Akshay Kumar | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడుతల పోలింగ్ ముగిసింది. ఇక ఐదో దశ పోలింగ్ సోమవారం మొదలైంది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైతం ఓటువేశారు. గతేడాది ఆయన భారత పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఇండియన్ సిటిజన్ షిప్ పొందిన అనంతరం అక్షయ్ ఓటు వేయడం ఇదే తొలిసారి. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ మరింత అభివృద్ధి చెందిన దేశంగా, శక్తిమంతంగా మారాలని కోరుకుంటున్నానన్నారు.
ఈ దృష్టిలోనే నేను ఓటు వేశానన్నారు. భారతీయులు కూడా తమకు నచ్చిన వారికి ఓటు వేయాలని.. ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందనే అనుకుంటానన్నారు. 1990ల్లో బాలీవుడ్‌లో వరుసగా 15 పరాజయాలను ఎదుర్కొన్న అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆయనకు టైమ్ కలిసి రావడంతో మళ్లీ విజృంభించారు. 2019లో ఆయన మళ్లీ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ప్రభుత్వం మళ్లీ పౌరసత్వం ఇచ్చింది. గతంలో కెనడా పౌరసత్వం వదులుకోవడంపై స్పందించారు. నా సర్వస్వం భారత దేశమేనని.. నేను సంపాదించింది.. పొందింది అంతా భారత్‌లోనేనని తెలిపారు. దేశానికి నాకు చేతనైనంత తిరిగిచ్చే అవకాశం దక్కడం నా అదృష్టమని.. కానీ పూర్తిగా తెలుసుకోకుండా జనాలు నోరు పారేసుకుంటుంటే బాధ కలుగుతుందన్నారు.