- రోజు వారి భేటీలతో కెసిఆర్
- కార్యకర్తలకు అందుబాటులో కెటిఆర్
- క్షేత్రంలో హరీష్
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమై, పార్లమెంట్ ఎన్నికల్లో జీరో ఫలితాలు సాదించుకున్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు పోగొట్టుకున్న చోటే వెత్తుక్కోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్ది. పార్టీ వైఫల్యాలపై ఆత్మావలోకనం చేసుకోలేకపోయినా తప్పెవ్వరిదో గ్రహించుకుని దిద్దబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు కనిపిస్తున్నది. పార్టీ నాయకత్వం అందుబాటులో లేని కారణంగా ఓటమి చెందామని గ్రహించిన బిఆర్ఎస్ అగ్రనాయకత్వమిప్పుడు వ్యూహం మార్చుకుంటున్నట్టు స్పష్టమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు సాదించి కేవలం 1.8 ఓట్ల శాతంతో ఓడిపోయామని చెప్పుకున్న పార్టీ నాయకత్వం పార్లమెంట్ ఎన్నికల్లో అహర్నిశలు సర్వశక్తులొడ్డినా సున్నా ఫలితాలనే సాదించింది. దీంతో బిఆర్ఎస్ ఓటు 16 శాతంకు పడిపోయింది. ఈ దెబ్బకు పార్టీనుండి వరుసగా ఎమ్మెల్యేలు వలసబాట, ఎంఎల్సీల పక్క చూపులు, పార్టీ లీడర్లంతా కండువాలు మార్చుకోవడం వంటివి చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికీ ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ మంత్రులు, పది మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలతో పాటు మండల, జిల్లా స్థాయిలో బారీ సంఖ్యలో పార్టీ మారారు. దీంతో ఇక లాభం లేదనుకుని బిఆర్ఎస్ నాయకత్వం రంగంలోకి దిగింది. కెసిఆర్ తన ఫాం హౌజ్ కేంద్రంగా రోజువారి సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ లతో ఒక రోజు, మాజీ ఎమ్మెల్యేలతో రెండు రోజులు, జిల్లా పరిషత్ చైర్మన్లతో ఓ రోజు ఇలా.. జిల్లాల వారిగా రోజువారిగా భేటీలు నిర్విహించి వారికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ నాయకత్వం కెసిఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్ లో కూడా అందుబాటులో ఉంటున్నది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం తామేనని ద్వితీయ శ్రేణి నాయకత్వానికి బరోసా నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్విజన నేపధ్యంలో కొత్త వారికే అవకాశాలొస్తాయని ఆశలు కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు విఫల ప్రయోగమని నమ్మిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల చేరికలు, వలసలకు కెసిఆర్ తాత్కాలిక బ్రేక్ వేయగలిగారు. ఇదే క్రమంలో కెసిఆర్ జిల్లాలకు, మండలాల నేతలకు కూడా ఫోన్లు చేసి క్షేమ కుశలాలపై వాకబు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కెసిఆర్ ఇక..మారిన కెసిఆర్ అనే విదంగా వ్యవహరిస్తున్నారు. ఇంకో పక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా అటు తెలంగాణ భవన్, ఇటు నందీనగర్ ఇంటికి అందుబాటులో ఉంటున్నారు. పార్టీ క్యాడర్ తో పాటు పలు అంశాలపై జనాల్లోకెల్లే ప్రయత్నం చేస్తున్నారు. కెటిఆర్ కూడా గతంలో మాదిరిగా కాకుండా ఇక అందుబాటులో ఉంటున్నారనుకునే విధంగా వ్యవహరించడం పార్టికి శుభ పరిణామంగా తెలంగాణ భవన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
క్షేత్రంలో ట్రబుల్ షూటర్
అధినేత కెసిఆర్ వెంట నిత్యం అందుబాటులో ఉండే మాజీ మంత్రి హరీష్ రావు పార్టీకి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తనపై వచ్చే ఆరోపణలను, విమర్శలను ఓ వైపు తూర్పారపడుతూనే పార్టీ బలోపేతం కోణంలో పర్యటనలు నిర్వహిస్తున్నారు. కెసిఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల నేతలతో రోజూ టచ్ లో ఉంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో వారి ఇండ్లలకు వెళ్లి భావి రాజకీయాలపై చర్చించి భోరోసా ఇచ్చే ప్రయత్నం చేసున్నారు.