Thursday, April 3, 2025
HomeTelanganaCabinet Expansion | విస్తరణకు విశ్రాంతి..

Cabinet Expansion | విస్తరణకు విశ్రాంతి..

JanaPadham_EPaper_TS_09-10-2024

విస్తరణకు విశ్రాంతి..

ఇప్పట్లో లేనట్టే..?!
నామినేటెడ్ తో సరి..
ఢిల్లీలో రోజంతా ఒంటరిగానే రేవంత్..
అపాయింట్ మెంట్ ఇవ్వని పెద్దలు..
హర్యానా షాక్ లో అధిష్టానం
నైరాశ్యంలో ఆశావహులు..
ముగిసిన సీఎం ఢిల్లీ పర్యటన
కేంద్రమంత్రులు అమిత్‌షా, ఖట్టర్‌ను కలిసిన రేవంత్
వరద సాయం, విభజన హామీలు..
ఐపీఎస్‌ల కేటాయింపుపై చర్చించిన సీఎం రేవంత్‌

కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు.., నెలలకు నెలలుగా అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నట్టు.., తీరుస్తారనుకున్నది ఊరిస్తూ ఏదో సాకుతో వాయిదా వేస్తూ., ఆగం చేస్తున్న తీరు అమోఘం., అత్యద్భుతం. నిన్నటి దాకా కొంచెం ఆశలైనా ఉండేగానీ, ఇయ్యాళ్టితో ఇక అయ్యేది ఇప్పట్లో లేదు., ఎప్పటికి అవుతుందో కూడా తెలియదు. ఇన్నాళ్లు కమ్ముకున్న పొరలు కాస్తా, ఆ రెండు రాష్ట్రాల ఫలితాలతో పూర్తిగా తొలగిపోవడంతో ఇక అమాత్య కొలువుల భర్తీ మరెప్పటికి మోక్షమో ఆ పైవాడికే తెలియాల్సిన పరిస్థితి. పాపం…… ఇదంతా తెలియక ఏదో ఓటి తేల్చుకుని పోదామని ఒంటరిగా ఎగేసుకెళ్లిన మన ముఖ్యమంత్రేమో మంగళవారమంతా ఢిల్లీ వీధుల్లో ఆగమాగం తిరిగిండు. ఇగ టైం ఇవ్వకపోతరా.., అగ కబురు పెట్టకపోతారా.. అని చూసీచూసీ కండ్లు కాయలు కాయడంతో చేసేది లేక వెర్రెత్తిన చిరాకుతో రిటర్న్ ఫ్లైట్ లో తిరుగటపా కట్టారు. ఏదిఏమైనా మంత్రులం కాబోతున్నామని ఫుల్ ఖుషీగా ఉన్న నేతలారా.. ఇప్పటికి మీ గతి ఇంతే.., మరెప్పటికైనా జరుగకపోతుందా.. అని ఆశగా గడపండంతే…….

===========

జనపదం, బ్యూరో

నిదానంగా గమనించాలి., అవకాశం కోసం వేచిచూడాలని, అధిష్టానం చెప్పు చేతుల్లో మెదలాలి., వారి అనుగ్రహం కోసం తచ్చాడాలి.., అన్నీ చేస్తున్నా అదృష్టం కలిసొచ్చే వరకు ఓపికగా నిరీక్షించాలి. అంతేగానీ లేడికి లేచిందే పరుగు అన్న మాదిరి యవ్వారం ఇక్కడ పని చెయ్యదు. పట్టిన కుందేటికి మూడేం ఖర్మం మరెన్ని అన్నా ఆశ్చర్యం ప్రదర్శించకుండా గమనించాలంతే. ఇది కాంగ్రెస్ మార్క్ రాజకీయం. పది నెలలుగా ఊరిస్తున్న పదవుల కోసం చూసినోళ్లంతా ఇక ఇప్పట్లో కాదుగానీ అదొచ్చినప్పుడు లేపండి అన్నట్టుగా నిద్రకు ఉపక్రమించేంత వైరాగ్యం. ఆయన ఢిల్లీ వెళ్లడం, ఒకటి రెండు రోజులు బిజిబిజిగా గడపడం, ఏదో మోసుకుని వస్తాడనే ఆత్రుతతో ఉన్నవారు ఎదురేగడం, ఓ మంచి ముహూర్తం చూసుకుని ఇప్పటికింతే.. అనే కంక్లూజన్ విని తువ్వాల దులుపుకుంటూ వెనుతిరగడం.. పరిపాటిగా జరుగుతున్నదే.
=======================

ఇప్పట్లో లేనట్టే..?!
పదవుల పంపకం ఇప్పట్లో లేనట్టే అనేది స్పష్టంగా తెలిసిపోయింది. దఫలవారీగా భర్తీ ప్రక్రియ ఉంటుందని హామీలు గుప్పించిన బాధ్యులు ఇప్పటికైతే ఇంతే అనే స్పష్టతతో తిరిగిరావడంతో తెలియని అనిశ్చితి., ఏమీ మాట్లాడలేని నిశ్శబ్దం. నామినేటెడ్ పదవులను విడుత వారీగా నింపుతూ, కష్టపడ్డొలను కాపాడుకుంటూ వెళ్తున్న తీరు బాగానే ఉన్నా, మరి మన వరకు వచ్చే సరికే ఎందుకింత నిర్లక్ష్యమనే నిరాశతో సీనియర్లంతా ఉసూరుమంటున్నారు. పుణ్యకాలం గడిచిపోతున్నది, ఇప్పుడుకాకుంటే ఇక ఎప్పటికీ టోపీ పెట్టుకుని వెళ్లాల్సిందే అనే అభద్రతతో ఉన్నవారంతా ఈ సారి కూడా సారీ.. అనే సమాధానంతో సర్దుకుని బయలుదేరారు. ఏతావాత నామినేటెడ్ వాళ్ల పరిస్థితి బాగుందరి రా బాబూ.. అనే అభిప్రాయానికి కూడా కొందరొచ్చినట్టు సమాచారం.

ఢిల్లీలో రోజంతా ఒంటరిగానే రేవంత్..
మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి షా నుంచి అందిన ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ ఢిల్లీకి బయలుదేరారు. సోమవారం ఆయా కేంద్ర మంత్రులను కలుస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కావాల్సిన వారికి మొరపెట్టుకుంటూ బిజిబిజిగా గడిపారు. కానీ, ఇవ్వాళ ప్రభుత్వంలో పలువురి భాగస్వామ్యం పెంచే అతికీలకమైన మంత్రి వర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో సమావేశం కావాల్సి ఉండగా వర్కౌట్ కాలేదు. ఎంతకీ అధిష్టానం ఆయనకు సమయమివ్వకపోగా, కనీసం వెయిట్ చేయండనే మాట కూడా చెప్పకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఏదైనా సలహానో, సూచనో అయినా చేసి పంపిస్తారని నిరీక్షించినా అదీ జరగలేదు. దీంతో 24 గంటల పాటు ఇంట్లోనే గడిపిన సీఎంకు అసలు విషయం అర్థమైంది. ఇక సమయం వృథా చేయకుండా, ఇక్కడ చేయాల్సిన కార్యాలపై సమయం మించిపోకుండా వెనుదిరిగారు.

హర్యానా షాక్ లో అధిష్టానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో సరిపడ అనుచరులను నింపుకోవడానికి ఆశగా చూస్తున్న వారితో పాటు బాధ్యత నిర్వర్తించాలని నిర్ణయించుకున్న సీఎంకు మంగళవారం ఊహించని షాకే తగిలింది. హర్యానా, జమ్ముకశ్మీర్ఎన్నికల ఫలితాల విడుదల కూడా ఈ రోజే కావడంతో అనుకున్నట్టుగా జరగలేదు. అందునా ఫలితాలు పూర్తిగా తారుమారుగా మారడంతో ఇక కలుసుకునే అవకాశం కూడా కల్పించకుండా పెద్దలంతా సీఎం రేవంత్ ను కలువడానికి ఇష్టపడలేదు. మరీ ముఖ్యంగా హర్యానా రిజల్ట్స్ హస్తం పార్టీకి ఊహించకుండా దెబ్బకొట్టడంతో ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా ఆ రాష్ట్ర ఫలితం మన రాష్ట్ర పదవుల పంపకాన్ని నిలుపు చేయించింది. దీంతో ఆశావహులు, ఎండ్లుగా పదవికి మోహం వాచిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. సీనియర్లుగా అనుభవం సంపాదించినా, సరైన సమయంలో దక్కాల్సిన మంత్రి పదవి ఊరిస్తుండడంతో చేసేది లేక తమలో తామే అనుచుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.

ముగిసిన సీఎం ఢిల్లీ పర్యటన
ఎట్టకేలకు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ముగిసింది. మా కోసం మా రాజు ఐదైనా బహుమతి తీసుకు రాకపోతాడా అని చూసిన వారు ఆయన కాస్త నిశ్శబ్దం వెనుదిరగడంతో తీవ్ర అసహనంతో ఉన్నారు. కేవలం కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పడుతున్న శ్రమను గుర్తించి ఇవ్వాల్సిన వాటితో పాటు మరికొన్ని అదనంగా మంజూరు చేయాలని వినతులు అందజేసిన సీఎం కాంగ్రెస్ పార్టీ పెద్దల దర్శనం కష్టమని తెలియడంతో ఖాళీ చేతులతో తిరిగొచ్చారు. మరీ ముఖ్యంగా పంట నష్టం, వరద ప్రభావిత ప్రాంతాల అభివృద్దికి కావాల్సిన నిధులు., అన్నింటికన్న ముఖ్యంగా ఐపీఎస్ ల కేటాయింపుపై తీవ్ర సమాలోచనలు చేసి తిరిగొచ్చారు.

ఒంటరి తనం.. పలుచనైన బలం..
సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సారి ఢిల్లీ పర్యటనకు ఎవరో ఒఖరిని వెంట పెట్టుకుని వెళ్లే వారు. పలుమార్లు డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, జూపల్లి., ఇలా ఎవరో ఒకరు అంతకు మించిన మంత్రులతో వెళ్లి అవసరాలను ఏకరువు పెట్టి సాధించుకుని వచ్చేవారు. కానీ ఈ సారి ఆయన ఒంటరిగానే కావాల్సిన సాధిస్తారని అనుకున్నా, ఏ మాత్రం సాధ్యం కాదని తెలుసుకుని ఉత్త చేతులతో వచ్చేశారు. ఆయన ఒంటరిగా వెళ్లడమే బలాన్ని హరించుకుపోయినట్టు అయిందని, దాని ప్రభావం కూడా సమాలోచనలపై పడిందని విశ్లేషించేవారు కూడా లేకపోలేదు.

RELATED ARTICLES

తాజా వార్తలు