Daily Bath | అసలె ఎండలు దంచికొడుతున్నయ్.. ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఇప్పుడు ఈ సందేహం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా. రోజూ స్నానం (Daily Bath) చేయడం తప్పనిసరి ఏం కాదంటున్నారు కొందరు. సామాజిక వత్తిడి వల్లే మనం స్నానం చేస్తున్నామంటున్నారు. ఏండ్ల తరబడి స్నానం చేయకున్నా బానే ఉన్నామంటున్నారు. అయితే ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల లాభాలు ఉన్నాయని, రక్త ప్రసరణ వ్యవస్థ బాగుపడుతుందని, గుండె జబ్బులు దూరమవుతాయని మరికొందరు అంటున్నారు. అసలు ఇందులో ఏది నిజం.. ఏది అబద్దం.
మనం ఉన్న ప్రదేశం, వాతావరణాన్నిబట్టి మన అలవాట్లు ఉంటాయి. దేశంలో దాదాపు అంతా రోజూ స్నానం చేస్తారు. కొందరైతే రెండు పూటలూ జలకాడుతారు. అయితే ఇతర దేశాలలో ఇలా లేదు. అగ్రరాజ్యం అమెరికాలో మూడింట ఒక వంతు మంది ప్రతిరోజూ, ఆస్ట్రేలియాలో 80 శాతం మంది స్నానం చేస్తారు. అదే చైనాలో అయితే సగం కంటే ఎక్కువ మంది వారానికి రెండు రోజులు మాత్రమే స్నానం చేస్తారట. దీంతో రోజూ స్నానం చేయొచ్చా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల శుభ్రంగా ఉంటామని, మన శరీరంలోని మురికి తొలగిపోతుందని భారత్‌లోని చాలా మంది నమ్ముతారు. అందువల్ల ఎవరైనా ప్రతిరోజూ స్నానం చేయొద్దని చెబితే ఎగతాళి చేస్తారు. కానీ పాశ్చాత్య దేశాల్లో రోజూ స్నానం చేయడం అనవసరమని చెబుతున్నారు.
ప్రతిరోజూ స్నానం చేయడం ఒక సామాజిక ఆచారం మాత్రమేనని, దానివల్ల శరీర దుర్వాసన తొలగిపోతుందనే నమ్మకం సమాజంలో ఉందని పర్యావరణవేత్త డోనాచాద్ మెక్‌కార్తీ అంటున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని, ఆరోగ్యం చెడిపోతుందని సమాజం చెప్పడంతోనే స్నానం చేస్తున్నామని తెలిపారు. తాను నెలలో రెండు రోజులు మాత్రమే స్నానం చేస్తాని వెల్లడించారు.
మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది..
రోజూ స్నానం చేయడం వల్ల ఎలాంటి శారీరక ఆరోగ్య ప్రయోజనాలు రావని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఆరోగ్యకరమైన చర్మం నుంచి విడుదలయ్యే నూనె, మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు.. రోజూ సబ్బుతో తలస్నానం చేయడం వల్ల తొలగిపోతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ రాబర్ట్ హెచ్ ష్మెర్లింగ్ తెలిపారు. ఇది పొడి చర్మం, దురదకు దారితీసే అవకాశం ఉందన్నారు. పొడి చర్మం కారణంగా హానికరమైన బ్యాక్టీరియా దానిని చేరుకోవడానికి మార్గం లభిస్తుందని, తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్ల వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు.
రోజూ స్నానం చేయడం తప్పనిసరి..
రోజూ స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికే కాదు శరీరానికి కూడా చాలా లాభాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఎంత తరచుగా స్నానం చేస్తారు అనేది మన శరీరం చెమటపై ఆధార పడి ఉంటుందని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జోసీ పార్క్ అన్నారు. ఇవి ఎక్కువగా ఉంటే స్నానం చేయడం కూడా తప్పనిసరన్నారు. స్నానం చేయడం వల్ల మన శరీరంపై ఉన్న బ్యాక్టీరియా, మలినాలు అన్నీ పోతాయని, మనసు ప్రశాంతంగా, రీ ఫ్రెష్‌గా ఉంటుందన్నారు. చికాకులు కూడా దూరమవుతాయని, నిద్ర కూడా బాగా పట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రాత్రి పూట పడుకునే ముందు కూడా స్నానం చేయడం వల్ల గుండెకు ఆరోగ్యంగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళనను కూడా దూరం చేసుకోవచ్చు. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఇలా రోజూ స్నానం చేయడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.