హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (DOST) షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. డిగ్రీ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం మొదటి విడుత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 25 వరకు విద్యార్థులు తమ పేర్లను నమోదుచేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం బుధవారం (మే 15) నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కావాల్సి ఉన్నది.
అయితే దానిని ఈ నెల 20వ తేదీకి ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. విద్యార్థులు వెబ్ఆప్షన్స్ 30వ తేదీ వరకు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మార్పుల విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచించారు. జూన్ 3న మొదటి విడుత సీట్లను కేటాయిస్తారు. మిగిలిన రెండు విడుతలు షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలోని 1066 కాలేజీల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ల ముఖ్యమైన తేదీలు..
- ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6న
- అర్హత గల విద్యార్థులు మే 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. మే 20నుంచి 30 వరకు ఈ అవకాశం ఉంటుంది.
- తొలి విడుత సీట్లను జూన్ 3న కేటాయిస్తారు.
- సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 4 నుంచి 10వ తేదీలోపు ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి.
- రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4న ప్రారంభం అవుతాయి. 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- జూన్ 4 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.
- రెండో విడత సీట్లను జూన్ 18న కేటాయిస్తారు.
- సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24 లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి.
- చివరిదైన మూడో విడుత రిజిస్ట్రేషన్ జూన్ 19న ప్రారంభం అవుతుంది. అదేనెల 25 వరకు
- విద్యార్థులు తమ పేర్లను నమోదుచేసుకోవచ్చు.
- జూన్ 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
- జూన్ 29న సీట్లను కేటాయిస్తారు.
- జూలై 3వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.
- జూలై 7 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయి.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి.
ఇందులో Candidate Pre-Registration అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ముందుగా Application Fee Payment పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి.
Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.