Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్.. ఈ సమయంలో సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై స్పందించారు. పదవి నుంచి తప్పించేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నారని. ఇందులో భాగంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. ఆ విషయం అర్థమైంది కాబట్టే తాను పదవికి రాజీనామా చేయలేదన్నారు. తాను అరెస్టయిన నుంచి బీజేపీ నేతలు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆప్ పార్టీ అధినేత గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని.. పదవి నుంచి దించేందుకు తప్పుడు కేసులు పెట్టిన వారి ఆటలు సాగనివ్వకూడదనే ఉద్దేశంతో పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ నిజంగానే అవినీతిపై పోరాడాలనుకుంటే కేజ్రీవాల్‌ను చూసి నేర్చుకోవాలని.. మంత్రులతో సహా అవినీతి నాయకులను మేం జైలుకు పంపించినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. పార్టీని ఎలా అణగదొక్కాలో తెలియక పార్టీ కీలక నేతలు నలుగురిని ప్రధాని నరేంద్ర మోదీ జైలుకు పంపారని.. ఆప్‌పై విసరడానికి రాళ్లు మిగలక పోవడంతో టాప్ లీడర్లను జైలుకు పంపి పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని చూశారని ధ్వజమెత్తారు. ఆప్ కేవలం పార్టీ కాదని, ఒక ఐడియాలజీ స్పందించారు. ఆప్‌ని ఎంత అణచివేయాలని ఆలోచిస్తే అంత పైకి ఎగుతుందని స్పష్టం చేశారు. అందరి ప్రార్థనల ఫలితంగానే తనకు బెయిల్ వచ్చిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.