తో పాటు పీఎం మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బాయ్‌కాట్‌ మాల్దీవులు ట్రెండ్‌ అయిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

తాజా వార్తలు