అమరావతి: లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (Elections) ముగిశాయి. ప్రజా తీర్పు ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగక తప్పదు. మరోవైపు ఇన్నాళ్లూ ప్రచార హడావుడి, మైకుల హోరు, రోడ్‌షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు.. ఇలా ప్రతిక్షణం హడావుడిగా గడిపిన అభ్యర్థులు, నాయకులు ఇప్పు డు సేదతీరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో ఏపీ సీఎం జగన్ (CM Jagan) కూడా ఉన్నారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు ఆయన కుటుంబ సమేతంగా ఫారెన్ టూర్‌కు వెళ్లనున్నారు. ఈమేరకు ఆయనకు సీబీఐ కోర్టు అనుమతి కూడా ఇచ్చింది.
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ అంతా తానై వ్యవహరించారు. సిద్ధం సభలు, బస్సు యాత్ర, రోడ్‌షోలు నిర్వహిస్తూ గత రెండు నెలలుగా ప్రజల మధ్యే ఉన్నారు. సోమవారం పోలింగ్ జరుగగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఖాళీ సమయం, తీరిక దొరకదని భావించి చాలా మంది పొలిటికల్ లీడర్స్ రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కూడా తన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్ కు వెళ్లనున్నారు. అక్కడ తన కుమార్తెతో సరదాగా గడిపేందుకు కుటుంబంతో కలిసి వెళ్లే క్రమంలో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. అయితే దీనిపై గత వారం వాదోపవాదనలు జరిగాయి. మే 15న సీబీఐ కేసు విచారణకు వస్తున్న నేపథ్యంలో అనుమతి ఇవ్వకూడదని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు.
అయితే సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కూడా అందుకు కౌంటర్ చేశారు. జగన్ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారని, ప్రస్తుతం ఆయన రాజ్యంగబద్దమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని, ఆయనను నమ్ముకుని ఒక రాష్ట్రంతో పాటు పార్టీ నేతలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. దీనిపై వాదనలు విన్న సీబీఐ న్యాయమూర్తి తీర్పును మే 14కు వాయిదా వేశారు. తిరిగి ఈరోజు తీర్పు వెలువరించే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్న సీఎం జగన్ ఇప్పటికే చాలా సార్లు ఇలా అనుమతి తీసుకుని లండన్, దావోస్ వెళ్లారు. గతంలో తన కుమార్తె ఉన్నత చదువుల కోసం ఆమెను లండన్‌లో విడిచిపెట్టి వచ్చేందుకు కూడా తోడుగా వెళ్లిన విషయం తెలిసిందే.