హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కోడి ధరలు కొండెక్కాయి. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా వంద రూపాయాలకు పైగా ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడు కోడి కూర తినలేని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన కోడి ధరలతో మధ్య తరగతి ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
మే 6వ తేదీ వరకు కిలో చికెన్ రూ. 155 ఉండగా, మే 20 నాటికి ఆ ధర రూ. 172కి చేరింది. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ. 249గా ఉంది. విత్ అవుట్ చికెన్ కిలో ధర రూ. 249 కాగా, బోన్ లెస్ చికెన్ ధర రూ. 400గా నడుస్తోంది. చికెన్ ధరల పెరుగుదలకు ఎండలు కూడా కారణమని పౌల్ట్రీ యజమానులు పేర్కొంటున్నారు. ఈ ధరలు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు.
ఎండల వేడిమి కారణంగా కోళ్లు చనిపోతున్నాయని, దీంతో ఉత్పత్తి తగ్గిపోయిందని యజమానులు పేర్కొన్నారు. మే రెండో వారం నుంచి తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని చెప్పారు. చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక్కో గుడ్డుపై రూపాయి దాకా ధర పెరిగింది. దీంతో కోడిగుడ్డు కూడా తినలేని పరిస్థితి దాపురించింది.