KCR | సిద్దిపేట : సిద్దిపేట ప్రజలు ఎటువంటి పులులో తనకు తెలుసు.. మీరు పట్టుబడితే.. జట్టుకడితే.. లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావుకు ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20 వేల మెజారిటీ ఎక్కువ ఇవ్వాలని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను కేసీఆర్ కోరారు. సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
మీ గొప్ప స్వాగతం నా గుండెల నిండా సంతోషం కలిగించింది. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా పని చేశారు ఈ జిల్లాలో. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా కావాలని అడిగాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను సీఎం అయ్యాక, హరీశ్‌రావు మంత్రి అయ్యాకు సిద్ధిపేట జిల్లాను చేశాం. సిద్దిపేటకు రైలు, గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తాం అని అంటోంది. సిద్దిపేట జిల్లా తీసేస్తామంటే మరో యుద్ధానికి సిద్ధమా? ప్రజలకు పరిపాలన తీసుకురావాలని జిల్లాలను చేస్తే.. ఈ మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తామని అంటున్నారని కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
హరీశ్‌రావు నాయకత్వంలో సిద్దిపేట జిల్లాలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నామని.. ఆ అభివృద్ధి కొనసాగాలంటే.. మన హక్కులు రావాలంటే.. మన నీళ్లు మనకే ఉండాలంటే.. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావుకు ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20 వేల మెజారిటీ ఇచ్చి.. అంటే ఒక లక్ష మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. సిద్దిపేట జిల్లా మెజార్టీతోనే వెంకట్రామిరెడ్డి ఎంపీగా గెలిచిపోయారు. వెంకట్రామిరెడ్డి గెలుపులోనే సిద్దిపేట జిల్లా గెలుపు ఉందని.. మెదక్ పార్లమెంటు గెలుపు ఉంది. వెంకట్రామిరెడ్డి డబ్బులు, పదవుల కోసం ఆశపడి రాలేదు. తన మాట, హరీశ్‌రావు మాట మీద విశ్వాసం ఉంచి లక్ష మెజార్టీని సిద్దిపేట నుంచే ఇవ్వాలి. మీరు ఎటువంటి పులులో తనకు తెలుసు. మీరు పట్టబడితే.. జట్టు కడితే లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదని కేసీఆర్ అన్నారు.