15 రోజుల్లో పదో ఘటన
బీజేపీ, జేడీయూ పాలిత బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గత రెండు వారాల నుంచి వరుసగా బ్రిడ్జ్‌లు, కాజ్‌వేలు కూలిపోతున్నాయి. ఇక బుధవారం ఒక్కరోజే మూడు వంతెనలు/కాజ్‌వేలు కూలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ కూడా మరో బ్రిడ్జ్ కూలిపోయింది.
సరన్ జిల్లాలో గండకి నదిపై ఉన్న వంతెన గురువారం ఉదయం కూలిపోయినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అమన్ సమీర్ తెలిపారు. ఇది 15 ఏళ్ల నాటి వంతెన అని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. సరన్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో వంతెనలు కూలడం ఇది మూడోదిగా పేర్కొన్నారు. ఈ ఘటనతో సరన్‌లోని గ్రామాలను పొరుగున ఉన్న సివాన్ జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, 15 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో వంతెనలు కూలడం ఇది పదో ఘటన కావడం గమనార్హం.