KCR | హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. 14 సీట్లు గెలిస్తే బీఆర్ఎస్ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చూపిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో కచ్చితంగా నిర్ధారణకు వస్తున్న విషయం ఏంటంటే.. ఇండియా కూటమికి దిక్కు లేదు. బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదుని చెబుతున్నారు. అందుకే మోదీ చొక్కాలు చింపుకుంటున్నారు. బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఆ పార్టీ 250 కంటే దాటే పరిస్థితి లేదు. దాంతో గాండ్రింపులు ప్రారంభించారు. కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది. కచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఈ దేశాన్ని శాసించే స్థాయికి పోతుంది. దేశంలో ఒక రివర్స్ సీన్ కనబడుతది. బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే ఎటు మద్దతిస్తారు అని జాతీయ మీడియా ప్రతినిధులు అడుగుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఏదో జోష్యం చెప్పట్లేదు.. బీజేపీకి వన్ ఆర్ నన్
ఈసారి ప్రాంతీయ పార్టీలం కలిసి బలమైన కూటమిగా ఏర్పడుతాం. మాకు కాంగ్రెస్, బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తది. మేం వాళ్లకు సపోర్ట్ చేసే రోజులు పోయాయి. ఎన్నికల తర్వాత దేశంలో స్కాండినేవియన్ కంట్రీలో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై వీళ్ల కూటమే పెద్దగా అవతరించబోతుంది. జాతీయ పార్టీలు తమతో కలిసి వస్తాయి. ఇది వంద శాతం నిజమే. నేను ఇది తిరిగొచ్చి చెబుతున్నా.. ఏదో జోష్యం చెప్పట్లేదు. బీజేపీకి ఈ రాష్ట్రంలో ఒకటి లేదా సున్నా.. బీజేపీకి డిజిట్ దిక్కు లేదంటే అమిత్ షా డబుల్ డిజిట్ అంటడు. దక్షిణాదిలో 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఏపీ సున్నా.. ప్రజ్వల్ రేవణ్ణ కేసు తర్వాత కర్ణాటకలో ఆరేడు సీట్లకే పరిమితమైంది బీజేపీ. 130 సీట్లు ఉన్నా దక్షిణాదిలో బీజేపీకి 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. ఉత్తర భారతంలో కూడా చాలా ఘోరంగా దెబ్బతింటుంది బీజేపీ అని కేసీఆర్ తెలిపారు.
ఢిల్లీ గులామ్‌ల కంటే తెలంగాణోళ్లు గెలిస్తేనే బెటర్
బీఆర్ఎస్ 12 లేదా 14 సీట్లు సాధిస్తుంది. ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ కనీసం 9 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. బీజేపీ సెకండ్ ఉన్నా తమతో దూరంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గోదావరి జలాలు దక్కించుకోవాలంటే, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే ఈ కీలక సమయంలో కేంద్రంలో మనం కీలకంగా మారాలి. 14 సీట్లు గెలిస్తే తెలంగాణ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చూపిస్తాను. ఇది మా తెలంగాణ అని తలెత్తుకునే విధంగా దేశ రాజకీయాలను శాసిస్తాం. ఒక ఒరవడిలో కాకుండా.. స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకని బీఆర్ఎస్‌నే గెలిపించాలి. బీఆర్ఎస్ ఇంటి పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. బీజేపీకి ఓటేస్తే అశాంతి అజడి తప్ప ఏం రాదు. అదో పిచ్చి పార్టీ. ఢిల్లీ గులామ్‌లు గెలిచి సాధించేది ఏం లేదు. కాంగ్రెసోళ్లు కూడా ఏం చేయరు. ఢిల్లీ గులామ్‌ల కంటే తెలంగాణోళ్లు గెలిస్తేనే బెటర్. తమిళనాడు మనకు ఆదర్శం. తమిళనాడు ద్రవిడ పార్టీలను గెలిపిస్తరు కానీ బయటి పార్టీలను గెలపించరు. ఈ రెండు పార్టీలను ఖతం చేయాలి అని కేసీఆర్ కోరారు.
ప్రతిపక్ష పాత్ర తప్పకుండా పోషిస్తాం
కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బస్సు యాత్రను విజయవంతం చేశారు. ఒక్కటే మాట మనవి చేస్తున్నా.. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు నమ్మకం లేదు. 14 ఏండ్లు అద్భుతంగా పురోగమిచం రాష్ట్రాన్ని సాధించాను. ఆ తర్వాత పదేండ్లు పూల పొదరిల్లు మాదిరిగా అందర్నీ గౌరవిస్తూ నీట్ గా ఉండే తెలంగాణను తయారు చేశాను. తలసరి ఆదాయం పెంచాను. మౌలిక సమస్యలు తీర్చాను. ఈ రోజు అనుకోకుండా మొన్న ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. ప్రజల తీర్పు శిరోధార్యం. ప్రతిపక్ష పాత్ర తప్పకుండా పోషిస్తాం అని కేసీఆర్ పేర్కొన్నారు.