ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి కొనసాగుతోంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ పెళ్లి ఈనెల 12వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సంగీత్ వేడుకలను నిర్వహించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ సంగీత్ వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది.
ముకేశ్ అంబానీ – నీతా అంబానీ, ఈషా – ఆనంద్, ఆకాశ్ అంబానీ – శ్లోకా మెహతాతోపాటు కాబోయే జంట అనంత్ – రాధికలు కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. మరోవైపు నీతా – ముకేశ్ దంపతులు తమ మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఇక ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు సహా క్రికెటర్లు హాజరై సందడి చేశారు. స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ – సాక్షి సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అతడి భార్య దేవిషా శెట్టి, శ్రేయష్ అయ్యర్, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, దిశా పటానీ, మౌని రాయ్, అనన్య పాండే, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ సహా తదితరులు హాజరై సందడి చేశారు. వేడుకల్లో భాగంగా స్టేజ్‌పై అలియా – రణ్‌బీర్ జంట డ్యాన్స్ కూడా చేశారు.
కాగా, పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ వివాహం జులై 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుకలకు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ వేడుకలు.. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగుస్తాయి. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చకచకగా జరుగుతున్నాయి.