Chat GPT AI | గత 30 ఏండ్లుగా ఏక చత్రాధిపత్యం వహిస్తున్న గూగుల్‌కు పోటీగా సరికొత్త సెర్చ్ఇంజిన్ అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ అనుసంబంధ సంస్థ ఓపెన్ ఏఐ.. కృత్రిమ మేధస్సుతో కూడిన సెర్చ్ ఇంజిన్ ‘చాట్ జీపీటీ ఏఐ’ను త్వరలో ఆవిష్కరించబోతున్నట్టు ప్రకటించింది. ఇంతకు ముందు తాము తీసుకొచ్చిన ‘చాట్‌బోట్’ లానే ఇది కూడా ప్రజాదరణ పొందుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్‌లో ఏ విషయం వెతకాలన్నా ‘గూగుల్’ను ఆశ్రయిస్తాం. అలా ఒక సెర్చ్‌ఇంజిన్‌గా గత మూడు దశాబ్దాలుగా ‘గూగుల్’ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది.ఈ ప్లాట్‌ఫామ్‌ను కంపెనీ నిత్యం అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నది. అయితే ఏఐ సామర్థ్యాలతో చాట్‌జీపీటీ, చాట్‌బోట్ మార్కెట్లోకి రావటంతో.. గూగుల్ ఆధిపత్యానికి గండిపడింది. ఓపెన్ ఏఐ తన ‘చాట్ బోట్’కు లభించిన జనాదరణ చూశాక, గూగుల్‌కు పోటీగా ఏఐ సెర్చ్ ఇంజన్‌ను తీసుకొస్తున్నది. ఇది ఇంటర్నెట్‌లోని సమాచారమంతా మనముందు ఉంచేలా చేస్తుందని, నెటిజన్‌కు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
90ల్లో లారీపేజ్, సెర్గీ బ్రిన్‌లు స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో అనుకోకుండా కలిశారు. ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండటంతో వరల్డ్ వైడ్ వెబ్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలనే ఉద్దేశంలో సెర్చ్ ఇంజిన్ అభివృద్ధికోసం శ్రమించారు. వారిద్దరి కృషితో 1998, సెప్టెంబర్ 27న గూగుల్ సంస్థను స్థాపించారు. కాగా, గూగుల్ బీటా వెర్షన్ అదే ఏడాది సెప్టెంబర్ 6న ప్రారంభం కావడంతో దాన్ని కూడా గూగుల్ పుట్టిన రోజుగా పేర్కొంటున్నాయి. అయితే అధికారికంగా గూగుల్ బర్త్‌డేని సెప్టెంబర్ 27న నిర్వహిస్తున్నారు.