Sayaji Shinde | టాలీవుడ్ నటుడు సాయాజీ షిండే ఆసుపత్రిలో చేరారు. గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాదపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను కుటుంబీకులు మహారాష్ట్ర సతారాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈసీజీలో మార్పులు కనిపించాయి. దాంతో, యాంజియోగ్రఫీ పరీక్షకు వైద్యులు సిఫారసు చేశారు. సాయాజీ షిండేకు గుండె కుడివైపున 99 శాతం బ్లాక్స్ ఉన్నట్లు ఆ పరీక్షలో వెల్లడైంది. దాంతో ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు.
హాస్పిటల్‌లో చేరారన్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆసుపత్రి నుంచి వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తాను చాలా బాగున్నానని.. తనను ప్రేమించే అభిమానులు, శ్రేయోభిలాషులు తన వెంట ఉన్నంతకాలం తనకు ఏమీ కాదన్నారు. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే మళ్లీ అందరికీ వినోదం పంచుతానని సాయాజీ షిండే తెలిపారు. సాయాజీ షిండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో ఆయన మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘వీడే’ మూవీలో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో బిజీగా మారిపోయారు. ఇక సాయాజీ షిండే తెలుగు చివరిగా ‘ఏజెంట్ నరసింహ 117’ చిత్రంలో కనిపించారు.