Bettings | ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీతోపాటు లోక్‌సభ స్థానాల ఫలితాలు (Ap Elections) వెలువడనున్నాయి. అధికారం కోసం అధికార విపక్షాలు శక్తివంచన లేకుండా కృషిచేశాయి. ఓ వైపు సీఎం జగన్ అంతా తానై ప్రచారం నిర్వహించగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్, ప్రధాని మోదీ రాష్ట్రంలో విస్తృతంగా క్యాంపైన్ చేశారు. అయితే ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనే విషయం అటుంచితే రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో ప్రముఖుల విజయావకాశాలపై ఆసక్తి నెలకొంది. వారి గెలుపోటములపై జోరుగా పందేలు (Bettings) కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీలో ఉన్న పిఠాపురంపై భారీగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. కొందరైతే ఏకంగా భూములను కూడా పందెంగా పెట్టడం గమనార్హం. రాష్ట్రంలో ఈసారి పోలింగ్ శాతం బాగా పెరగడంతో ఎక్కడ చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. సంక్రాంతి సమయంలో కోడిపందేల తరహాలో ఈ బెట్టింగ్స్ సాగుతున్నాయి. రూ.లక్షకు 5 లక్షలు (1:5 రేసియోలో) పందేలు కాస్తున్నారు.
ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు? గెలిచిన అభ్యర్థికి ఎంత ఆధిక్యం? కీలక నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తోంది? ఎక్కువ సీట్లుఎవరు సాధిస్తారు? ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది? అన్న అంశాలపై జోరుగా పందేలు సాగుతున్నాయి. కార్యకర్తల స్థాయిలో లక్షల్లో పందేలు వేస్తుంటే, నాయకుల స్థాయిలో కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు.
బెట్టింగ్ ఈ సీట్లపైనే..
జోరుగా పందేలు సాగుతున్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి ఉన్నాయి. ఆ తర్వాత నెల్లూరు రూరల్, దర్శి, చీరాల, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఈస్ట్, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం నియోజకవర్గాల్లో టీడీపీ-వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్ రాయుళ్లు రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై
ఇక పిఠాపురంలో పవన్ కల్యాణ్ 50 వేలకుపైగా ఆధిక్యం సాధిస్తారని కాకినాడకు చెందిన ఓ వ్యాపారి రూ.2.5 కోట్లు మీడియేటర్ వద్ద ఉంచినట్టు తెలుస్తున్నది. ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయంపై 1:2 లెక్కన బెట్టింగ్ సాగుతున్నది. పులివెందులలో సీఎం జగన్ రికార్డు మెజారిటీలపై 1:3 చొప్పున పందేలు సాగుతుండగా, కుప్పంలో చంద్రబాబు మెజారిటీపై బెట్టింగ్ కాస్తున్నారు. యాప్‌లలో కూడా జోరుగా బెట్టింగ్ కొనసాగుతున్నది.
దేశవ్యాప్తంగా ఉన్న బెట్టింగ్ యాప్‌లే కాకుండా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో గ్రూపులు క్రియేట్ చేసి బెట్టింగ్ చేస్తున్నారు. మామూలుగా జరుగుతున్న బెట్టింగ్‌లు లక్షల నుంచి కోట్ల వరకు ఉండగా, యాప్‌ల్లో మాత్రం పైసల్లో చూపిస్తున్నారు. పోలీసులకు చిక్కినా తమ బెట్టింగ్‌లు పైసల్లో ఉన్నాయని చెప్పుకోవడానికి వీలుగా ఇలా చేస్తున్నారని తెలుస్తున్నది. మరి ఎన్నికల ఫలితాలు ఎవరిని కుబేరులను చేస్తాయో, ఎవరిని బిచ్చాధికారిని చేస్తాయో జూన్ 4న తేలనుంది.