Air India | బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి కొచ్చి బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు అత్యవసరంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని ల్యాండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి 11.12 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి కొచ్చికి ఎయిరిండియాకు చెందిన IX 1132 విమానం టేకాఫ్ అయింది. కాసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలట్లు గుర్తించారు. దీంతో అత్యవసరంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని ల్యాండ్ చేశారు. అనంతరం మంటలను ఆర్పేశారు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లు బెంగళూరు విమానాశ్రయం ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకుండా సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వీలైనంత త్వరగా వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంజిన్‌లో మంటలకు కారణాలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.