Bhole Baba: భోలే బాబా బాగోతం
- ఐదు లైంగిక దాడి కేసుల్లో నిందితుడు..
- జైలుకెళ్లి.. బాబాగా మారి
- ఓ కేసులో కొన్నాళ్ల పాటు జైలు జీవితం
- 18 ఏండ్లపాటు పోలీసు శాఖలో ఉద్యోగం
- వీఆర్‌ఎస్ తీసుకొని బాబాగా అవతారం
భోలే బాబా అసలు బాగోతం తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటూ అమాయక జనం ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ‘భోలే బాబా’ బాగోతానికి సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జగద్గురు సాకార్ విశ్వహరి భోలే బాబాగా ప్రాచూర్యం పొందిన ఇతడి అసలు పేరు సూరజ్ పాల్.
లక్నో: తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటూ అమాయక జనం ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ‘భోలే బాబా’ బాగోతానికి సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జగద్గురు సాకార్ విశ్వహరి భోలే బాబాగా ప్రాచూర్యం పొందిన ఇతడి అసలు పేరు సూరజ్ పాల్. నారాయణ్ సాకార్ హరి, సాకార్ విశ్వ హరి పేర్లతోనూ చలామణి అయ్యేవాడు. యూపీలోని ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏండ్ల పాటు పని చేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడీ కొట్టించేవాడు. 1999లో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి బాబా అవతారం ఎత్తాడు. అయితే, లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నందునే సస్పెండ్ అయ్యాడనే ప్రచారం కూడా జరుగుతున్నది.
ఐదు లైంగిక దాడి కేసుల్లో నిందితుడు
భోలే బాబాపై ఆగ్రా, ఎతావాహ్, కస్‌గంజ్, ఫరూఖాబాద్, దూసా ప్రాంతాల్లో ఐదు లైంగిక దాడి కేసులు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. 1997లో ఓ కేసులో అరెస్టయి కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్టు తెలుస్తున్నది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే తన గ్రామంలో ఓ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తనకు గురువు ఎవరూ లేరని చెప్పుకునే భోలే బాబా.. కాషాయానికి బదులుగా తెల్లటి సూటు, బూట్లు, నల్ల కండ్లద్దాలు ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు.
మూఢ నమ్మకాలతో మోసం
తనను నమ్మే వారిని భోలే బాబా అనేక మూఢ నమ్మకాలతో ముంచేశాడని తెలుస్తున్నది. ముఖ్యంగా తాను నిర్వహించే సత్సంగ్‌లలో ఇచ్చే పవిత్ర జలం తాగితే భక్తుల సమస్యలు తీరిపోతాయనే ప్రచారం చేయించాడు. తన పాదధూళి కూడా పవిత్రమైనదని, బాబా నడిచిన నేలపై మట్టిని తాకినా అదృష్టం వరిస్తుందనే నమ్మకాన్ని సృష్టించాడు. ఇవి నమ్మి ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్‌తో పాటు ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున జనం భోలే బాబా దర్శనం కోసం వచ్చే వారు.
121కి పెరిగిన మృతుల సంఖ్య
ఫుల్య్రీలో మంగళవారం భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కు చేరుకుంది. అనేక మంది దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.