Sunday, December 29, 2024
HomeTelanganaDefected MLAs | చెవిలో పువ్వులు.. రోత పుట్టించే కథలు..

Defected MLAs | చెవిలో పువ్వులు.. రోత పుట్టించే కథలు..

Click To View JanaPadham E-Paper

మరీ అంత వీపీలమా……..!?
చెవిలో పువ్వులు.. రోత పుట్టించే కథలు..
కండువాలు.. కొత్త స్టోరీలు..

పది మంది పార్టీ మారలేదట..
స్పీకర్ కు ఇదే సమాధానం
దేవుడి కండువాలే : అరికపూడి గాంధీ
బీఆర్ఎస్ కే పీఏసీ చైర్మన్ ఇచ్చాం : శ్రీధర్ బాబు
ప్రతిపక్షం ఇవ్వకుండా ఇదేం పోకడ : వేముల ప్రశాంత్ రెడ్డి
కాంగ్రెస్ ను ఖూనీ చేసిందెవ్వరు : దుద్దిళ్ల

అర్.ర్..ర్…ర్….ర్రె…. ఇవి ఆ కండువాలా.., మేమే మరేవో అనుకున్నాం. ఓహో… మీరు చెప్పుతున్నారుగా ఇవి అవి కాదని.., అయితే ఇవి అవే అయినా కాదని నమ్మాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పారు., ఆ మాటకొస్తే మీరేది చెబితే అదే. నమ్మడం మాకు తప్పదు., నిండా ముంచడం మీ వంతు. అంతేకదా.., ప్రతిసారి నమ్మకంగా మోసం చేస్తారని తెలిసినా.., పిచ్చిగా నమ్మకపోతే మీ ఆటలెలా సాగుతున్నాయి. మేం పదేపదే నమ్ముతాం.., మీరు అదే పనిగా ముంచుతూనే ఉండండి. మొన్నటికి మొన్న అదో పార్టీ మీద అభిమానంతో గెలిపించుకుంటే, మీరు నమ్మకానికి పంగనామాలు పెట్టి., మేం ద్వేషించిన పార్టీ కండువాతో కనిపిస్తిరి. ఇంతకన్నా నమ్మక ద్రోహం ఇంకోటుంటదా..? ఆ వేళ మీరు అటు పార్టీలోనే ఉంటే మా నిర్ణయం ఎలా ఉండేదో కదా. ఎంతైనా మీకు మేం మరీ……… అంత……… అదిగా కనిపిస్తున్నామని, ఐదేండ్లు ఏమీ చేయలేమనే కదా మీ ఆటలు…. కానివ్వండి. మీరు కప్పుకున్నవి దేవుడి కండువాలంటారో., మరే గుడ్డలని చెబుతారో చెప్పండి… మేం వింటూనే ఉంటాం.
జనపదం, బ్యూరో
=====================

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కార్యాలయాన్ని తప్పు పడుతూ అలా తీర్పు వెలువడిందో లేదో, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. పీఏసీ చైర్మన్ అరికెపుడి గాంధీకి కట్టబెడుతూ జారీ చేసిన బులిటిన్ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష…. అన్నట్టు కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది కూడా. రాజకీయాలు చేయడం మాకూ వచ్చనే సంకేతానిస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని, కప్పుకున్నవి కాంగ్రెస్ కండువాలు కాదని అవి దేవుడి కండువాలని చెప్పించే ప్రయత్నం చేస్తోంది. స్పీకర్ పరిధిలోకి న్యాయవ్యవస్థ వేలుపెట్టకూడదని చట్టం చెబుతున్న విషయాన్ని నొక్కిగుర్తు చేస్తూ, కోర్టుకు కూడా స్పీకర్ కార్యాలయం త్వరలో గట్టి రిప్లయ్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. కాగా, కోర్టు తీర్పు, పీఏసీ నియామకం అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలక నేతల వ్యాఖ్యలు ఆసక్తికర రాజకీయాలకు తెరలేపుతున్నాయి.

ప్రతిపక్షానికే ఇవ్వాలని ఉందా..
అరికెపూడి గాంధీ

నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు. నాకు కప్పిన కండువా పైన ఏ పార్టీ గుర్తులు లేవు. దేవుడి శాలువా మాత్రమే కప్పుకున్న. సిఎం రేవంత్ రెడ్డి నాకు పాత మిత్రుడు. అభివృద్ది కోసం కలిసి పనిచేద్దామని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీలో చేరమని రేవంత్ రెడ్డి నన్ను ఎప్పుడు కోరలేదు. ప్రతిపక్షానికి పిఎసి ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా. నాకు పిఏసి ఇస్తే ఓర్వలేని తనం ఎందుకు. మనం ఏం చేశామో కూడా గుర్తుంచుకోవాలి. ఆనాడు శ్రీధర్ బాబుకి పిఎసి ఇవ్వకుండా పార్టీకి సంబంధంలేని MIM పార్టీ ఎమ్మెల్యే కు పిఎసి కట్టబెట్టాం. ప్రజాస్వామ్యం ఖునీ గురించి మాట్లాడుతున్నారు. వారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు. మీ వాదన చెప్పండి చర్చకు సిద్ధం. మీకు సమాధానం చెప్పేందుకు నేను రెడీ. మనం చేసిన తప్పులను మర్చిపోతే ఎట్ల? పిఏసి చైర్మన్ కోసం ఎమ్మెల్యేల సంతకాలతో నేను రూల్స్ ప్రకారం నామినేషన్ వేసాను. తప్పులుంటే వెళ్లి స్పీకర్ ను అడగండి. ఉప ఎన్నిక వస్తె ఎదుర్కోవడానికి నేను సిద్దం. గ్రౌండ్ చాలా క్లారిటీగా ఉంది నేనే గెలుస్తా.

అయినా.. బుద్ధి మారడం లేదు..
శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తు నిబంధనలు, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ సభను నిర్వహిస్తారు. సభ చైర్ ని అవమానించేలా ప్రతిపక్షాలు మాట్లాడటం సరైనది కాదు. వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు వ్యవస్థను గౌరవించాల్సిందే. సభాపతి ఒక ప్రక్రియ ప్రకారం అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేస్తారు. అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ మాట్లాడడానికి లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీ వ్యవహారాల పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజలు తీర్పు ఇచ్చిన 8 నెలలు గడిచినప్పటికీ బీఆర్ఎస్ నేతల తీరు మారలేదు. ప్రభుత్వాన్ని నడపమని ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు జీరో చేశారు. ప్రజలు జీరో చేసినప్పటికి బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదు. అధికారం కోల్పోయామన్న బాధతో బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ లను కాలరాసింది. కూల్చివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను తారుమారు చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క ను ఇబ్బంది పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు కాకుండా పీఏసీ పదవి ఎవరికి ఇచ్చారో అందరూ చూశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నేతల తీరు ఉంది. ప్రజాస్వామ్య, అధికార వ్యవస్థలను అడ్డగోలుగా నడిపారు. నిబంధనలు, సంప్రదాయాలు, రాజ్యాంగ బద్దంగా అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యే ని పీఏసీ చైర్మన్ చేశారని నమ్ముతున్నం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ ఎమ్మెల్యే లను ఎలా చేర్చుకున్నారో అందరూ చూశారు. వ్యవస్థలను కాలరాసింది, ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీలో బేధాభిప్రాయాలు ఉంటే మాకు సంబంధం లేదు. పీఏసీ ఛైర్మన్ గాంధీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పష్టంగా చెప్పారు. కేసీఆర్, పీఏసీ చైర్మన్ కు పడకపోతే మాకు సంబంధం లేదు. సంఖ్యా బలం పరంగా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పీఏసీ లో అవకాశం ఉందని రూల్ బుక్ స్పష్టం చేస్తోంది. రాజ్యాంగం గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందా..? రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు. బీఆర్ఎస్ లో ట్విట్లు పెట్టేది, మాట్లాడేది కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ వారిద్దరి మాత్రమే. ఎనిమిది నెలల్లో బీఆర్ఎస్ లో మాట్లాడుతుంది వారిద్దరు మాత్రమే. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి ని కలిశానని అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ప్రజాబలం ఉంది. ఇప్పటికే రెండు సార్లు బీఆర్ఎస్ అంతు ప్రజలు చూశారు. కోర్టు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పందించం, న్యాయస్థానం పైన మాకు గౌరవం ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పైన నాలుగు వారాల్లో ప్రక్రియను మొదలు పెట్టమని మాత్రమే కోర్టు చెప్పింది.. నిర్ణయం తీసుకోమని కాదు. ట్టసభలను న్యాయస్థానాలు ఎంత వరకు ఆదేశించవచ్చన్న దానిపైన తర్జనభర్జన జరుగుతోంది. అనర్హతపై కాలపరిమితితో నిర్ణయాలు తీసుకోవాలని 10 వ షెడ్యూల్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రజలు, సమాజం కోరుకునే విధంగా మా ప్రభుత్వ పాలన ఉంటుంది. పరిపాలన బాగుందని విపక్ష ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లో చేరతామంటే మేం వద్దనం. సీపీఐ ఇండియా కూటమి లో భాగస్వామి. వారు మాతోనే ఉన్నారని భావిస్తున్నాం. అధిష్టానం ఇచ్చే సూచనలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు అంతా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నాం. మా లో భేదాభిప్రాయాలు సృష్టించడానికి బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. కేసీఆర్ పదేళ్ల అనుభవాన్ని స్వీకరిస్తామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు… అయినా అసెంబ్లీకి రాలేదు.

 

ఏ లెక్కన ఇచ్చినట్టు..
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రెస్ మీట్ @భవన్

నిన్న అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం మూడు కమిటీలను ఏర్పాటు చేస్తూ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో ఏమైనా తప్పులు జరిగితే అసెంబ్లీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదిక ఇస్తుంది. మౌళిక సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడికి అవకాశం వస్తుంది. ప్రతిపక్ష నేత సూచించిన సభ్యుడికి అవకాశం ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికేపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి దక్కలేదు. ప్రభుత్వం చేసే లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వలేదు. అరికేపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా చేసే క్రమంలో ప్రభుత్వం తప్పులు చేసింది. ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ చేయకుండా సెలెక్షన్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు స్పీకర్ మూడు కమిటీల ఎన్నికలను ప్రకతించారు. మాకు రెండు గంటలు మాత్రమే సమయం ఇచ్చి నామినేషన్ వేయమని చెప్పారు. నామినేషన్ తీసుకున్న నెల రోజులకు కమిటీలను సడెన్ గా ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష నేత సూచించిన వారికి ఇస్తారు.
1958-59 నుండి ప్రతిపక్ష పార్టీ సభ్యుడు పీఏసీ చైర్మన్ గా ఎన్నిక అయ్యే సాంప్రదాయం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యులు పీఏసీ చైర్మన్ అయ్యారు. నాగం జనార్దన్ రెడ్డి పీఏసీ చైర్మన్ గా నాటి సీఎం వైఎస్ ఒప్పుకోకపోయినా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డిని పీఏసీ చైర్మన్ గా ప్రకటించారు. 2014 లో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నుండి కిష్టారెడ్డి, గీతా రెడ్డి పీఏసీ చైర్మన్లుగా పని చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్ పాయ్ లోక్ సభ పీఏసీ చైర్మన్ గా చేశారు. 2014,2019 లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కె.వి థామస్, మల్లిఖార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి పీఏసీ చైర్మన్లుగా చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత పీఏసీ చైర్మన్ గా కె.సి.వేణుగోపాల్ ఎన్నికయ్యారు. రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతున్నారు. ఢిల్లీలో ఏ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి వచ్చింది. తెలంగాణలో ఏ రాజ్యాంగం ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి రాలేదు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు, అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పింఛన్లు కట్ చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు పిలిచి పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. పీఏసీ చైర్మన్ ఎన్నికపై స్పీకర్ పునరాలోచన చేయాలి. మా పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీతో కలిసి పని చేయలేము. అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. గవర్నర్ ను కలవడమా లేక కోర్టులకు వెళ్లే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

RELATED ARTICLES

తాజా వార్తలు