Monday, December 30, 2024
HomeAndhra PradeshAP Elections | జనసేనాని కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌.. పవన్‌ను గెలిపించాలని వీడియో రిలీజ్‌...

AP Elections | జనసేనాని కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌.. పవన్‌ను గెలిపించాలని వీడియో రిలీజ్‌ చేసిన చిరంజీవి

AP Elections | ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్‌సీపీ సర్వశక్తులు ఒడ్డొతున్నది. అదే సమయంలో ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో మండే ఎండలను సైతం లెక్క చేయకుండా అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా ఆయన సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి రంగంలోకి దిగారు. సోషల్‌ మీడియా వేదికగా చిరుకు మద్దతుగా వీడియో సందేశాన్ని రిలీజ్‌ చేశారు.

‘కొణిదెల పవన్ కల్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలి. మేలు జరగాలనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ, కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం.. ఇలా ఎన్నెన్నో చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా.. జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది’ అన్నారు.

సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడని.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చినట్లు తెలిపారు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందన్న మెగాస్టార్‌.. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే అలాగే బాధేస్తుందన్నారు. ‘అలా బాధ పడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు.. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను’ అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు.

తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్’ అన్నారు. ‘ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్ట సభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో మీరు చూడాలంటే.. పిఠాపురం ప్రజలు పవన్‌ని గెలిపించాలి’ అని కోరారు. ‘సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు. మీ కోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాన్‌ని గెలిపించండి. జైహింద్’ అంటూ చిరంజీవి పవన్‌కి సపోర్టుగా ప్రజలకు సందేశం ఇచ్చారు.

RELATED ARTICLES

తాజా వార్తలు