Wednesday, April 2, 2025
HomeNationalBonalu: జగదాంబికకు తొలి బోనం

Bonalu: జగదాంబికకు తొలి బోనం

 

నగరంలో నేటి నుంచి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మొదలుకానున్నాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో.. బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

  • నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు షురూ
  • గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం
  • లంగర్‌హౌస్‌లో బోనాలను ప్రారంభించనున్న స్పీకర్‌, మంత్రులు
  • ప్రభుత్వం తరపున ఎల్లమ్మకు పట్టువస్ర్తాల సమర్పణ

మెహిదీపట్నం: నగరంలో నేటి నుంచి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మొదలుకానున్నాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో.. బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 9 వారాల పాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ కోటలోనే బోనాలు ముగిస్తాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు దేశ, విదేశాల సందర్శకులు తరలివస్తారు. ప్రతి ఆదివారం, గురువారం జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇదిలా ఉండగా శనివారం ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ -13 డిప్యూటీ కమిషనర్‌ శశిరేఖ, ఈఈ వెంకటశేషయ్య తదితరులతో కలిసి గోల్కొండ కోటలో పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు.

గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ బోనాలు ఆదివారం లంగర్‌హౌస్‌ చౌరస్తాలో ప్రారంభమవుతాయి. ఇక్కడ ప్రభుత్వం తరఫున మంత్రులు బోనాలను అధికారికంగా ప్రారంభించి.. అనంతరం అమ్మవారికి పట్టు వస్ర్తాలను అందజేస్తారు. అక్కడి నుంచి పట్టు వస్ర్తాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గోల్కొండ కోట వరకు కొనసాగుతాయి. గోల్కొండ చోటా బజార్‌లో దిగంబర్‌ పంతులు ఇంట్లో అమ్మవారిని ఆభరణాలతో అలంకరించి.. గోల్కొండ కోటపై ఉన్న ఆలయం వరకు ఊరేగించి తొట్టెలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. శనివారం గోల్కొండ కోట బోనాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున 11 లక్షల రూపాయల చెక్కును మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ గోల్కొండ ఈవో శ్రీనివాస్‌రాజు, ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు.

లంగర్‌హౌస్‌ చౌరస్తాలో బోనాలను ప్రభుత్వం తరపున స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండ సురేఖ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిలతో కలిసి ప్రారంభిస్తారని గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్‌ కాంత అరవింద్‌ మహేశ్‌కుమార్‌ తెలిపారు. చారిత్రక గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే ఆషాఢ మాసం బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ఆదివారం బోనాల ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలంటూ.. ఉత్సవ కమిటీ తరఫున రాష్ట్ర మంత్రులు, ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రాలను అందించామన్నారు. తొమ్మిది వారాల పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా కమిటీ సభ్యులందరిని సమన్వయం చేసుకుంటూ అధికారులతో కలిసి విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు.

భారీ పోలీస్‌ బందోబస్తు ; దక్షిణ ,పశ్చిమ మండలం డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
గోల్కొండ బోనాల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం 600 మంది పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నామని, సీసీ కెమెరాల నిఘాలో బోనాలను పర్యవేక్షిస్తామని చెప్పారు. గోల్కొండ కోటకు వచ్చే వారికి మూడు ప్రాంతాల్లో పార్కింగ్‌ ఉంటుందని, సెవన్‌ టూంబ్స్‌ వద్ద ఓ పార్కింగ్‌, లంగర్‌హౌస్‌ హుడా పార్కు వద్ద పార్కింగ్‌, రాందేవ్‌గూడ దాటిన తర్వాత ఓ పార్కింగ్‌ ప్రదేశాన్ని కేటాయిస్తున్నామన్నారు. అంతేకాకుండా సెవన్‌ టూంబ్స్‌, రాందేవ్‌గూడల వైపు నుంచి వచ్చే వారికి పార్కింగ్‌ దగ్గర నుంచి కోట వరకు ఉచిత సెట్విన్‌ బస్సు, లంగర్‌హౌస్‌ హుడా పార్కు నుంచి వచ్చే వారి కోసం ఫ్రీ ఆటోలను పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్నట్లు డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహాయ సహకారాలు అందించి ప్రశాంత వాతావరణంలో బోనాలను జరుపుకోవాలన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు