AP Elections | అమరావతి : ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం అనేక చర్యలు చేపడుతోంది. ఓటు హక్కు ఉన్నవారంతా తప్పనిసరిగా ఓటేసేలా చర్యలు తీసుకుంటారు. ఇందుకు అనేక రకాల వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. ఆ మాదిరిగానే ఓ బార్బర్ కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు బంపరాఫర్ ప్రకటించారు. మే 13వ తేదీన ఓటేసిన వారందరికీ ఉచితంగా కటింగ్ చేస్తానని ఆఫర్ ఇచ్చారు. మరి ఆ బార్బర్ ఎవరో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ వెళ్లాల్సిందే.
విశాఖపట్టణానికి చెందిన మల్లువలస రాధాకృష్ణ ఓ సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇక తన దగ్గరకు కటింగ్ చేయించుకునేందుకు వచ్చే యువకులతో ఏపీ ఎన్నికలపై చర్చిస్తుంటాడు. ఓటు వేస్తున్నారా..? అని యువతను అడిగినప్పుడు ఏం వేద్దాం అనే సమాధానం వచ్చింది రాధాకృష్ణకు. చాలా మంది యూత్ ఇదే సమాధానం చెప్పడంతో.. ఓటింగ్‌కు ప్రాధాన్యాన్ని వారికి వివరించాడు. ఓటింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో రాధాకృష్ణ బంపరాఫర్ ప్రకటించారు ఓటర్లకు.
మే 13వ తేదీన ఎవరైతే ఎన్నికల్లో ఓటింగ్ వేస్తారో.. వారికి ఉచితంగా కటింగ్ చేస్తానని రాధాకృష్ణ ఆఫర్ చేశాడు. ఓటేసినట్లు సిరా గుర్తు చూపించిన వారందరికీ కటింగ్ చేస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క రూపాయి కూడా వారితో వసూలు చేయనని వాగ్దానం చేశాడు రాధాకృష్ణ. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని, దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని రాధాకృష్ణ కోరారు.