JanaPadham_EPaper_TS_23-10-2024
సామిరంగా..
అమ్మ‘దొంగా..’?
ఇది చాలా హాట్ గురూ..?
‘రంగారెడ్డి’లో చేస్తే రందిలేకుండా లాగొచ్చు..
నొక్కడంలో ఇక్కడే రికార్డు..?
ఎంతటి అధికారికైనా ఆ బాపతు వాసనలు కామనే..
గతంలోనూ ఘనాపటిలెందరో..?
తాజాగా ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్..
ఈడీ విచారణకు అమయ్ కుమార్..
భూబదలాయింపు కేసులో నోటీసులు..
అందులోకి ఎంటరైతే చాలు. ఆమ్దానే.. ఆమ్దానీ. కొన్ని తెరుచుకుని జాబ్ చేసుకుంటే చాలు జీవితం అంతా కూర్చుని తినొచ్చు. స్థాయి భేదాలతో సంబంధం లేకుండా అంతా కింద చేతుల తాలూకే. అన్నీ వదిలేసి, కొన్నింటి కోసం తాపత్రపడే అలవాటు అటు వెళ్తేనే అబ్బుతుంది. ఎవరున్నది చూడాల్సిన పనిలేదు., ఏమనుకుంటారో అనే ఇంగితమైనా పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక్కసారి అందులోకి వెళ్తే ఇక అంతే అంటే అంతే. ఇదంతా చెప్పేదే సారీ సారీ నేర్పేదే రంగారెడ్డి కలెక్టరేట్. జిల్లా పరిధిలో భూముల ధరలకు రెక్కలు అనడం కంటే వజ్రాలు, వైడూర్యాలు తొడిగిన పరిస్థితులు ఉండడంతో అక్కడ విధులు నిర్వర్తించడానికి కిందిస్థాయి నుంచి కలెక్టర్ వరకు అందరిదీ ఆదోరకం తాపత్రయం. ఎవరి పనిలో వారు బిజీబిజీ.
======
జనపదం, బ్యూరో
రంగారెడ్డి కలెక్టరేట్ అంటేనే హై ప్రొఫైల్. కాస్ట్లీ ఏరియా., తక్కువలోనే ఎక్కువ గిట్టుబాటు అనే టాక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అని కాదు., ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆ జిల్లా అధికారిక భవన సముదాయంపై అంతటి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు. ఆ మాటకొస్తే ఆ స్థల మహత్యమో.., లేదంటే ఆ జిల్లా ఇతర జిల్లాలు., రాజధానితో పెనవేసుకున్న బంధం తీరోగానీ హమేషా హాట్ కేక్. హైదరాబాద్ కు సమీపంలో ఉండడంతో, అంతర్భాగంగా ఉండడం కూడా అక్కడ రియల్ ఎస్టేట్ భూం విపరీతంగా పెరుగుతుండడంతో అధికారులకు కాసుల పంటే పంట. ఉద్యోగ జీవితంలో ఒక్కటంటే ఒక్కపర్యాయం ఆ జిల్లాలో చేస్తే ఇక అంతే లైఫ్ టైం సెటిల్ మెంట్ జరిగినట్టే అన్నంత నమ్మకం. ఎన్ని చట్టాలైనా ఉండనీ గాక, మరెన్నీ నిఘా వ్యవస్థలైనా చూడనీ గాక, కళ్లు గప్పడం నేర్చుకోవడం అక్కడి కార్యాలయ గోడలే నేర్పిస్తాయి. అంతా బాగుంటే కావాల్సినవన్నీ సమకూర్చుకోవడమే., ఖర్మకాలి ఏదైనా ఎటమటమైతేనే ఇబ్బందికర పరిస్థితులు.
ఏబీసీడీఈలతో అవినాభవం..
ఏసీబీ.., ఈడీ.., అదేంటి ఏబీసీ.., డీఈ అనాల్సిన వాటిని అలా తికమకగా రాశారనుకుంటున్నారా..? అవి అలాగే రాయాలి., రంగారెడ్డి కలెక్టరేట్ కు వెళ్లి అడిగితే అలాగే రాయాలని మరీ చెబుతారు. కలెక్టరేట్ సముదాయానికి ఆంగ్ల అక్షర క్రమానికి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తున్నది కదు. కార్యాలయం.., అధికార యంత్రాంగం., ప్రజలకు మధ్య ఆ కమర్షియల్ సంబంధాలే దానిని నిత్యం వార్తలో నిలిచేలా చేస్తున్నాయి. అక్షరాల చుట్టే అక్కడి పనులన్నీ సాగుతుంటాయి. అంతటి ఆమ్దానీ మరే జిల్లా కార్యాలయంలో ఉంటుందని అనుకోవడానికి కూడా సహసించలేం. దటీజ్ రంగారెడ్డి. చేతికి రొక్కం.. పనికి మాత్రం చిక్కం.. అనేది అక్కడ అధికారు తీరుతెన్ను.
ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్..
తాజాగా రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. గత ఆగస్టు 13వ తేదీన రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన భూపాల్ రెడ్డిపై ఏసీబీ విచారణ కొనసాగుతున్నది. అక్రమాస్తుల కేసులో ఆయనను శాఖాధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. సదరు అధికారి ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులు, బంధువులు ఇలా మరో నాలుగు చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. ఈ సందర్భంగా అధికారులకు కళ్లు బైర్లు కమ్మే ఆస్తుల చిట్టా దొరికింది. ఒక అడిషనల్ కలెక్టర్ ఏకంగా రూ.5 కోట్ల 5 లక్షల 71,676 రూపాయల విలువ చసే స్థిర, చర ఆస్తులను కలిగి ఉండడంపై ఏసీబీ అధికారులే నివ్వెర పోయారు. అదీ కాకుండా 4 కోట్ల పైచిలుకు అనుమానిత ఆస్తులను కూడా వారు గుర్తించారు. ఈ కూడబెట్టిందంతా కేవలం గవర్నమెంట్ లెక్కల ప్రకారమే అని, నిజానికి బహిరంగ మార్కెట్ లో వాటి విలువ సుమారు మరో మూడు రెట్లు అధికమనే ఓ అధికారి తెలియజేస్తున్నారు. భూపాల్ రెడ్డా.. మజాకా.. అనేస్థాయిలో ఆ జిల్లా పేరును నిలిపిన తీరుపై పలువురు వ్యంగ్యంగా కూడా మాట్లాడుకోవడం కనిపించింది.
ఈడీ ముందుకు కలెక్టర్ అమయ్ కుమార్..
కలెక్టర్ అమయ్ కుమార్ వందల కోట్ల భూబదలాయింపు వివాదంలో ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రజా సంపదను రక్షించాల్సిన అధికారులు ఇలా ప్రజ వ్యతిరేక కార్యకలాపాలకు చేయూత నివ్వడం ఏంటని పలువురు ప్రశ్నించిన ఘటనలు అమయ్ కుమార్ వ్యవహారంలో చూశాం. తాజాగా ఆయన నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఒక జిల్లాకు అత్యున్నతస్థాయి అధికారి అవినీతి ఆరోపణల నేపథ్యాన్ని ఎదుర్కొంటూ ముద్దాయిగా నిలబడడం కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. రంగారెడ్డి జిల్లాలో చేస్తే అయితే సచ్ఛీలురుగా మిగులుతారు., లేదంటే అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే అథమ స్థాయికి కూరుకుపోతారనే టాక్ కూడా జిల్లాలో సాగుతోంది. ఏదిఏమైనా ఆ జిల్లా ఓ ట్రెండ్. అవినీతి మరకలు పూయడంలో కూడా దానిస్టైల్ దానిదే. అంటించుకునే వారు ఉన్నారు కాబట్టే తాకిస్తున్నామనే వారు లేకపోలేదు.