హైరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు (ACP Uma Maheshwar Rao) ఇండ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఏసీబీ సోదాలు గత 13 గంటలుగా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ఉన్న నివాసంతోపాటు అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మరో రెండు ఇండ్లు, సీసీఎస్ కార్యాలయం, నగరంలోని మరోఇద్దరు స్నేహితుల ఇండ్లు, ఆంధ్రప్రదేశ్‌లోని రెండు చోట్ల ఏకాలంలో దాడులు అధికారులు నిర్వహించారు.
సోదాల్లో ఇప్పటివరకు పలు కీలక డాక్యుమెంట్లతోపాటు రూ.40 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు, సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.
మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్‌లో కూడా పలు కేసుల్లో ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, సోదాల సందర్భంగా రెండు బ్యాంక్ లాకర్ గుర్తించారు. వాటిని ఓపెన్ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఉమా మహేశ్వరరావు బ్యాంకు లాకర్ వివరాలు వెల్లడించేందుకు సహకరించని పరిస్థితి. లాకర్లలో పెద్ద మొత్తంలో డబ్బు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాటిని ఓపెన్ చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారని పలువురు సోదాలు జరుగుతున్న అతని నివాసం వద్దకు వచ్చి అధికారులకు తెలిపారు. సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు.