Saturday, December 28, 2024
HomeTelanganaElection Results | బీజేపీలో కొత్త జోష్..

Election Results | బీజేపీలో కొత్త జోష్..

Janapadham_EPaper_TS_10-10-2024

బీజేపీలో కొత్త జోష్..

రెండు రాష్ట్రాల రిజల్ట్స్ తో ఊపు..
ఓటింగ్ పెరగడంపై కమలం ఖుషీ..
ఒక్క ఫలితం.. లక్షల అనుమానాలు…
జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్..
హర్యానా, జమ్మూ ఫలితాలతో తెలిసిపోయిన ఓటరు నాడీ..

కమలం మరింత వికసిస్తున్నది. పనైపోయిందని పండుగ చేసుకుందామనుకున్న వారి నోళ్లు మూయిస్టూ దగదగ మెరిసే వన్నెను సంతరించుకుంది. ఉత్తర భారతాన రెండు రాష్ట్రాల్లో ఫలితాలు పార్టీకి కొత్త జవసత్వాలే ఇచ్చాయి. మోదీ ప్రభ తగ్గిందని కూసిన వారికి వాటితో చెంప చెల్లుమన్నంత పనైంది. మూడో సారి ప్రధాని పీఠం అలంకరించిన నరేంద్రుడి ఛర్మిష్మా తగ్గలేదని, ఆ మధ్య వెలువడిన కొన్ని రాష్ట్రాల్లోని ఫలితాలతో పోయిందేమీ లేదనే క్లారిటీ వచ్చింది. పనైపోయినట్టే అనుకున్న అపభ్రమ తొలగి, ప్రతిపక్షానికే పెను సవాల్ విసిరే స్థాయిగా ఉన్న బీజేపీ బలం కేడర్ లో కొత్త శక్తులను రేపుతుండగా, ఆయా రాష్ట్రాల్లో మరింత ఉన్నతికి బూస్ట్ మాదిరిగా దొరికింది.

జనపదం, బ్యూరో

=====================

రెండు రాష్ట్రాల ఫలితాలు., రెండు జాతీయ పార్టీలు. అంచనాలు., లెక్కలు. కాంగ్రెస్ అయితే నేలవిడిచిసామే చేసినంత పని. బీజేపీ పని ఖతం., కేంద్రంలోని సర్కార్ పై జనం తీవ్ర అసహనంతో ఏకపక్షంగా చేతివైపే నొక్కుతారని కలల సాగరంలో తేలిపోయింది కూడా. కానీ అనుకున్నవన్నీ జరిగితే కిక్కేముంటది. సరిగ్గా అదే జరిగింది ఈనెల 8వ తేదీ ఫలితాల్లో. ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఫలితాలతో అంతా తారుమారు. హస్తానికి శృంగభంగం., కమలానికి కొత్త వికాసం. హర్యానాలో బీజేపీ ముచ్చటగా మూడో సారి పీఠం దక్కించుకోగా, జమ్మూకశ్మీర్ ఓటింగ్ శాతం పెంచుకుని తానేంటో, వాడి ఏ స్థాయిదో అని సవాల్ విసిరింది. లెక్కింపు మొదలైన మొదట్లో, రిజల్ట్స్ ఒక్కొక్కటిగా ప్రకటన వేళ సంబురాల్లో ఉన్న చేతి పార్టీ, ఆఖరి వేళ ఆగమైంది. ప్లేట్ ఫిరాయిస్తూ తొండికి దిగి ఈవీఎంలపై దుమ్మెత్తిపోసింది.

బీజేపీలో కొత్త జోష్..
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ప్లాన్ ప్రకారం చొచ్చుకెళ్తున్న బీజేపీకి ఈ ఫలితాలతో మరింత బలం చేకూరింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు కొత్త జోష్ తో పార్టీ బలోపేతానికి మరింత శ్రమించాలనే కార్యదీక్ష దిశగా వెళ్లడానికి ఫలితాలు ప్రేరణగా మారాయి. తెలంగాణలో రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి పునాదులు గట్టిగా వేయాలని చూస్తున్న నాయకులకు ఇదో టానిక్ గా మారింది. దేశమంతా మోదీ వైపే చూస్తోందని, అందుక నిదర్శనం ఆ ఫలితాలే అని ఇప్పటికే నాయకులు ప్రచారం కూడా మొదలు పెట్టారు.

ఒక్క ఫలితం.. లక్షల అనుమానాలు…
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఫలితాలు బీజేపీకి కొత్త బలం ఇవ్వగా, కాంగ్రెస్ చావు తప్పికన్నులొట్టపడినట్టే అని సరిపెట్టుకుంది. కానీ, ఫలితాలు వెలువడడానికి ముందు సంబురాల్లో మునిగిన కాంగ్రెస్ ఒక్కొక్కటిగా ప్రకటన వస్తున్న కొద్దీ టాపిక్ మళ్లింపునకు పూనుకున్నది. బీజేపీ ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే ఫలితాలను తారుమారు చేసిందనే పాత రాగాన్నే ఎత్తుకుని నవ్వులపాలైంది. నీకు అనుకూలమైతే ఒకటి, ప్రతికూలమైతే మరోటా.. అని జనమంతా ఈసడించుకునేలా చేసుకుంది.
దేశమంతా రాహుల్ ప్రభ పెరుగుతోందని, మోదీకి ఇక నూకలు చెల్లినట్టే అని ప్రచారం మొదలు పెట్టిన కాంగ్రెస్ కు మింగుడపడని విషయమిది. కాంగ్రెస్ ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఫలితాలు చెబుతున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా గ్యారంటీలతో గట్టెక్కి గద్దెనెక్కుదామని భావించిన పార్టీ పెద్దలకు ఊహించని షాక్ తగిలింది. నిజంగా కాంగ్రెస్ కు బలం పెరిగితే ఏక పక్షంగా ఫలితాలు కనబడాల్సి ఉండాల్సింది. అలాకాకుండా కూటమిగా జట్టుకడితే తప్ప సాగలేని స్థితిలో ఉన్న ఆ పార్టీ పరిస్థితిని చూసి దేశమంతా ఎటుందో ఇట్టే తెలిసిపోతున్నది. కాగా, ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఓటరు నాడీ తెలిసిపోయిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. జనమంతా మోదీ వెంటే ఉన్నారని, తప్పుడు ప్రచారంతో ఏదో సాధిద్దామని ఊహల్లో విహరిస్తున్న వారికి ఈ ఫలితాలు తగిన గుణపాఠమంటున్నారు. ఏదిఏమైనా దేశమంతా జాతీయ వాదంతో సాగుతున్న బీజేపీ వైపే ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర నేతలు గర్వంగా ప్రకటిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు