రాజమండ్రి: వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ అన్నారు. జగన్ ఐదేండ్ల ప్రభుత్వంలో పాలన పట్టాలు తప్పిందని విమర్శించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా, కానీ అవినీతి వందశాతం పెరిగిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని చెప్పారు. రాజమండ్రిలో నిర్వహించిన ఎన్డీయే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ.. నా ఆంధ్రా కుటుంబసభ్యులకు నమస్కారాలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. గోదావరి మాతకు ప్రణామాలు. ఈ నేలమీదే ఆదికవి నన్నయ తొలి కావ్యం రాశారు. ఈ నేల నుంచే ఇప్పుడు సరికొత్త చరిత్ర లిఖించబోతున్నాం. ఐదేళ్ల సమయాన్ని వైసీపీ వృథా చేసిందన్నారు.
ఎన్డీఏ పాలన వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తామని ప్రధాని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిందని.. కాని ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్ లావాదేవీలు చేస్తోందంటూ విమర్శించారు. అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉంది, అభివృద్ధికి బ్రేక్ పడిందని చెప్పారు. మూడు రాజధానులు కడతామన్నారు, ఒక్క రాజధాని కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరిట లూటీ చేద్దామనుకున్నారు.. కానీ ఖజానా ఖాళీ అయిందంటూ విమర్శించారు. అవినీతిని మేనేజ్ చేయగలరు, ఆర్ధిక నిర్వహణ మాత్రం చేయలేరంటూ విమర్శించారు. పోలవరం కడతామన్నారు, ఏపీకి జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టుకు బ్రేకులు వేశారంటూ విమర్శించారు. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం 15వేల కోట్లు ఇచ్చింది. కానీ రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్లనివ్వడంలేదన్నారు. జూన్ 4 తర్వాత ఎన్డీఏ సర్కార్ ఇలాంటి సమస్యలను దూరం చేస్తుందని.. ఎన్డీఏ పాలనతోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు.
దేశంలో, రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్డీఏదే అధికారమని చెప్పారు. ఈ రాష్ట్రం ప్రతిభావంతులైన యువతకు నెలవు, టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమి ఒప్పుకుందని చెప్పారు. యూపీఏ పాలన అంతా స్కామ్‌ల మయమని విమర్శించారు.