Harish Rao | హుస్నాబాద్ : తెలంగాణలో ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిరంతరం విద్యుత్ ఉండేదని, ఇప్పుడు నిత్యం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పారు. ఐదు నెలలవుతున్నా దిక్కులేదని దుయ్యబట్టారు. పెళ్లి చేసుకున్న యువతులకు తులం బంగారం ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదు. పైగా కాంగ్రెస్ వచ్చాక బంగారం ధరలు ఆకాశాన్నాంటాయి. కల్యాణలక్ష్మీ చెక్కులను కూడా పంచడం లేదు. కేసీఆర్ కిట్ ఇవ్వడం లేదు. రైతులను, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు.
గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్ వచ్చినప్పుడు తాము గెలిస్తే ఇక్కడ మెడికల్ కాలేజీ ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ఏమైంది..? రాహుల్ గాంధీ ఇటీవల మహిళల ఖాతాల్లో రూ. 2,500 జమ చేశామన్నారు. రాహుల్ గాంధీ అబద్దాల గాంధీగా మారారు అని హరీశ్‌రావు విమర్శించారు.