Johnny Wactor | అమెరికాలో దారుణం చోటుసుకున్నది. దుంగడుల కాల్పుల్లో ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37) కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న కారులో గుర్తు తెలియని అగంతకులు దోపిడీకి యత్నించారు. ఈ క్రమంలో కాల్పులు జరుపడంతో జానీ వాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో ఈ కాల్పులు జరిగినట్లు వాక్టర్ తల్లి స్కార్లెట్, పోలీసులు తెలిపారు.
ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వాక్టర్ కారు వద్ద కాటలిక్ట్ కన్వర్టర్‌ను దొంగిలించేందుకు యత్నిస్తుండగా.. ఎదురుతిరిగిన నటుడిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు స్కార్లెట్ తెలిపారు. కాల్పుల అనంతరం నిందితులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. పోలీసులు నిందితులు కోసం గాలిస్తున్నారు. జానీ వాక్టర్ 2007లో లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ ‘ఆర్మీ వైవ్స్’ అనే టీవీ షోతో కెరీర్‌ను ప్రారంభించారు.
‘వెస్ట్‌వరల్డ్’, ‘ది ఓ’, ‘స్టేషన్ 19’, ‘క్రిమినల్ మైండ్స్’, ‘హాలీవుడ్ గర్ల్’ తదితర విజయవంతమైన వెబ్ సిరీస్‌లు, టీవీ షోల్లోనూ నటించారు. ‘జనరల్ హాస్పిటల్’ షో జానీ వాక్టర్‌కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. 1963లో ప్రారంభమైన ఈ షోలో ఆయన 2020 నుంచి 2022 వరకు దాదాపు 200 ఎపిసోడ్స్‌కిపైగా నటించారు. ఆ షోలో బ్రాండో కార్బిన్ క్యారెక్టర్ ఇప్పటికీ చాలామందికి ఫేవరేట్. కాగా జానీ వాక్టర్ మృతికి పలువురు నటీనటులు సంతాపం తెలిపారు. జనరల్ హాస్పిటల్ షో టీం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.