Sushil Kumar Modi | పాట్నా : బీజేపీ సీనియర్ నాయకుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడచారు. ఢిల్లీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సుశీల్ కుమార్ అంత్యక్రియలు పాట్నాలో మంగళవారం నిర్వహించనున్నారు.
సుశీల్ కుమార్ మోదీ మృతిపట్ల ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సుశీల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ఆయన సేవలు మరిచిపోలేనివని పేర్కొన్నారు.
బీజేపీలో సుశీల్ కుమార్ ఎంతో ఎత్తుకు ఎదిగారు. లోక్‌సభ, రాజ్యసభ పదవుల్లో కొనసాగారు. బీహార్ డిప్యూటీ సీఎంగా రెండు సార్లు పని చేశారు. అయితే ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ అగ్ర నాయకత్వం కోరినప్పుడు తనకు క్యాన్సర్ ఉందని, దాంతో పోరాడుతున్నానని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుశీల్ కుమార్ మోదీ స్వయంగా వెల్లడించారు.
ఎవరీ సుశీల్ కుమార్..?
1952, జనవరి 5వ తేదీన సుశీల్ కుమార్ జన్మించారు. పాట్నా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఆయన విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1973లో నిర్వహించిన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో సుశీల్ కుమార్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా సుశీల్ కుమార్ సేవలందించారు. 1990లో పాట్నా సెంట్రల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996 నుంచి 2004 వరకు బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2004లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భగల్‌పూర్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఏడాది కాలం మాత్రమే ఆయన ఎంపీగా కొనసాగారు. ఎందుకంటే బీహార్ డిప్యూటీ సీఎంగా ఆయనకు అవకాశం వచ్చింది. దీంతో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా పదవి పొందారు. 2005 నుంచి 2013 వరకు, 2017 నుంచి 2020 వరకు బీహార్ డిప్యూటీ సీఎంగా సేవలందించారు. 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఆయన పదవీకాలం ముగిసింది.