హనుమకొండ : తన ప్రేమకు అంగీకారం తెలపాలనో.. లేదంటే ప్రేమ పెళ్లి కావాలనో ప్రేమికులు మొక్కని దేవుడు ఉండడు.. వెళ్లని గుడి ఉండదు. ఇక తమకు ఇష్టమైన నాయకులు ఎన్నికల్లో గెలవాలని కూడా కొందరు దేవుళ్లకు మొక్కుతుంటారు.. వేల కొబ్బరికాయలు కొడుతుంటారు. కొందరైతే మోకాళ్ల నడక కూడా ఎంచుకుని, తమ కోరికలను నెరవేర్చాలని దేవుళ్లను ప్రార్థిస్తుంటారు. అది కూడా తమకు ఇష్టమైన వారి కోసం.
అయితే ఓ వ్యక్తి కూడా తన బామ్మర్ది కోసం.. ఒకట్రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 70 కిలోమీటర్లు మోకాళ్లపై నడుచుకుంటూ మొక్కు తీర్చుకున్నాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లాలోని అంబాల గ్రామంలో వెలుగు చూసింది. అంబాల గ్రామానికి చెందిన నాగరాజు.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన బామ్మర్ది కోలుకుంటే మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తానని ఐనవోలులోని మల్లికార్జున స్వామిని మొక్కుకున్నాడు బావ. బామ్మర్ది రజనీకాంత్ కోసం అంబాలి గ్రామం నుండి ఐనవోలులోని మల్లికార్జున స్వామి ఆలయం వరకు సుమారు 70 కిలోమీటర్లు మోకాళ్ళ పైన నడుచుకుంటూ వెళ్లి మొక్కు తీర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.