Mallikarjun Kharge | హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఎక్కడ ప్రచారానికి వెళ్లినా.. మటన్, మందిర్, మంగళసూత్రం గురించే మాట్లాడుతున్నారని ఖర్గే మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు. ఐదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది.
ఓడిపోయామనే బాధలోనే ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారు. ఈ ఐదేండ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అద్భుతమైన పాలన కొనసాగిస్తుంది. తెలంగాణలో ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు చేశాం. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా హామీలను అమలు చేస్తాం. తెలంగాణలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. పంట నష్ట పరిహారం కూడా అందజేస్తాం. ఏదైతే చెబుతామో అది పక్కా చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు.
మోదీ హయాంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగడం లేదు. 2021లో కులగణన ఎందుకు చేయలేదు..? జనాభా లెక్కలను మోదీ బయట పెట్టడం లేదు. జనాభా లెక్కలు బయటకి వస్తే అన్ని విషయాలు బయటకి వస్తాయి. దేశాన్ని విడదీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మోదీ అబద్దాలపై అబద్ధాలు మాట్లాడుతున్నాడు. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడడం లేదు. మోదీ ప్రధాని పదవిలో ఉంటూ ఎప్పుడూ హుందాగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీని తిట్టడంపైనే బీజేపీ ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ భయపడుతోంది కాబట్టే తిడుతున్నారు. అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ సంస్థల రైడింగ్ ఎందుకు జరపడం లేదు
మోదీ కేవలం మటన్, మందిర్, మంగళ సూత్రాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మోడీ పదేండ్లలో చేసిన అభివృద్ధి మీద చర్చ చేయడం లేదు. హిందువుల ఆస్తులు ముస్లింలకు ఎలా పంచుతారు. అంబానీ, అదానీ కోసం బీజేపీ పని చేస్తుంది. మోడీ ప్రధాని స్థాయిలో మాట్లాడడం లేదు. మోడీ పదేండ్లలో చేసిన అభివృద్ధి మీద చర్చ చేయడం లేదు. ఇండియా కూటమి అధికారంలోకి రావడంతోనే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాము. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. దేశ వ్యాప్తంగా కుల గణన చేపడుతామని ఖర్గే స్పష్టం చేశారు.