JanaPadham_EPaper_TS_14-10-2024
అలయ్.. బలయ్.. ఓ అద్భుతం…
ఉద్యమంలో దాని పాత్ర ఎంతో కీలకం…
అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది
అదే స్ఫూర్తితోనే తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది..
తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం అందరి బాధ్యత
దత్తాత్రేయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న విజయలక్ష్మి
అలయ్ బలయ్ లో సీఎం రేవంత్ రెడ్డి
హాజరైన ప్రముఖులు..
జనపదం, బ్యూరో
తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు, పార్టీలు, కుల మతాలకతీతంగా అందరూ ఒక్కతాటికి వచ్చి కలిసి పని చేసేందుకు అలయ్ బలయ్ ఉపయోగపడిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అలయ్ బలయ్ స్ఫూర్తిగా పనిచేసిందని చెప్పారు. అలయ్ బలయ్ స్ఫూర్తితోనే తెలంగాణ జేఏసీ ఏర్పాటైందని గుర్తు చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బండారు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎం విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీల వారీగా కార్యక్రమాలు జరిగేవన్న సీఎం తెలంగాణ ఉద్యమ సాధనలో అన్ని వర్గాలు కార్యోన్ముఖులై అడుగు ముందుకు వేయడానికి అలయ్ బలయ్ ఒక కారణమైందని చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్న ఆయన ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ కూడా తెలంగాణ కోసం ఉద్యమించాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అతిపెద్ద పండగ దసరా అని, ఈ పర్వదినాన అందరికీ గుర్తొచ్చేది పాలపిట్ట, జమ్మిచెట్టు అని మరోవైపు అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకొస్తారని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమన్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడే మంచి కార్యక్రమం అలయ్ బలయ్ అన్నారు. దత్తాత్రేయ వారసత్వాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని సీఎం అన్నారు. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వీహెచ్, కేశవరావు, పొన్నం ప్రభాకర్ అలయ్ బలయ్‌లో పాల్గొన్నామని వివరించారు. తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం తమ బాధ్యత అన్న రేవంత్ రెడ్డి తామంతా ఒక్కటే అనే సందేశాన్ని అలయ్ బలయ్ ద్వారా నాయకులు ఇచ్చారని వివరించారు. దత్తాత్రేయ నిర్వహిస్తున్న అలయ్ బలయ్ రాజకీయాలకు సంబంధం లేదనీ అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి పని చేయాలి : బండారు దత్తాత్రేయ
రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్ని మనస్పార్థలు ఉన్నా అభివృద్ధి విషయంలో మాత్రం అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. రాజకీయాలకతీతంగా పరస్పరం సహకరించుకుని, ఐకమత్యంతో ముందుకు వెళ్లి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని ఆయా రాష్ట్రాల సీఎంలకు పిలుపునిచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా 2005లో అలయ్ బలయ్ ప్రారంభించామన్న దత్తాత్రేయ ప్రేమ, ఆత్మీయత, ఐఖ్యత చాటి చెప్పాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యమన్నారు. ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని ఢంకా మోగించి ప్రారంభించిన బండారు దత్తాత్రేయ ఈసారి కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ అలయ్ బలయ్‌లో ప్రదర్శించామన్నారు.
ఐక్యత చాటాలి…
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఐక్యంగా ఉండటం అంటే అంతా ఒకే మాట మీద నిలబడటమే కాదు, పక్కవారి ఆలోచనలను, భావాలను గౌరవించటం కూడా అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వివరించారు. అలయ్ బలయ్ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదిక మీద చూడటం ఎంతో ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు సిద్ధాంతాలకే పరిమితం కావాలని, నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే, అది కార్యకర్తల వరకూ పాకుతుందని, ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి కార్యక్రమాల స్ఫూర్తితో సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని, సమష్టి తత్వాన్ని పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వెంకయ్యనాయుడు అన్నారు. ‘అలయ్ బలయ్’ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్నేహశీలి అయిన బండారు దత్తాత్రేయ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఓ చక్కని సంప్రదాయాన్ని ఏర్పాటు చేయటం, వారి కుమార్తె విజయలక్ష్మి ఆ సంస్కృతిని కొనసాగించటం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా, సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యతా వారధుల నిర్మాణం మనందరి సామాజిక బాధ్యతగా పేర్కొన్న ఆయన ఒకప్పుడు ఐక్యత లేక పరాయి పాలనలో సమస్యలు అనుభవించామన్నారు. ఇప్పుడు పాశ్చాత్య అనుకరణ కారణంగా కుటుంబానికి, సమాజానికి దూరమౌతున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ ఏకం కావాలన్నారు.
అలయ్ బలయ్ కు నేను రాలేను
సీపీఐ నారాయణ
19 ఏళ్లుగా దసరా మరుసటి రోజు హరియణా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి ఇకపై తాను హాజరు కాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. అందుకు తనను క్షమించాలని కోరారు. తనను ఆహ్వానించినందుకు కృతజ్ఘతలు తెలిపిన ఆయన ప్రముఖ మేధావి, ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాకు 90 శాతం అంగవైకల్యం ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసిందన్నారు. విచారణలో హక్కుగా ఉన్న బెయిల్ ను కూడా తిరస్కరించి రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసిందన్నారు. చివరకు పదేళ్ల తర్వాత గౌరవ న్యాయస్ధానం అతన్ని నిర్దోషిగా నిర్ధారించిందని తెలిపారు. తాను, తన పార్టీ ప్రొఫెసర్ రాజకీయాలను అంగీకరించకపోవచ్చు కానీ ఆయన విషయంలో మాత్రం మానవ ఉల్లంఘన జరిగిందన్నారు. చివరకు రాజ్యం సాయిబాబాను ఈ ప్రపంచం నుంచి దూరం చేసిందనడంలో సందేహం లేదన్నారు. రాజకీయాల్లో తమకు అపార అనుభవం, మంచితనం ఉండొచ్చని దత్తాత్రేయను ఉద్దేశించి చెప్పిన నారాయణ చివరకు దత్తన్న కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. ఈ లెక్కన సాయిబాబా మృతికి కేంద్రంలోని బీజేపీ కారణమైందనీ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారాయణ వివరించారు.
పొన్నం వర్సెస్ కిషన్ రెడ్డి..
రాజకీయ నేతల మధ్య మనస్పార్థలు తొలిగిపోయే సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రబాకర్ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు విమర్శించుకోవాలి. కానీ, ప్రజలు అసహ్యించుకునేలా కాదన్నారు. నాయకులు మాట్లాడే తీరుతో పాటు భాషలోనూ మార్పు రావాలని ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ఘర్షణ పడొచ్చని, కానీ ఆ తర్వాత అంతా మర్చిపోయి ప్రజల శ్రేయస్సును కోరుకోవాలని సూచించారు. ప్రస్తుతం పార్టీలు విమర్శించుకుంటున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో భాష ముఖ్యమనీ కానీ వేరే వాళ్లకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పారు. కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అలాంటి వారికి స్వీయ నియంత్రణ ఉండాలంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా చొరవ తీసుకోవాలని దత్తాత్రేయకు మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
ఏపీలోనూ అలయ్ బలయ్ నిర్వహిస్తాం
ఏపీ మంత్రి సత్యకుమార్
ప్రేమ, ఆత్మీయత, ఐక్యత చాటింపే లక్ష్యంగా తెలంగాణలో నిర్వహిస్తున్న అలయ్ బలయ్ తరహా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తానని ఏపీ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. వ్యక్తులు, పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కనబెట్టి అందరూ స్నేహభావంతో ఉండాలని చాటిచెప్పేందుకు అలయ్ బలయ్ దోహదపడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న వ్యక్తిగత మనస్పార్థలు తొలిగిపోతాయని చెప్పారు.
ఆకట్టుకున్న వేడుకలు..
అలయ్ బలయ్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, పులి వేషాలు అలయ్ బలయ్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాయి. హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంది.
కార్యక్రమానికి తెలంగాణ, ఉత్తరాఖండ్, రాజస్ధాన్, మేఘాలయ రాష్ట్ర్రాల గవర్నర్లు జిష్టుదేవ్ వర్మ, గుర్మిత్ సింగ్, హరిబాబు పగాడే, సీహెచ్ విజయ శంకర్, కేంద్రమంత్రి గంగపురం కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, నటుడు కోట శ్రీనివాసరావు, తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బీబీపాటిల్, సీపీఐ నేత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ మంత్రులు జానారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ తదితరులు హాజరయ్యారు.