Allu Arjun | కర్నూల్ : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఎలాంటి అనుమతి లేకుండా.. శనివారం ఆయన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో రవిచంద్ర ఇంటి వద్ద గుమిగూడారు. దీంతో సెక్షన్ 144, పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా అల్లు అర్జున్ పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందిది. ఈ క్రమంలో అల్లు అర్జున్ సహా ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డిపై నంద్యాల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్సార్ సీపీ నుంచి నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. శనివారం ఉదయం తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ నంద్యాల చేరుకున్నారు. అల్లు అర్జున్ దంపతులకు శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. దీంతో అల్లు అర్జున్‌ను చూసేందుకు శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అల్లు అభిమానులు చేరుకున్నారు. వారందరికీ అల్లు అర్జున్ అభివాదం చేసి, శిల్పా రవిచంద్రారెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
2019 ఎన్నికల్లోనూ నంద్యాల నుంచి పోటీ చేసిన రవిచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై 35 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ గెలిపించాలని శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు అర్జున్ చూపించారు. రవిచంద్రారెడ్డిని ప్రజా సేవలో చూడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అల్లు అర్జున్.
రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ స్నేహితుడు..
శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వారిద్దరూ క్లాస్‌మేట్స్ కూడా. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, రవిచంద్రారెడ్డి స్నేహితులయ్యారు. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రారెడ్డి వెల్లడించారు.