Harish Rao | జహీరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. 100 కాదు 200 రోజులైనా కాంగ్రెస్ హామీలు అమలు కావు. రాహుల్ గాంధీ కొత్త హామీలు ఇచ్చే ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కానందున తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌కు మద్దతుగా జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొన్న జహీరాబాద్ పట్టణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని రాహుల్ గాంధీ అంటున్నాడు. రూ. 2,500 తీసుకున్న వారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.. రానివారు బీఆర్ఎస్‌కు ఓటేయండి అని హరీశ్‌రావు సూచించారు. ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసి.. కాంగ్రెస్ వాళ్లు దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ హక్కులు కాపాడాలంటే ప్రశ్నించే గొంతుక గాలి అనిల్ కుమార్‌ను గెలిపించండి. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జహీరాబాద్ పట్టణానికి రూ. 150 కోట్లను మంజూరు చేసి అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లామని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ అందించారు. కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి రైతులకు మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరని హరీశ్‌రావు రేవంత్ రెడ్డిని దుయ్యబట్టారు.